Share News

వస్తున్నారదిగో వారసులు...

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:55 AM

స్థానిక ఎన్నికల భేరి ఉమ్మడి జిల్లాలో సరికొత్త రాజకీయ వాతావరణానికి తెరతీస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలో నవయువ రక్తంతో కూడిన వారసుల సందడి కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా రాజకీయాల్లో స్థిరపడిన నేతలు తమ వారసుల రాజకీయాలకు దారులు వేస్తున్నారు. ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

వస్తున్నారదిగో వారసులు...

  • అధికార కాంగ్రె్‌సలో రాజకీయ సందడి

  • జడ్పీ పీఠాలపై నేతల నజర్‌

  • వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు కసరత్తు

  • జడ్పీ చైర్మన్‌ పదవిని రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా భావిస్తున్న నేతలు

  • రిజర్వేషన్‌ కలిసిరాని చోట వైస్‌చైర్మన్‌ పదవిపై కన్ను

  • జడ్పీటీసీ స్థానం నుంచి పోటీకి ప్రణాళిక

  • జిల్లా చైర్మన్‌ పదవి దక్కితే ఎమ్మెల్యే టికెట్‌ రేసులోకి రావచ్చనే ఆలోచన

స్థానిక ఎన్నికల భేరి ఉమ్మడి జిల్లాలో సరికొత్త రాజకీయ వాతావరణానికి తెరతీస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలో నవయువ రక్తంతో కూడిన వారసుల సందడి కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా రాజకీయాల్లో స్థిరపడిన నేతలు తమ వారసుల రాజకీయాలకు దారులు వేస్తున్నారు. ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జడ్పీ పీఠంపై కన్నేసి తమ వారసులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసిరాకుంటే జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలకు స్థానికసంస్థల ఎన్నికలే కీలకంగా భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు, టికెట్‌ రాని నేతలు.. తమ రాజకీయ వారసుల కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉమ్మడి జిల్లాలోని అన్ని జడ్పీ చైర్మన్‌ స్థానాల్లో హస్తం పాగా వేయాలని నేతలకు టార్గెట్‌ పెట్టింది. దీంతో ఓరుగల్లులో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆరాట పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. తన కుమార్తె కావ్యను ఎంపీ బరిలో దించి గెలిపించుకున్నారు. కడియం శ్రీహరిని చాలామంది నేతలు స్ఫూర్తిగా తీసుకుని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేలో పనిలో పడ్డారు. తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేసేందుకు స్థానిక ఎన్నికలను టార్గెట్‌గా చేసుకున్నారు. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా జడ్పీ చైర్మన్‌ లాంటి కీలకమైన పదవిపై దృష్టి సారించారు.

ప్రధానంగా ఎస్సీ మహిళకు రిజర్వు అయిన హనుమకొండ జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దొమ్మాటి సాంబయ్య.. తన కూతురు దొమ్మాటి మౌనికను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీకి చేరిన జాబితాలో మౌనిక పేరును జిల్లా పార్టీ నేతలు ప్రతిపాదించినట్లుగా సమాచారం. పరకాల జడ్పీటీసీ స్థానం జనరల్‌గా ఉండటంతో ఇక్కడి నుంచి తన కూతురిని బరిలో దించేందుకు దొమ్మాటి రంగంలోకి దిగారు. సొంత మండలం కావటంతో పాటు దొమ్మాటికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌, లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ చేజారాయి. దీంతో పార్టీలో మౌనిక విషయంలో ఎలాంటి విభేదాలు లేకుండా జడ్పీ చైర్‌పర్సన్‌గా అంగీకారం తెలిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి సైతం చర్చలు జరిపారని విశ్వసనీయ సమాచారం.

ఇక ములుగు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. తొలుత మంత్రి సీతక్క.. తన కుమారుడు సూర్యను రాజకీయాల్లోకి తీసుకవచ్చేందుకు జడ్పీ ఎన్నికలను అవకాశంగా తీసుకుంటారని ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యకు పినపాక అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని సీతక్క పట్టుపట్టారు. అయితే రాజకీయ సమీకరణలో సూర్యకు టికెట్‌ దక్కకుండా పోయింది. జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావటంతో సూర్య సతీమణి కుసుమను బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ములుగు జడ్పీటీసీ స్థానం ఎస్టీ జనరల్‌గా రిజర్వు కావటంతో కుసుమను బరిలో దించి జడ్పీ చైర్‌పర్సన్‌ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్టీ మహిళల్లో ఈ స్థాయిలో పదవిని చేపట్టే నాయకురాలు లేర ని, కాంగ్రెస్‌ కేడర్‌ కూడా కుసుమ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ

