అన్నదాతలకు వెన్నుదన్ను
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:59 AM
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించమే లక్ష్యం
స్థల సేకరణకు అధికారుల కసరత్తు
నాలుగు జిల్లాల రైతులకు మరింత మేలు
ఆర్‌వీకేలుగా మారనున్న ఏరువాక కేంద్రాలు
హనుమకొండ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున రైతు విజ్ఞాన కేంద్రాలను (ఆర్‌వీకే) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనితో హనుమకొండ, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్తగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు రోడ్డులో వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాలలో మరో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్నందువల్ల ఇక్కడ రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయరు. ఒక్కో ఆర్‌కేవీని సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఈ నాలుగు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు స్థలాలను సేకరించే పనిలో ఉన్నారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి రైతు విజ్ఞాన కేంద్రం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మండలంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందువల్ల ఇక్కడ స్థల సేకరణకు కసరత్తు జరుగుతోంది. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ సాగుతోంది.
ఆధునిక శిక్షణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల, ఎస్‌ఆర్‌ఎసీ కాకతీయ కాలువ ద్వారా అందే సాగునీటితో పాటు చెరువులు, కుంటలపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అన్నదాతలకు వాతావరణ మార్పులపై అవగాహన, పంటల మార్పిడి పద్ధతి, నేరుగా వరి విత్తడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను ఈ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నది.
ఆధునిక హంగులు
కొత్తగా ఏర్పడే రైతు విజ్ఞాన కేంద్రంలో ఆరుగురు శాస్త్రవేత్తలు, ఇతర సహాయక సిబ్బంది ఉంటారు. ఇప్పటికే ఆధునిక వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ, నూతన వ్యవసాయ విధానం, సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులు పెంచే విధంగా ఈ రైతు విజ్ఞాన కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తారు. ఈ కేంద్రంలో ప్రయోగశాల ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అనుబంధంగా విత్తన సాగు క్షేత్రాలుంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పించనున్నారు. దీంతో సాగు సమస్యల నుంచి రైతులకు చాలా వరకు విముక్తి కలగనున్నది. మొత్తంగా ప్రయోగఫలాలు అన్నదాతలకు చేరేందుకు అవకాశం కలుగుతుంది. రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుతో రైతులకు క్షేత్ర సందర్శనకు మంచి అవకాశం ఏర్పడుతుంది. సాంకేతిక చేరువై రైతులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. పంట సమస్యలు, చీడపీడల నివారణ, నేల రకం, తదితర సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడేందుకు ఈ కేంద్రాల వల్ల అవకాశం కలుగుతుంది.
ఏరువాకలు ఇక ఆర్‌కేవీలు
రాష్ట్రవ్యాప్తంగా 17 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) ప్రస్తుతం పని చేస్తున్నాయి ఇందులో కొంత మంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఏరువాక కేంద్రాలు, కేవీకేలకు అదనంగా 15 జిల్లాల్లో కొత్తగా రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఈ 17 ఏరువాక కేంద్రాలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా మారుస్తారు. కొత్తగా ప్రారంభమయ్యే అంకుర వ్యవసాయ సంస్థలకు అవసరమైన స్థలాలను కూడా వీటికి అనుబంధంగా అందుబాటులో ఉంచనున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో 75 మండలాలు ఉన్నాయి. 2 పరిశోధనా స్థానాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 17.95 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. రైతులు 21.68 లక్షల మంది ఉన్నారు. నేల స్వభావం నల్లరేగడి, ఎర్రచెల్క. పత్తి, వరి, మొక్కజొన్న మిర్చి, కంది, వేరుశనగ ప్రధాన పంటలు.
నాలుగు జిల్లాల్లో ఆర్‌వీకేలు : ఆర్.ఉమారెడ్డి, సహ పరిశోధనా సంచాలకుడు
కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే)లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) నిధులతో నడుస్తాయి. ఏరువాక కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పని చేస్తాయి. అయితే ఇవి అన్ని జిల్లాల్లో లేవు. ఈ ఏరువాక కేంద్రాలనే రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చి 33 జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నచోట కాకుండా మిగతా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు మధ్య తెలంగాణ మండలంలోని పది జిల్లాల్లో మూడు జిల్లాలు- భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం జిల్లా వైరా, మహబూబాబాద్ జిల్లా మల్యాలలో కేవీకేలు ఉన్నాయి. మిగతా ఏడు జిల్లాల్లో మూడింటిలో ఏరువాక కేంద్రాలు ఇది వరకే ఉన్నాయి. ఇందులో ఒకటి వరంగల్‌లో ఉండగా మిగతా రెండు సిద్ధిపేట జిల్లా తోర్నాల, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉన్నాయి. హనుమకొండ, జనగామ, ములుగు, జయశంకర్ జిల్లాల్లో కేవీకేలుగానీ, ఏరువాకలు గానీ లేవు కనుక ఇక్కడ కొత్తగా నాలుగు రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.