గతమెంతో ఘనం.. వర్తమానం దైన్యం
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:06 AM
కాకతీయ విశ్వవిద్యాలయం- రాష్ట్రంలో అతిపెద్ద రెండో యూనివర్సిటీ. ఉన్నత విద్యను అందించడంలో, ప్రమాణాలు పాటించడంలో, పరిశోధనలు సాగించడంలో, నిష్ణాతులను అందించడంలో ఈ యూనివవర్సిటీ ఒకప్పుడు కేరా్‌ఫగా ఉండేది. ఉస్మానియా తర్వాత, చారిత్రక వరంగల్ కేంద్రంగా కేయూ తనదైన అస్థిత్వాన్ని చాటుకుంది. లక్షలాది మంది విద్యార్థులకు విద్యావెలుగులు పంచింది.
ఏడాదికేడాది మసకబారుతున్న కేయూ ప్రతిష్ఠ
ఎన్‌ఐఆర్‌ఎఫ్ తాజా ర్యాంకుల్లో వెనుకబాటు
న్యాక్ ర్యాంక్ 3.36 నుంచి 3.27కి పడిపోయిన వైనం
నత్తనడకన సాగుతున్న రూసా ప్రాజెక్టు పనులు
అవినీతి ఆరోపణలు.. ఏసీబీ, విజిలెన్స్ విచారణలు..
పాలనలో ఒకే సామాజికవ ర్గ ఆధిపత్యంపై విమర్శలు
పాలనను సమూలంగా ప్రక్షాళన చేయాలంటున్న విద్యావేత్తలు
పరిశోధన, అకడమిక్ అభివృద్ధిపై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు
కాకతీయ విశ్వవిద్యాలయం- రాష్ట్రంలో అతిపెద్ద రెండో యూనివర్సిటీ. ఉన్నత విద్యను అందించడంలో, ప్రమాణాలు పాటించడంలో, పరిశోధనలు సాగించడంలో, నిష్ణాతులను అందించడంలో ఈ యూనివవర్సిటీ ఒకప్పుడు కేరా్‌ఫగా ఉండేది. ఉస్మానియా తర్వాత, చారిత్రక వరంగల్ కేంద్రంగా కేయూ తనదైన అస్థిత్వాన్ని చాటుకుంది. లక్షలాది మంది విద్యార్థులకు విద్యావెలుగులు పంచింది. వారు ఉన్నతస్థానాల్లో స్థిరపడేందుకు దోహదపడింది. అయితే కొన్నాళ్లుగా కేయూ ప్రతిష్ఠ మసకబారుతోంది. ఇందుకు గత పాలకుల నిర్లక్ష్యం ఒక కారణం కాగా, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, అలసత్వం మరో కారణంగా కనిపిస్తోంది. తాజాగా వెలువడిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్స్‌లో వెనుబడటమే కాకుండా, 2023లో నేషనల్ అసె్‌సమెంట్ అండ్ అక్రిడిటేషన్ కాన్సిల్ (ఎన్‌ఏఏసీ) సీజీపీఏ పడిపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతీ అక్రమాలు, కులాలూ వర్గాల పక్షపాతం, రాజకీయ ప్రాపకం వంటివి యూనివర్సిటీకి మచ్చ తెస్తున్నాయి. కేయూ ప్రతిష్ట మరింత దిగజారకముందే, కొత్త పాలకవర్గం... అకడమిక్, పరిశోధనల మెరుగుకు చర్యలు చేపట్టాలని, లోపాల దిద్దుబాటుకు ఉపక్రమించాలని విద్యానిపుణులు కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్
కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణలో అతిపెద్ద రెండో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఉస్మానియా వర్సిటీ తరువాత రాష్ట్రంలో కేయూ కే పేరుంది. గతంలో కేయూ అనేక ప్రతిష్ఠాత్మక విజయాలు సాధించింది. 2017లో నేషనల్ అసె్‌సమెంట్ అండ్ అక్రిడిటేషన్ కాన్సిల్ (ఎన్‌ఏఏసీ)లో 3.36 సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పా యింట్ యావరేజ్)తో కేయూ ఎ-గ్రేడ్ సాధించిం ది. 2018లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2 బ్యాండ్‌లో (101-1 50), 3 బ్యాండ్‌లో (151-200)లో స్థానంలో మె రుగైన స్థానాన్ని కేయూ సాధించింది. ఈ విజయాలకు సూచికగా అదే ఏడాది రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) నుంచి పరిశోధన, ఇన్నోవేషన్ కోసం రూ.50 కోట్లు గ్రాంట్ కూడా కాకతీయ విశ్వవిద్యాలయం పొందింది. అలాగే ఫార్మసీ కళాశాల 2021లో 48వ ర్యాంక్, 2022లో 46వ ర్యాంక్ సాధించడం విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను మరింత పెంచింది. కానీ, ఈ విజయాలన్ని చరిత్రగా మిగిలిపోతున్నాయి. వరుసగా ర్యాంకింగ్‌లో వెనుకబడిపోతుండటం గత చరిత్రను కనుమరుగు చేస్తోంది. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్స్‌లో కేయూ వెనుబడిపోయింది. ఆంధ్ర, ఉస్మానియా వంటి యూనివర్సిటీలు ర్యాంకింగ్‌లో ముందంజలో ఉండగా, కేయూ వెనుకబడి పోవటంపై అధ్యాపక, విద్యార్థి వర్గా ల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇంజనీరింగ్ విభాగంలో వరంగల్‌కు చెందిన ఓ ప్రైవేటు వర్సిటీ 2 బ్యాండ్‌లో (101-150) సా ధించింది. కొత్తగా పుట్టుక వచ్చిన ప్రైవేటు వర్సిటీలు ర్యాంకులు సాధిస్తుంటే, ఘన చరిత్ర ఉన్న కేయూ వెనుబడటం విచారకరమని అధ్యాపకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే 2017లో న్యాక్‌లో 3.36 సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్)తో కేయూ ఎ-గ్రేడ్ సాధించింది. అయితే 2023లో ఇదే న్యాక్‌లో 3.27కి ర్యాంక్ పడిపోయింది.
రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) నుంచి పరిశోధన, ఇన్నోవేషన్ కోసం రూ.50 కోట్లు గ్రాంట్ కూడా కేయూ పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా యూనివర్సిటీలో మౌళిక సదుపాయాలు, బోధన, అభ్యసన నాణ్యత, మెరుగుదల, అధ్యాపక అభివృద్ధి వంటి అంశాల్లో నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఈ పాజెక్టులు నత్తనడక లో ఉండగా, పరికరాల కొనుగోలు మినహా పరిశోధనలో పెద్దగా పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాలనలో నిర్లక్ష్యం.. రాజకీయ ఒత్తిళ్లు..
ఎన్నో ఘనమైన మైలురాళ్లను దాటిన కాకతీయ యూనివర్సిటీ ఇటీవల కాలంలో భూముల కబ్జాలు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ప్రతిష్ట మసకబారింది. కేయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్సిటీ లోపల ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలు జరిగాయి. గతంలో పదవిలో ఉన్న వైస్ చాన్సలర్ అకడమిక్ అభివృద్ధి వైపు దృష్టి సారించకపోగా, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలు వర్సిటీ ప్రతిష్ఠను పదేళ్లు వెనక్కి నెట్టాయనే చర్చ జరుగుతుంది. అకడమిక్ నాణ్యత, పరిశోధనలపై శ్రద్ధ లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా అవకాశాలు కోల్పోతున్నార ని విద్యా సంఘాలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పది నెలల క్రితం కొలువుతీరిన పాలకవర్గం పాలనలో ప్రత్యేకమైన మార్పులు తీసుకరావటంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అధికార పదువులు కట్టబెట్టడం, కీలకమైన కార్యక్రమాలకు కూడా ఆ వర్గానికి చెందిన వారినే ఆహ్వానించడం వర్సిటీ లోపల తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవల జరిగిన స్నాతకోత్సవం, సైన్స్ కాంగ్రెస్ వంటి కార్యక్రమాలలో ఓ ఉన్నతాధికారి తన సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేశారనే ప్రచారం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అధ్యాపకులు అర్హత కలిగినా ప్రాధాన్యం ఇవ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారులు, అధ్యాపకులు ఏళ్ల తరబడి ఒకేపోస్టులో తిష్టవేసిన వారిని బదిలీ చేసే సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డెవల్‌పమెంట్‌తో పాటు వివిధ పరీక్షలకు నియమించే పర్యవేక్షకులను కదిలించలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని తన పక్కనే సీటు కేటాయించుకోవటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు భారీగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరికి మినహా మిగతా వారందరు కూడా రాజకీయ ఒత్తిళ్లతో పదవులు పొందుతున్నారనే టాక్ ఉంది. కేయూ ఇటీవల స్నాతకోత్సవంతో పాటు జాతీయ సైన్స్ కాంగ్రె్‌సను నిర్వహించింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ రెండు కార్యక్రమాలకు పేరు, పబ్లిసిటీ రాలేదనే అభిప్రాయం ఉంది. పాలనపై కాకుండా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే ఉన్నతాధికారులు పాకులాడుతున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి.
అకడమిక్, పరిశోధనలపై దృష్టి పెడితినే..
కొత్త పాలక మండలి కొలువై పది నెలలు గడుస్తోంది. ఇప్పటికే కబ్జాలు, అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ విచారణలతో మసకబారిన ప్రతిష్టను పునఃప్రతిష్టించే కార్యక్రమాలు చేట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వ విద్యాలయం తిరిగి ప్రతిష్ఠ సాధించాలంటే.. పాలనలో మార్పులు తప్పనిసరిగా రావాలని నిపుణులు సూచిస్తున్నారు. కుల ప్రాధాన్యతను పక్కనబెట్టి, అకడమిక్, పరిశోధనలపై పూర్తి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. రూసా గ్రాంట్లను సక్రమంగా వినియోగించి, నూతన పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, బోధన నాణ్యతను మెరుగుపరిచి, విద్యార్థుల కేరీర్ అవకాశాలను విస్తరించాలని సూచిస్తున్నారు.