నడుస్తోంది. ఇదిలావుండగా ములుగు జడ్పీ స్థానం నుంచి సీతక్క మేనకోడలు భవాని పేరు కూడా వినిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో సీతక్కకు సహయంగా భవాని పని చేస్తుందని, కుసుమ పోటీకి ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే భవారిని బరిలో దించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అలాగే మహబూబాబాద్‌ జడ్పీ చైర్మన్‌ స్థానం జనరల్‌కు కేటాయించారు. అయితే సీఎం సలహాదారుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి.. తన కుమారుడు వేం కృష్ణభార్గవ్‌రెడ్డ్డిని బరిలో దించుతారనే ప్రచారం జరిగింది. అయితే తన సొంత మండలం కేసముద్రం జడ్పీటీసీ ఎస్టీ జనరల్‌కు రిజర్వుడు కావటంతో పోటీకి విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. మహబూబాబాద్‌లో 18 జడ్పీటీసీలు ఉండగా, ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గంగారం జడ్పీటీసీ మాత్రమే జనరల్‌కు కేటాయించారు. దీంతో మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా గంగారం నుంచి పోటీ చేయటంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదని సమాచారం. నామినేషన్లకు సమయం ఉండటంతో నరేందర్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనలో కేసముద్రం లేదా నెక్కొండ కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడుతుందని, అక్కడి నుంచి వేం తన వారసుడిని బరిలో దించుతారనే ప్రచారం జరుగుతోంది.

ఇక జనగామ జడ్పీచైర్మన్‌ స్థానం ఎస్సీకి రిజర్వు చేశారు. రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి రిజర్వేషన్‌ కలిసిరాలేదు. దీంతో జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవిని దక్కించుకుని క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బచ్చన్నపేట జడ్పీటీసీ స్థానం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొమ్మూరి వారసుడిగా ప్రశాంత్‌రెడ్డి పరిషత్తు ఎన్నికల బరిలో దిగుతారని కేడర్‌లో ప్రచారం జరుగుతోంది.

వరంగల్‌ జడ్పీ చైర్మన్‌ ఎస్టీ జనరల్‌కు రిజర్వుడు అయింది. ఇక్కడ వారసుల దృష్టి పెద్దగా లేదు. అయితే నర్సంపేట జడ్పీటీసీ ఎస్టీ మహిళకు, ఖానాపూర్‌ జడ్పీటీసీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యాయి. జడ్పీ చైర్మన్‌ కావాలంటే ఈ రెండు చోట్ల నుంచి జడ్పీటీసీగా ఎంపిక కావాల్సి ఉంది. ఈ రెండు జడ్పీటీసీ స్థానాలు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎవరు పోటి చేస్తారనేది క్యాడర్‌లో కూడా స్పష్టత లేదు. కాగా, పర్వతగిరికి చెందిన మాజీ జడ్పీటీసీ ఒకరు ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరపున పోటి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇక బీఆర్‌ఎ్‌సలో కూడా వారసుల సందడి కనిపిస్తోంది. ప్రధానంగా పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి కుమారుడు సిరికొండ ప్రశాంత్‌ ఈసారి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ బీసీ జనరల్‌ కావటంతో భూపాలపల్లి జడ్పీటీసీగా పోటీ చేస్తారని సిరికొండ వర్గీయులు పేర్కొంటున్నారు.

మొత్తంగా నేతలు తమ రాజకీయ వారసులను పరిషత్తు ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొందరికి అధిష్ఠానం ఆశీస్సులు లభించగా, మరికొందరు పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. దీంతో ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల రసవత్తరంగా మారుతున్నాయి.

అలాగే భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ సీటుపై మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతూ దృష్టి పెట్టారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిట్యాల జడ్పీటీసీ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అలాగే జనగామ జడ్పీ చైర్మన్‌ సీటు స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు వినిపిస్తోంది. అలాగే మహబూబాబాద్‌ జడ్పీ చైర్మన్‌ పదవి నుంచి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు తప్పుకుంటే మరో నాయకుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డికి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

టార్గెట్‌ అసెంబ్లీనే...

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తమ వారసులను బరిలో దించుతున్న నేతల అసలు టార్గెట్‌ అసెంబ్లీ ఎన్నికలే అనే ప్రచారం ఉంది. 2028లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. కొత్తగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడు, నాలుగు స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త అసెంబ్లీ స్థానాలతో పాటు పాత అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్ల మార్పు, సరిహద్దుల మార్పులు జరుగున్నాయి. అంతేకాకుండా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు కానుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యే వరకే క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్‌ అడిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తమతో పాటు వారసులకు కూడా అదృష్టం ఉంటే పోటీ చేసే అవకాశం దొరుకుతుందనే లెక్కల్లో నేతలు ఉన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:55 AM