Share News

మేడారానికి కొత్తరూపు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:47 AM

ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం క్షేత్రంలో చరిత్రాత్మక మార్పులు రాబోతున్నాయి. రెండేళ్లకోసారి కోటి మందిని రప్పించే కోన ఆధునిక రూపును సంతరించుకోనుంది. ‘మాస్టర్‌ ప్లాన్‌’ పేరుతో మేడారాన్ని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.

మేడారానికి కొత్తరూపు

  • సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు కొత్త డిజైన్‌

  • ఒకే వరుసలో ఉండేలా నిర్మాణానికి ప్రణాళిక

  • గిరిజనుల సంప్రదాయాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు

  • గద్దెల సాలహారం నలువైపులా విస్తరణ

  • మహాజాతర వేళ ప్రశాంత దర్శనం కోసం ఆధునిక చర్యలు

  • జంపన్నవాగులో నిరంతరం నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళిక

  • శాశ్వత అభివృద్ధి పనులతో జాతరకు గుర్తింపు తెచ్చేలా కసరత్తు

  • రూ.150కోట్లతో మేడారం మాస్టర్‌ ప్లాన్‌ అమలు

  • నేడు మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన

ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం క్షేత్రంలో చరిత్రాత్మక మార్పులు రాబోతున్నాయి. రెండేళ్లకోసారి కోటి మందిని రప్పించే కోన ఆధునిక రూపును సంతరించుకోనుంది. ‘మాస్టర్‌ ప్లాన్‌’ పేరుతో మేడారాన్ని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. మహాజాతర వేళ తల్లుల దర్శనం ప్రశాంతంగా జరిగేలా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జంపన్నవాగులో నిరంతరం నీళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీటితో పాటు శాశ్వత అభివృద్ధి పనులను ప్రారంభం, కొత్త పనులకు శంకుస్థాపన, గద్దెల కొత్త రీ డిజైన్‌పై గిరిజనులతో చర్చించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మేడారం వస్తున్నారు.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడా రం మహాజాతరను ఆధునీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో జాతరలో శాశ్వత అభివృద్ధి పనులతో పాటు ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఉండగా, వీరి ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. భక్తులు క్యూ లైన్‌ ద్వారా సమ్మక్క, సారలమ్మ దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావటం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో నాలుగు గద్దెలను ఒకే వరుసలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం గద్దెల చుట్టు ఇనుప (స్టీల్‌) గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ప్రణాళికలో గద్దెల చుట్టూ గ్రానైట్‌తో నిర్మించాలని ప్లాన్‌ చేశారు. గద్దెల చుట్టూ గ్రానైట్‌పై సమ్మక్క, సారలమ్మ చరిత్రతో పాటు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజనుల లిపి, ఇతర జాతర వైభవం తెలియజేసే బొమ్మలను చెక్కనున్నారు. ఈ విషయమై పలుమార్లు గిరిజన పూజారులు, పెద్ద మనుషులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, గిరిజన సంప్రదాయాలు దెబ్బతినకుండా గద్దెల డిజైన్‌ను తయారు చేస్తున్నారు. గిరిజనుల అభిప్రాయాలకు అనుగుణంగా నాలుగైదు విధాలుగా అధికారులు గద్దెల డిజైన్లు రూపొందించారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో పర్యటించనుండటంతో గిరిజనుల అభిప్రాయాల మేరకు ఒక డిజైన్‌ ఫైనల్‌ చేసి శంకుస్థాపన చేయనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

గద్దెల సాలారం విస్తరణ..

మహాజాతర వేళ భక్తులకు సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శన భాగ్యం మహా కష్టమవుతోంది. గంటల తరబడి క్యూలో నిలబడితే ఏ తెల్లవారు జామునో.. అర్థరాత్రో.. తల్లుల దర్శన భాగ్యం లభించదు. గంటల తరబడి తల్లుల దర్శన భాగ్యం కోసం భక్తులు క్యూ కడితే ఐదారు నిమిషాలు కూడా తల్లులను మనసారా మొక్కుకునే అవకాశం కలుగడం లేదని భక్తుల ఆవేదన. ప్రస్తుతం 32 గుంటల స్థలం లో తల్లుల గద్దెల ప్రాంగణం ఉండగా, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు ఈ ఇరుకు ప్రాంగణంతోనే ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో మేడారం మాస్టర్‌ ప్లాన్‌లో గద్దెల ప్రాంగణం విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్రాంగణ గోడల నుంచి అన్ని వైపులా 20 ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించారు. దేవాదాయశాఖకు చెందిన 4 ఎకరాలు, ప్రభుత్వ భూమి 19 ఎకరాలు మొత్తం 23 ఎకరాల భూమిని సేకరించి గద్దెల ప్రాంగణం విస్తరణతో పాటు అతిధి గృహలు నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు, అసైన్డ్‌ భూముల సేకరణ పెద్దగా ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా భక్తులకు కూడా దర్శనం సులభం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే తల్లుల దర్శనానికి నాలుగు దిక్కుల ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నాలుగు ప్రవేశ ద్వారాలతో లోపలికి వచ్చిన భక్తులు.. తల్లులను దర్శించుకుని బయటకు వెళ్లేందుకు నాలుగు ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో భక్తులు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

