బెల్టు షాపుల జోరు.. జనం బేజారు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:43 AM
జిల్లాలో బెల్టు షాపులు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. వాడవాడకూ ఏర్పాటు అవుతోండడంతో మందు బాబుల చేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాలు, తండాల్లో జోరుగా బెల్టుషాపులు, గుడుంబా అ మ్మకాలు సాగుతోండడంతో మందు ప్రియులు మత్తులో జోగుతున్నారు.
జిల్లాలో 1,224 కేసులు.. అయినా ఆగని దందా
విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు
ఆగని బెల్లం అక్రమ దందా
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ శాఖ
నెహ్రూసెంటర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బెల్టు షాపులు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. వాడవాడకూ ఏర్పాటు అవుతోండడంతో మందు బాబుల చేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాలు, తండాల్లో జోరుగా బెల్టుషాపులు, గుడుంబా అ మ్మకాలు సాగుతోండడంతో మందు ప్రియులు మత్తులో జోగుతున్నారు. దసరా దగ్గర పడుతుండడంతో పండుగకు పట్టణ శివారు గ్రామాల్లో ఇప్పటికే గుడుంబా, బెల్లం డంపులు పెద్దఎత్తున దిగాయనే ఆరోపణలు వస్తున్నా.. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామాల్లో గుడుంబా ఫుల్..
మహబూబాబాద్ జిల్లాలో మద్యం, గుడుంబా ఏరులై పారుతున్నా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ, చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామా ల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం అ మ్మకాలు జోరుగా కొనసాగుతున్నా చోద్యం చూస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో మద్యం ప్రియులు ఆ సమయంలోనే తాగి రోడ్లపై దొర్లుతున్నారని.. అయినా, ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాటి ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రోజంతా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడంతో వాటిని తాగిన మద్యం ప్రియుల ఇళ్లలో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆగని బెల్లం దందా..
జిల్లాలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో కొంతమేర దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నప్పటికి బెల్లం, పటిక, గుడుంబా అక్రమంగా రవాణా చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాలు, గిరిజన తండాలను కేంద్రంగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని అక్రమార్కులు అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అక్రమ రవాణాకు కొత్తపుంతలు తొక్కుతున్నారు.
రాత్రి వేళల్లో ఘర్షణలు..
ప్రధానంగా రాత్రి వేళల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, దీంతో ఆ సమయంలో ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తుందని జనం వాపోతున్నారు. కొంద రు పీకలదాకా తాగి రోడ్డుపై పడిపోతుండడంతో వారిని భుజానికెత్తుకొని ఇళ్లకు చేరుస్తున్న ఘటనలు రోజూ చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. మద్యం దుకాణాల నిర్వాహకులు గ్రామాల వారీగా బెల్టు దుకాణాలకు అప్పుగా మద్యం ఇస్తుండడంతో వీటి సంఖ్య భారీగా పెరిగిపోతోందని, పెట్టుబడి కూడా లేకపోవడం.. భారీగా ఆదాయం వస్తుండడంతో గ్రామాల్లో పెద్దఎత్తున బెల్టు దుకాణాల సంఖ్య పెరిగి పోటీలు పడి అమ్మకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలో నమోదైన కేసులు ఇలా..
జిల్లాలో అక్రమంగా బెల్లం, పటిక, గుడుంబా రవాణాను నియంత్రించడానికి ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ల ఆధ్వర్యంలో 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు 756 గుడుంబా కేసులు నమోదు అయ్యాయి. బెల్లం పానకం 85,810 లీటర్లను ధ్వంసం చేయగా.. 86,245 కిలోల బెల్లంను సీజ్ చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న 22 బెల్టుషాపులపై కేసులు నమోదు చేశారు. గంజాయి కేసులో పట్టుబడిన ఒకరిపై కేసు, 1087 మందిని బైండోవర్ చేసి అందులో 10మం దిని బ్రీచ్ కేసులో రిమాండ్‌కు పంపించారు. వెరసి జిల్లా వ్యాప్తంగా 1,224 కేసులను నమోదు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఆబ్కారి అధికారి అప్‌అండ్‌డౌన్..
జిల్లా ఆబ్కారిలో టాస్క్‌ఫోర్స్ సీఐ స్థాయి అధికారి రోజువారిగా ఓ ఎక్స్‌ప్రెస్ టూ ఎక్స్‌ప్రె్‌సకు అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే సిబ్బంది సైతం నిర్లక్ష్యంగానే పనిచేస్తున్నారు. సదరు అధికారి ఏదో డ్యూటీకి వచ్చామా! వెళ్లామా అనే రీతిలో ఉదయం ఎక్స్‌ప్రె్‌సకు వరంగల్ నుంచి మహబూబాబాద్‌కు రావడం, మానుకోట నుంచి సాయంత్రం వరంగల్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. నెలలో ఒకటి రెండు దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన టాస్క్‌ఫోర్స్ అధికారి ఇలా అప్‌అండ్‌డౌన్ చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే జిల్లాలో మాదకద్రవ్యాలు, గుడుంబా, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏమైనా అంటే కొద్ది రోజుల్లో వరంగల్‌కు బదిలీ అవుతానని.. ఏదో నడిపిస్తున్నాం కదా అని మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి దృష్టి సారించి టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని సరిచేయాలని పలువురు కోరుతున్నారు.
అప్‌అండ్‌డౌన్ చేస్తే చర్యలు తీసుకుంటాం : బాదావత్ కిరణ్‌నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్
దసరా పండుగకు అక్రమంగా తరలించే బెల్లం, సారా, పటికను నియంత్రించడానికి ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, ఎన్ ఫోర్స్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు చేపడుతున్నాం. అధికారులు అందుబాటులో ఉంటూ నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. అప్‌అండ్‌డౌన్ చేస్తున్నట్లు తమ దృష్టిలో లేదు. ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.