ఇరుకు గదుల్లో చదువులు.. గాలిలో ప్రాణాలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:03 AM
హనుమకొండలోని ఒక ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థి పోలేపల్లి జయంత్ వర్ధన్ (15) ఆకస్మిక మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థి మృతి సంచలనం సృష్టించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటన ఒకిం త విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
టెన్త్ విద్యార్థి మృతి.. అనేక ప్రశ్నలు
లిప్టులు లేని బహుళ అంతస్తుల పాఠశాల భవనాలు
మెట్లు ఎక్కలేక విద్యార్థులకు ఆయాసం.. అనారోగ్యం
బండెడు హోమ్‌వర్క్‌తో సతమతం
అత్యవసర చికిత్స వ్యవస్థ మృగ్యం
పట్టించుకోని విద్యాశాఖ అఽధికారులు
హనుమకొండ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండలోని ఒక ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థి పోలేపల్లి జయంత్ వర్ధన్ (15) ఆకస్మిక మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థి మృతి సంచలనం సృష్టించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటన ఒకిం త విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయంత్ మృతి కి కారణాలు ఇంకా నిర్ధారణ కానందు వల్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయంత్ మరణానికి అనారోగ్యమా ? లేక స్కూల్ యాజమాన్యం చదువు విషయంలో తెచ్చిన ఒత్తిడా ? పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప మిస్టరీ
వీడేలా లేదు. పుత్రశోకంతో తల్లడిల్లుతున్న జయంత్ తండ్రి వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు, అనుమానాలు, డిమాండ్లు ఆలోచింపజేస్తున్నాయి. కన్నీటితో ఆయన లేవనెత్తిన అంశాల వెనుక విద్యార్థుల విషయంలో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల ఆలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
బహుళ అంతస్థులు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలన్నీ బహుళ అంతస్థుల నిర్మాణాలే. నగరంలోని పేరున్న స్కూళ్ల భవనాలన్నీ నాలుగైదు అంతస్థుల కన్నా తక్కువ లేవు. రూ. కోట్లు ఖర్చు చేసి భారీ భవనాలు నిర్మిస్తున్నా లిప్టులు ఏర్పా టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పది కిలోలకు పైగా బరువున్న స్కూల్ బ్యాగులను మోసుకుంటూ మెట్లె క్కి ఆయాసంతో క్లాస్ రూంలకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో శారీరంగా వారు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. స్కూళ్లో ఉన్నంత సేపు అనేకసార్లు అన్నేసి మెట్లు ఎక్కుతూ దిగుతూ రోజంతా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థులు అలసిపోయి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శారీరకంగా అంతబలంగా లేని విద్యార్థులు, పుట్టుకతో కొన్ని లోపాలు కలిగినవారు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
శిక్షణ పొందని ఉపాధ్యాయులు
శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు విద్యార్థుల సైకాలజీపై ఒక అవగాహన ఉంటుంది. విద్యార్థుల మానసిక స్థితిని వారు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. శిక్షణలేని ఉపాధ్యాయులకు విద్యార్థుల సైకాలజీని అర్థం చేసుకోలేరు. ర్యాంకులే ముఖ్యమని భావించే యాజమాన్యాలు విద్యార్థులను నిత్యం చదవాలని ఒత్తిడి తేవడమే తప్పా వారి మానసిక స్థితిని పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. వారిపై ఒత్తిడి ఆకస్మిక మరణాలకు దారి తీస్తున్నాయి.
హోమ్ వర్క్ ఒత్తిడి
ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలల హోమ్ వర్క్ ఒత్తిడి దారుణంగా ఉంటోంది. ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా బండెడు హోమ్‌వర్క్‌ను అప్పగిస్తున్నారు. ఈ ఒత్తిడితో విద్యార్థి శారీరకంగా, మానసికంగా కూడా కృంగిపోతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లవాడు ఎంత హోమ్‌వర్క్ చేస్తే అంత బాగా చదువున్నట్లుగా భావించడంతో విద్యార్థి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ ఒత్తిడి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వారు తీవ్రమైన అనారోగ్యానికి గురికావడానికి కారణమవుతున్నాయి.
అత్యవసర చికిత్స వ్యవస్థ ఏదీ ?
జయంత్ వర్ధన్ కుప్పకూలిన తర్వాత తక్షణ వైద్య సాయం అందకపోవడం వల్లనే మరణించాడన్న వాదన వినిపిస్తోంది. అత్యవసర చికిత్స అంది ఉంటే తన కుమారుడు బతికేవాడని తండ్రి ఆవేదనలో అర్థమవుతోంది. వందల మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రైవేటు పాఠశాలల్లో వేటిలోనూ అత్యవసర వైద్యం అందించే సదుపాయాలు ఉండడం లేదు. నామమాత్రంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం తప్ప విద్యార్థి అస్వస్థతకు గురైనప్పుడు అత్యవసర చికిత్స అందించే ఏర్పాట్లు కానరావడం లేదు. విద్యార్థికి తక్షణ సాయం అందించకుండా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారు వచ్చేలోగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణానికి చేరువవుతున్నాడు. జయంత్ విషయంలో ఇదే జరిగిందని ఆయన తండ్రి ఆరోపిస్తున్నారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌నని, తన కుమారుడు పడిపోగానే ఒక గదిలో పడుకోబెట్టి తనకు ఫోన్ చేశారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే బతికే వాడంటున్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి తక్షణం వైద్య సాయం అందించే విషయంలో ప్రైవేటు పాఠశాలలకు తగిన అవగాహన, వ్యవస్థ లేకపోవడం చిన్నారుల మరణానికి దారితీస్తుందని జయంత్ మృతి ఘటన తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్‌బీఎ్‌సకే పథకం కింద ప్రతీ నెల వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం వారి ఆరోగ్య స్థితిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ప్రైవేటు పాఠశాలలకు ఎడాపెడా అనుమతులు ఇవ్వడం తప్పా వాటిలో విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకు సందుల్లో, బహుళ అంతస్థుల భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలను తనిఖీ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.