Share News

విప్లవోద్యమంలో జంగ్‌ సైరన్‌..!

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:54 AM

మోడెం బాలకృష్ణ.. రాడికల్‌గా విప్లవ బాట పట్టాడు. పీడిత ప్రజానీకం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. ‘జంగు సైరనూదిరో.. జైలులో మాయన్నలు’ అనే పాటకు స్ఫూర్తినిచ్చేలా తన విప్లవ సహచరులు పటేల్‌ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో కలిసి మోడెం జైలులోనే జంగ్‌ సైరన్‌ మోగించి జైలునే పోరాట కేంద్రంగా మలిచారు.

విప్లవోద్యమంలో జంగ్‌ సైరన్‌..!

  • విద్యార్థి దశలోనే విప్లవ బాట పట్టిన మోడెం బాలకృష్ణ అలియాస్‌ మనోజ్‌

  • 1983లో పీపుల్స్‌వార్‌లో చేరిక

  • 1984, 1987లో అరెస్టయి వరంగల్‌, ముషీరాబాద్‌లో జైలు జీవితం

  • మోడెం విడుదల కోసం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కిడ్నాప్‌

  • 1993లో మరోసారి పట్టుబడి ఆరేళ్లు జైలులో

  • నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం

  • అంత్యక్రియలు ఎక్కడనేది సందిగ్ధం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : మోడెం బాలకృష్ణ.. రాడికల్‌గా విప్లవ బాట పట్టాడు. పీడిత ప్రజానీకం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. ‘జంగు సైరనూదిరో.. జైలులో మాయన్నలు’ అనే పాటకు స్ఫూర్తినిచ్చేలా తన విప్లవ సహచరులు పటేల్‌ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో కలిసి మోడెం జైలులోనే జంగ్‌ సైరన్‌ మోగించి జైలునే పోరాట కేంద్రంగా మలిచారు. పుట్టింది ఓరుగల్లులోనే అయినా ఇక్కడి విప్లవాన్ని హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన చదువుల్లో విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నుంచి పీపుల్స్‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి విప్లవోద్యమంపై చెరగని ముద్ర వేసిన మోడెం బాలకృష్ణ అలియాస్‌ బాబన్న అలియాస్‌ మనోజ్‌ గరియాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర అర్గనైజింగ్‌ కార్యదర్శిగా పని చేస్తున్న బాలకృష్ణ మృతితో ఓరుగల్లు విప్లవ సానుభూతిపరులను ఆందోళనకు గురి చేసింది.

విద్యార్థి దశలోనే విప్లవంలోకి..

మావోయిస్టు ఉద్యమంలో సీనియర్‌ నేతగా ఉన్న బాలకృష్ణ ఎన్‌కౌంటర్‌తో పుట్టిన ఊరు ఉలిక్కిపడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో మోడెం వెంకటేశ్వర్లు, మల్లికాంబ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెండో కుమారుడు బాలకృష్ణ విప్లవ బాట పట్టారు. తండ్రి పోస్టల్‌ ఉద్యోగి కావడంతో ఆరో తరగతి వరకు ఇక్కడే చదువుకున్న బాలకృష్ణ తండ్రికి బదిలీ కావడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది. సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన బాలకృష్ణ, 1983లో మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. అదే సమయంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరి క్రియాశీల పాత్ర పోషించారు. ఈ సమయంలోనే అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన బాలకృష్ణకు భద్రాచలం ఏరియాలో పని చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన బాలకృష్ణ జైలు జీవితం, అజ్ఞాతం, పోరాటంగా మారిపోయింది.

