కొత్త ‘రేషన్’
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:55 PM
జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు పొందిన పేదలకు సెప్టెంబర్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారుకుల రేషన్ కోటా కూడా కేటాయించి, విడుదల చేశారు. దీంతో వచ్చేనెల నుంచి కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
27 వేల నూతన కార్డుదారులకు తొలిసారి సన్నబియ్యం
జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,70,731
5,127 మెట్రిక్ టన్నుల రైస్ కేటాయింపు
వచ్చేనెలలో నూతన లబ్ధిదారులకు పంపిణీ
జిల్లాకు 2.4 లక్షల చేతి సంచులు రాక
దసరాకు సంచులు ఇచ్చేందుకు సన్నాహాలు
మహబూబాబాద్ అగ్రికల్చర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు పొందిన పేదలకు సెప్టెంబర్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారుకుల రేషన్ కోటా కూడా కేటాయించి, విడుదల చేశారు. దీంతో వచ్చేనెల నుంచి కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ బియ్యం అందించడం జరిగింది. ఈ సారి ఒక నెలకు సంబంధించిన రేషన్ బియ్యం మాత్రమే చౌకదారుల దుకాణం నుంచి అందించనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు దారులకు ఒక చేతి సంచిని కూడా ఉచితంగా అందించనుంది. కొత్త కార్డుదారులకూ రేషన్ అందుతుండడంతో లబ్ధిదా రులు ఆనందంతో ఉన్నారు.
పెరిగిన కార్డులు ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తోంది. గత మూడు నెలలకు సంబంధించిన రేషన్‌బియ్య జూన్‌లో అందించగా ఈ సారి ఒకే నెలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేసింది. జిల్లాలో ఏఎ్‌ఫఎ్‌ససీ కార్డులు 16823 ఉండగా ఎఫ్‌ఎ్‌ససీ 2,53,906 కార్డులు, ఏఏపీ 2 కార్డులు వెరసి 2,70,731 రేషన్‌కార్డులు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. అన్ని రేషన్‌కార్డులలో 8,03,717 మంది సభ్యులు ఉన్నారు. అన్ని రేషన్‌కార్డులకు కలిపి సెప్టెంబర్ నెలలో 5,127.945 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించడం జరిగింది. అయితే రేషన్‌కార్డులు పెరగడంతో పాటు బియ్యం కోటా కూడా పెరగడం జరిగింది.
కొత్త రేషన్‌కార్డులు ఇలా..
జిల్లాలో 2,43,204 పాత రేషన్‌కార్డులు ఉండగా, వాటికి 4,804 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. అలాంటిది ప్రస్తుతం కొత్తగా 2,7527 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. అయితే కటాఫ్ తేదీలోపు మంజూరైన వారికి సుమారు 323 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం మంజూరైంది. పదేళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేషన్‌కార్డు లభించడంతో ఆనందంతో ఉన్నారు.
గోదాంలలో చేతి సంచుల నిల్వలు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం రేషన్‌కార్డుల పంపిణీ పథకంలో రేషన్‌కార్డుదారులకు ప్రత్యేకంగా చేతి సంచులను రూపొందించింది. తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి మహబూబాబాద్ జిల్లాలోని ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేతి సంచులు చేరుకున్నాయి. కేసముద్రంలో 37,914, మహబూబాబాద్‌లో 52,315, తొర్రూరులో 39,062, మరిపెడకు 45,714, గార్లకు 42,862, కొత్తగూడకు 22,676 సంచులు చేరుకున్నట్లు ఆయా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సమాచారం అందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న అభయహస్తం పథకంలోని ఆరు గ్యారెంటీల ఇందిరమ్మలోగోతో తెల్లటి సంచిని తయారు చేసి చేతి సంచిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రాలతో ముద్రించి ఉన్నాయి. వచ్చే నెలలో రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒక్క నెల కోటా మాత్రమే పంపిణీ : ప్రేమ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
సెప్టెంబర్ నెలకు సంబంధించిన సన్నబియ్యం మాత్రమే మం జూరు అయ్యాయి. ఈ సారి రేషన్‌కార్డులు పెరిగాయి. దాంతో రేషన్ బియ్యం కోటా కూడా పెరిగింది. జిల్లాలో అన్ని రేషన్‌కార్డులు కలిపి 2,70,731లు ఉండగా అందులో 8,03,715 మంది సభ్యులు ఉన్నారు. వారికి గాను 5127.945 మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నాం. కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులలో కటాఫ్ తేదీలోపు మంజూరైన వారికి బియ్యం పంపిణీ చేయనున్నాం.