జంపన్నవాగులో నీటి నిల్వ

మేడారం జాతరలో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించటం సంప్రదాయంగా వస్తోంది. జాతర సమయంలో లక్నవరం సరస్సు నుంచి విడుదల చేస్తారు. మేడారం పర్యాటక ప్రాంతంగా మారడంతో ప్రతీ రోజు భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా సెలవు దినాలు, పండుగలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను కూడా మేడారంలో నిర్వహించుకునేందుకు భక్తులు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేయడం సంప్రదాయం కావటంతో జాతరేతర రోజుల్లో నీళ్లు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జంపన్నవాగులో ఏడాదంతా నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జంపన్నవాగుపై రెండు, మూడు చోట్ల చెక్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

2018 మహాజాతర సమయంలో అప్పటి ప్రభుత్వం జంపన్నవాగుపై నార్లాపూర్‌ చింతల క్రాస్‌ రోడ్డు, గుండ్లమడుగు, రెడ్డిగూడెం, ఊరట్టం వద్ద సుమారు రూ.16 కోట్ల వ్యయంతో చెక్‌ డ్యామ్‌లు నిర్మించారు. అయితే 2020 మహాజారత నాటికి ఈ చెక్‌డ్యామ్‌లలో పడి సుమారు 15 మందికి పైగా భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలకు జంపన్నవాగులో నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయటమే కారణమని భక్తులు విశ్వసించారు. దీంతో నార్లాపూర్‌ చింతల క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మించిన చెక్‌ డ్యామ్‌ మినహా మిగతా మూడు చెక్‌ డ్యామ్‌లను గత ప్రభుత్వం కూల్చేసింది. ఈ కూల్చివేతలకు రూ.2.30 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీంతో కోట్లాది రుపాయల నిధులు నీళ్లపాలు చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేస్తుందనే టాక్‌ వినబడుతోంది. భక్తుల విశ్వాసాలకు భంగం కలుగకుండా జంపన్నవాగులో నిరంతరం నీళ్లు పారేలా ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు.

నేడు సీఎం మేడారం పర్యటన

మహాజాతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మేడారానికి ముఖ్యమంత్రి రావడం చరిత్రలో తొలిసారి. 2016లో అప్పటి ప్రభుత్వం మేడారం మహాజాతరకు రూ.150.50 కోట్ల నిధులు కేటాయించింది. కానీ, పనుల ప్రారంభానికి సీఎం హాజరు కాలేదు. ప్రస్తుత జాతరకు రూ.150కోట్లు కేటాయించటంతో పాటు ఆ పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రావటంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులను కేటాయించింది.

2024 జాతరకు ప్రభుత్వం ఆలస్యంగా రూ.115కోట్ల నిధులు మంజూరి చేసింది. వీటిలో సుమారు రూ.25 కోట్ల పనులు అప్పట్లో జరగకపోవటంతో.. ఇటీవల ఆ నిధులతో మేడారంలో బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అతిధి గృహాలను నిర్మిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మేడారం పర్యటనలో ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే గద్దెల కొత్త డిజైన్‌ పనులు, గద్దెల ప్రాంగణం విస్తరణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. వీటితో ఐలాపూర్‌ వరకు రోడ్డు నిర్మాణం, జాతరలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇదీ..

  • ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరుతారు.

  • 10.45 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

  • అక్కడి నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకుంటారు.

  • మధ్యాహ్నం 12.15 గంటలకు సమ్మక్క-సారలమ్మ గద్దెలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.

  • అనంతరం పూజారులతో సమావేశమవుతారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. గద్దెల ప్రాంగణంలోని పరిసరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం ఆలయ పునరాభివృద్ధిపై స్లైడ్‌ షోను తిలకిస్తారు.

  • 1.30 నుంచి 2.30 గంటల వరకు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వేచి ఉంటారు.

  • 2.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరుతారు.

Updated Date - Sep 23 , 2025 | 12:47 AM