‘మోడెం’ కోసం ఎమ్మెల్యే కిడ్నాప్‌

రాడికల్‌ దశ నుంచి పీపుల్స్‌వార్‌లో చేరిన బాలకృష్ణ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1984లో భద్రాచలం ఏరియాలో మొదటిసారి పోలీసులు అరెస్టు చేశారు. రెండు సంవత్సరాలు వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌లో ఉన్న బాలకృష్ణ, విడుదలైన తర్వాత తిరిగి 2016లో మళ్లీ అజ్ఞాతబాట పట్టారు. 1987లో మహబూబ్‌నగర్‌లో పని చేస్తున్న బాలకృష్ణను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి మూడేళ్ల పాటు ముషీరాబాద్‌ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే 1990లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మండువ వెంకటేశ్వర్‌రావును నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. రాజకీయ ఖైదీగా ఉన్న బాలకృష్ణను వదిలి పెట్టాలని పీపుల్స్‌వార్‌ డిమాండ్‌ చేసింది. దీంతో మోడెంను జైలు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ పీపుల్స్‌వార్‌ ఉద్యమంలోకి తిరిగి వెళ్లారు. 1991లో మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శిగా, దక్షిణ తెలంగాణ రీజినల్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే 1993లో మరోసారి బాలకృష్ణ పోలీసులకు చిక్కాడు. సుమారు ఆరు సంవత్సరాలు చంచల్‌గూడ జైలులో ఉన్న బాలకృష్ణ 1999లో విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన బాలకృష్ణ పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీల్లో కీలక నేతగా ఎదిగారు. మనోజ్‌, బాబన్న, భాస్కర్‌, రామచందర్‌ పేర్లతో చలామణి అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర అర్గనైజింగ్‌ కార్యదర్శిగా పని చేశారు. అనేక దాడుల్లో కీలకంగా ఉన్న బాలకృష్ణపై రూ.కోటి రివార్డు ఉంది. గురువారం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని గజియాబాద్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో మోడెం బాలకృష్ణ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలో అలుపెరుగని నేతగా బాలకృష్ణ గుర్తింపు పొందారు. గజియాబాద్‌ ఎన్‌కౌంటర్‌తో ఓరుగల్లు విప్లవకారులు, సానుభూతిపరులు ఘొల్లుమంటున్నారు.

జైలులోనే ‘మోడెం’ జంగ్‌ సైరన్‌..

1990వ దశకంలో విప్లవ పాటలు పల్లె ప్రాంతాలను ఉర్రూతలుగించేవి వీటిలో ‘జంగు సైరనూదిరో.. జైలులో మాయన్నలు’.. అనే పాటకు స్ఫూర్తినిచ్చింది మోడెం బాలకృష్ణ, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల త్రయం. 1990లో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు జైలు నుంచి కూడా పోరాటాలు ఎలా చేయాలో చూపించారు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాటం చేశారు. వీరి పోరాటంతో సాధారణ, రాజకీయ ఖైదీల హక్కులను సాధించారు. జైలులో కలిసిన ఈ ముగ్గురిలో పటేల్‌ సుధాకర్‌రెడ్డి 2009, మే 23న ములుగు జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, 2010 మార్చి11న ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో శాఖమూరి అప్పారావు అలియాస్‌ రవి మృతి చెందారు. ఇద్దరు కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా ఎన్‌కౌంటర్‌ అయ్యారు. జైలులో రాజకీయ ఖైదీల కోసం జంగ్‌ సైరన్‌ మోగించిన ముగ్గురిలో ఇప్పటి వరకు మోడెం బాలకృష్ణ ఒక్కరే విప్లవోద్యమంలో కొనసాగారు. అయితే గజియాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో బాలకృష్ణ కూడా మృతి చెందడంతో జంగ్‌ సైరన్‌ మోగించిన విప్లవ త్రయం ముగిసిందనే చర్చ సానుభూతిపరుల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ ఖైదీల హక్కుల కోసం జరిగిన పోరాటంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించారని మాజీ మావోయిస్టులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు ?

మోడెం బాలకృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో విప్లవకారులు, సానుభూతిపరులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన స్వగ్రామం మడికొండలో సొంత ఇల్లు ఉన్నా దశాబ్దాల క్రితమే కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి వరకు కూడా మడికొండ వద్ద అంత్యక్రియల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో హైదరాబాద్‌లోనే బాలకృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ జరుగుతోంది. మడికొండలోనే సొంత ఇంటి వద్ద తుది వీడ్కోలు పలుకుతారని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే బాలకృష్ణ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు వెళ్లడంతో అంత్యక్రియలు మడికొండలోనా ? హైదరాబాద్‌లోనా ? అనేదానిపై స్పష్టత రావడం లేదని సమాచారం.

Updated Date - Sep 13 , 2025 | 12:55 AM