పంచాయతీ పోరుకు సై
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:44 AM
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లా యంత్రాంగాలు ఏ ర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. బీసీ లకు 42శాతం రిజర్వేషన్ల ఆమోదం కూడా పొందడంతో ఏ క్షణాన్నయినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా ఏర్పాట్లు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు
గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా ఓటర్ల జాబితా
నేడు తుది జాబితా ప్రకటన
90 శాతం ఏర్పాట్లు పూర్తి
బ్యాలెట్ బాక్సులు సిద్ధం
పోలింగ్ సిబ్బంది నియామకం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారుతో ఉత్సాహం
హనుమకొండ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లా యంత్రాంగాలు ఏ ర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. బీసీ లకు 42శాతం రిజర్వేషన్ల ఆమోదం కూడా పొందడంతో ఏ క్షణాన్నయినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా ఏర్పాట్లు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గు ర్తింపు, రూట్ మ్యాపులు సిద్ధం చేయ డం, సిబ్బంది నియామకం, వారికి శిక్షణ ఇవ్వడం తదితర ఏర్పాట్లు 90శాతం వ రకు పూర్తయ్యాయి. ఇక మిగిలింది తుది ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరా రు. ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. ఆ మేరకు జాబితాలు సిద్ధం అయ్యా యి. ఓటర్ల తుది జాబితాను మంగళవారం ప్రచురిస్తారు. దీనితో పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎంతమంది అనేది తేటతెల్లం కానున్నది.
పంచాయతీల స్వరూపం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు, 15,006 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 2,754 వార్డులు, 2,754 పోలింగ్ కేంద్రాలు, హనుమకొండ జిల్లాలో 210 పంచాయతీలు, 1,986 వార్డులు, 1,986 పోలింగ్ కేంద్రాలు, జనగామ జిల్లాలో 280 పంచాయతీలు, 2,534 వార్డులు, 2,534 పోలింగ్ కేంద్రాలు, మహబూబాబాద్ జిల్లాలో 482 పంచాయతీలు, 4,110 వార్డులు, 4,110 పోలింగ్ కేంద్రాలు, ములుగు జిల్లాలో 171 పంచాయతీలు, 1,520 వార్డులు, 1,535 పోలింగ్ కేంద్రాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 248 పంచాయతీలు, 2,101 వార్డులు, 2,102 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
సిద్ధమైన ఓటర్ల జాబితాలు
పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంటోంది. కార్యదర్శులు పంచాయతీల వారీగా ఓటర్ల వివరాలను పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ఆగస్టు 10వ తేదీతో ముగిసింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ తయారు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రూపొందించి ఎంపీడీవోల లాగిన్ ద్వారా టీపోల్ పోర్టల్‌లో నమోదు చేశారు. అయితే పంచాయతీలు వార్డుల సంఖ్య పెరగడం లేదా కొన్ని చోట్ల తగ్గడం జరిగిన నేపథ్యంలో మళ్లీ ఓట్లర్ల జాబితాను సిద్ధం చేయాల్సి వచ్చింది. ఈ మేరకు తాజాగా ఓటర్ల సవరణను చేపట్టారు. ఎన్నికల సంఘం ఇటీవలే సవరణకు షెడ్యూల్ జారీ చేసింది. దీని ప్రకారం మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఆగస్టు 28న గ్రామ పంచాయతీల వారీగా ఫొటో ఎలక్టోరల్ ముసాయిదా జాబితాను తయారు చేశారు. 29వ తేదీన ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులు జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. 30వ తేదీన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల స్థాయిలో ఎంపీడీవోలు నిర్వహించారు. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వార్డులవారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించారు. 31న వచ్చిన అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించారు. ఈనెల 2వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.
వార్డుల వారీగా విభజన
గతంలో అనుబంధ గ్రామాలుగా ఉన్న పంచాయతీలు నేడు ప్రత్యేక పంచాయతీలుగా ఆవిర్భవించాయి. అందుకే పంచాయతీ కార్యదర్శులు ముందుగా పంచాయతీల వారీగా ఓటర్లను పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత రెండో దశలో పంచాయతీలకు వచ్చిన ఓటర్లతో వార్డుల వారీగా విభజించారు.. ఈ ప్రక్రియలో ఒక కుటుంబ సభ్యుల ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొత్త జాబితాలో మృతుల పేర్లను తొలగించడంతో పాటు కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారి పేర్లను చేర్చారు. ప్రస్తుత ప్రక్రియ కారణంగా ఓటర్ల వరుస సంఖ్యలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
కొత్తగా నమోదైన ఓటర్లను ఎక్కడ చేర్చాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత వరకు వారు నివసిస్తున్న వార్డులో ఓటు ఉండేలా చూశారు. ఆ వార్డుకు ఓటర్ల సంఖ్య పరిమితి మించితే ఇతర ప్రాంతానికి మార్చారు. ఓక్కో వార్డుకు 300 మందిలోపు ఓటర్లు ఉండేలా విభజన ప్రక్రియను చేపట్టారు. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లో వారి పేర్లను స్థానికతను బట్టి చేర్చారు. తుది ఓటర్ల జాబితా నాటికి ఎంత మంది పెరిగేది ఈనెల 2న ప్రచురించే తుది ఓటర్ల జాబితాను బట్టి తెలుస్తుంది. గతంలో కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
పోలింగ్ కేంద్రాలు
ఉమ్మడి జిల్లాలో పంచాయతీల సంఖ్య, వార్డు స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పోలింగ్ కేంద్రాల సంఖ్యలో కూడా హెచ్చు తగ్గులు ఉండనున్నాయి. ములుగు జిల్లాలో ఇది వరకు 174 పంచాయతీలు ఉండేవి. వీటిలో మూడు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో వీటి సంఖ్య 171కి తగ్గింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది వరకు 241 పంచాయతీలు ఉండేవి. ఏడు అదనంగా వచ్చి చేరడంతో వీటి 248కి పెరిగింది. జనగామ జిల్లాలో గత ఏడాది రెండు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. స్టేషన్‌ఘపూర్ మున్సిపాలిటీ కావడంతో మూడు గ్రామపంచాయతీలు ఇందులో విలీనం అయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం 280 జీపీలు ఉన్నాయి.
శిక్షణ
ఎన్నికల నిర్వహణకు ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, పీవోల నియామక ప్రక్రియ పూర్తయింది. వీరితో పాటు బీఎల్‌వోలకు శిక్షణ ఇవ్వడం కూడా పూర్తయింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. ఫారిన్ సర్వి్‌సపై ఇతర ప్రభుత్వశాఖల్లోకి డిప్యూటేషన్‌పై వెళ్లిన పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు గాను పక్షం రోజుల కిందట తిరిగి మాతృశాఖకు బదిలీ చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రి జిల్లా పంచాయతీ కార్యాలయాలకు ఇది వరకే చేరింది. బ్యాలెట్ బాక్సుల కొరత లేకుండా చూడడానికి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పక్క రాష్ట్రాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. ఇక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినరట్లుగా తెలుస్తోంది. దాదాపు అవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల సందడి
పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారింది. సామాజికవర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుంటే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సగం దాకా మహళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రామాల్లో సామాజిక వర్గాల జనాభా శాతం, మహిళల సంఖ్యతో పాటు గతంలో వరుసగా మూడు సార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.