Share News

నిధుల వరద

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:22 PM

రాబోయే మేడారం మహా జాతరకు రూ.150 కోట్ల కేటాయింపు

నిధుల వరద

రాబోయే మేడారం మహా జాతరకు రూ.150 కోట్ల కేటాయింపు

వీటిలో ఐదు కీలక శాఖలకు రూ.90.87 కోట్ల నిధులు

ఈ సారి ఐదు నెలల ముందే నిధులు విడుదల

పారదర్శకంగా, శాశ్వత, నాణ్యతతో పనులు చేపట్టేందుకు అవకాశం

2024 జాతరకంటే రూ.45 కోట్లు నిధులు అదనం

జనవరి 28నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతర

కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అంచనా

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం రూ.150కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో కీలకమైన పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, గిరిజన సంక్షేమశాఖ, ఆర్‌డబ్ల్యుఎ్‌స(పారిశుధ్యం) శాఖలకే రూ.90.87కోట్ల నిధులు కేటాయించారు. వచ్చే ఏడాది జనవరి 28వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు జరిగే మహాజాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు పాల్గొంటారనే అంచనాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించటంతో పాటు ప్రశాంతంగా తల్లులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయింపులు చేసింది. ఐదు నెలల ముందే నిధులు విడుదల కావటంతో నాణ్యతతో పనులు నిర్వహించేలా అధికారయంత్రాంగం దృష్టి పెట్టే అవకాశం ఉంది. పదేళ్ల తరువాత భారీ మొత్తంలో నిధులు కేటాయింపులు చేయటంతో హర్షం వ్యక్తం అవుతోంది.

రూ.150 కోట్లు కేటాయింపు...

మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.150కోట్ల నిధులను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పా టు మహాజాతరను నిర్వహించనున్నా రు. తెలుగు రాష్ర్టాలతో పాటు చత్తీ్‌సగడ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రానున్నారు. 2026 మహాజాతరకు సుమారు కోటిన్నర మందికి పై గా భక్తులు పాల్గొంటారనే అంచనాలతో శాశ్వత నిర్మాణాలతో పాటు రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్‌, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధికి పనులకు ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేసింది. వీటిలో మంత్రి సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్‌శాఖకు అత్యధికంగా రూ.51.30కోట్ల నిధులు కేటాయించారు. ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.9.95కోట్లు, నీటిపారుదలశాఖకు రూ.5.90కోట్లు, గిరిజన సంక్షేమశాఖ(ఇంజనీరింగ్‌ విభాగం)కు రూ.8.57కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌, పారిశుధ్యం కోసం రూ.15.15కోట్ల నిధులు కేటాయించారు. వివిధ అభివృద్ధి పనులకే రూ.90.87కోట్లు కేటాయించారు. అలాగే మిగతా 15శాఖలకు 59.13కోట్లు కేటాయించారు. ఇందులో ప్రధానంగా జిల్లా పంచాయతీ అధికారికి రూ.11.62కోట్లు అత్యధికంగా కేటాయించగా, పోలీ్‌సశాఖకు రూ.14.50కోట్లు, రెవెన్యూశాఖకు రూ.14.38కోట్లు, దేవాదాయశాఖకు రూ.1.75కోట్లు కేటాయించారు.

కాగా, జాతరలో ఈసారి భక్తులు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత జాతర కంటే మరింత విస్తృతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీగా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర వైద్య సేవ కేంద్రాలు, ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు, ఉచిత బస్సులు సంఖ్య పెంచటం, తాత్కాలిక వసతి గృహాలను ఏర్పాటు చేయటం వంటి అదనపు సౌకర్యాలు కల్పించేలా అధికారులు దృష్టి పెట్టారు. మొత్తంగా రికార్డు స్థాయిలో మేడారం జాతరకు ఈసారి రూ.150కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా 2016లో జరిగిన మేడారం మహాజాతరకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.150.50కోట్లు కేటాయించింది.

మహాజాతరకు భారీ నజరానా

కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడారం మహాజాతరపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డికి సమ్మక్క, సారలమ్మల సెంటిమెంట్‌ ఉండటంతో మహాజాతర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 6వ తేదీన హత్‌ సే హత్‌ జోడో యాత్రను రేవంత్‌రెడ్డి మేడారం నుంచే ప్రారంభించి సక్సెస్‌ అయ్యారు. అదే సెంటిమెంట్‌తో తల్లుల జాతర అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

2024లో ఫిబ్రవరిలో జరిగిన మహాజాతరకు రెండు నెలల సమయమే ఉన్నప్పటికీ రూ.105కోట్లు ఇవ్వగా, తాజాగా ఐదు నెలల ముందే మహాజాతర కోసం రూ.150కోట్లు కేటాయించారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన తరువాత మేడారం జాతర అభివృద్ధికి పాలకులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2014, జూన్‌ 2న స్వరాష్ట్రం సిద్ధించినప్పటి, తొలి జాతరను మాత్రం 2016 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. 2016లో భారీ స్థాయిలో మేడారం జాతరకు రూ.150.50కోట్లు కేటాయించింది. స్వరాష్ట్రంలో భారీగా నిధులు కేటాయించి, గిరిజన జాతర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించింది. దీంతో మేడారం భక్తుల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే 2018 జాతర కోసం అధికారులు రూ.175కోట్లతో మొదటి ప్రతిపాదనలు పంపించారు. కానీ, రూ.85.55కోట్లు మాత్రమే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయించింది. దీంతో రెండేళ్లకే మేడారం జాతరకు రూ.69.95కోట్ల కోత పడింది. ఆ తరువాత 2020లో జరిగిన మేడారం జాతర కోసం అధికారులు రూ.128కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం రూ.75కోట్లు మాత్రమే కేటాయించింది.

2022లో కూడా ప్రభుత్వం రూ.75కోట్లే కేటాయించింది. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడారం జాతరపై చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వినిపించాయి. 2014 జాతరకు ఎన్నికల కోడ్‌ పేరుతో గత ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయకుండా చేతులెత్తేసింది. సెప్టెంబరు, అక్టోబరు నెలలోనే మహాజాతరకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు. దీంతో 2023 డిసెంబరు 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం రావటంతో మేడారం జాతరకు రూ.105కోట్లు కేటాయించింది. మహాజాతరకు కేవలం రెండు నెలల గడువే ఉన్నప్పటికీ యుద్ధప్రాతిపాదికన అభివృద్ధి పనులు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారం మహాజాతరకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఐదు నెలల ముందే మహాజాతరకు రూ.150కోట్లు కేటాయించారు. నిధులు కేటాయింపులు ముందుగా జరగటంతో టెండర్ల ప్రక్రియ సాఫీగా జరగటంతో పాటు ఇతర పనులను నాణ్యతతో చేపట్టే అవకాశం ఉంటుంది.

అభివృద్ధికి మరితం ఊతం

మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.150కోట్లు విడుదల చేయటంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాజాతరకు ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మేడారం మహాజాతరలో భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించటంతో పాటు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతోపాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 11:24 PM