సమరానికి సై..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:39 AM
స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు జరగగా, తుది తీర్పును గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లతో ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.
నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్
రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
తొలి విడతకు నేటి నుంచి 11వరకు నామినేషన్ల స్వీకరణ
15న ఉపసంహరణ.. 23న ఎన్నికలు..
రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు
19న ఉపసంహరణ.. 27న ఎన్నికలు.. నవంబరు11న రెండు విడతల ఓట్ల లెక్కింపు
ఉమ్మడి జిల్లాలో 778 ఎంపీటీసీ, 74 జడ్పీటీసీ, 1,708 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
తొలి విడతలో 37, రెండో విడతలో 38 మండలాల్లో ఎన్నికల నిర్వహణ
అక్టోబరు 17నుంచి నవంబరు 8వ తేదీ వరకు మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్ : స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు జరగగా, తుది తీర్పును గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లతో ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. గురువారం షెడ్యూల్ ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండు విడతల్లో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరణ పర్వం మొదలు కానుంది.
రెండు విడతల్లో ఎన్నికలు..
ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 75 మండలాలు ఉన్నాయి. వీటిలో ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలపై కోర్టు స్టే ఉండటంతో అక్కడ మినహా మిగతా 74 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 12వ తేదీన నామినేషన్ల పరిశీన, 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
అలాగే రెండో విడతలో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే 16వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19వ తేదీన ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. 27 తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇక సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడత 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 20వ తేదీన నామినేషన్ల పరిశీలన, 23వ తేదీన ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. 31న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిచించనున్నారు. 24వ తేదీన పరిశీలన, 27వ తేదీన ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. నవంబరు 4వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మూడో విడత 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టి, 31వ తేదీన ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. నవంబరు 8వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి, విజేతలను ప్రకటించనున్నారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లను నవంబరు 11వ తేదీన చేపట్టనున్నారు.
75 జడ్పీటీసీ, 778 ఎంపీటీసీ, 1,078జీపీలకు ఎన్నికలు
స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది. తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 75 మండలాల్లో 778 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే మలుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కోర్టులో కేసు ఉండటంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించటం లేదు. 74జడ్పీటీసీ స్థానాలకే ఈసారి ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే మంగపేట మండలంలోని 14ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు లేకపోవటంతో 764 ఎంపీటీసీ స్థానాలకే ఎన్నికలు జరుగనున్నాయి. 1,708 గ్రామపంచాతీలు ఉండగా, మంగపేట మండలంలోని 55జీపీలు పోగా, 1,653 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత మంగపేట మండలంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచులతో పాటు 14,786 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచులను కూడా ఎన్నిక చేయనున్నారు. మొత్తం 75 మండలాలు ఉండగా, తొలి విడతలో 37 మండలాలు, రెండో విడతలో 38మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటికి 42శాతం బీసీ రిజర్వేషన్లు కలిపితే 69శాతం రిజర్వేష్లు అవుతుంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని రెడ్డి జాగృతి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం జాగృతి నేతలు, ప్రభుత్వం తరుపున హైకోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం హైకోర్టు గురువారం మధ్యాహ్నానికి తీర్పు వాయిదా వేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి రోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం నామినేషన్‌లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాత్రం హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూడాలని నిర్ణయించకున్నారు.