దడ పుట్టిస్తున్న ధరలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:16 AM
పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముకుంటూ లబ్ధిదారులను దోచుకుంటున్నారు. వస్తువు ధర పెరగాలంటే ఆ వస్తువు తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం అధికమవ్వాలి.
ఇందిరమ్మ పథకం ఎఫెక్ట్
ఇళ్ల నిర్మాణాలతో అమాంతం పెరిగిన రేట్లు
ట్రాక్టర్ ఇటుక రూ.12 నుంచి రూ.19 వేలకు
ఇసుక ట్రాక్టర్‌కు రూ. 2 వేలు పెంపు
ఉచిత కూపన్లు ఉత్తుత్తివే
కంపెనీల పోటీ, డిమాండ్ లేక తగ్గిన సిమెంటు, ఐరన్ రేట్లు
మహబూబాబాద్, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముకుంటూ లబ్ధిదారులను దోచుకుంటున్నారు. వస్తువు ధర పెరగాలంటే ఆ వస్తువు తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం అధికమవ్వాలి. ఎలాంటి ఉత్పత్తి వ్యయం పెరగకుండా కేవలం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఉన్న డిమాండ్‌ను ఆసరా చేసుకొని ధరలు అమాంతం పెంచేశారు. ఈ ధరలను నియంత్రించాల్సిన యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి లక్ష్యానికి పెరిగిన రేట్లు తూట్టు పెడుతున్నాయి. ఇందిరమ్మ పథకంలో ఇచ్చే రూ.5లక్షల ఆర్థిక సహాయంలో కేవలం ఇంటి నిర్మాణానికి అయ్యే మెటీరియల్‌లో సగం వరకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకంలో ఇల్లు మంజూరైందనే సంతోషంతో లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభిస్తే ఇల్లు పూర్తయ్యే సరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల అప్పు మిగిలే ప్రమాదం ఎదురవుతుందని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 9500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 8100 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు.
ఒకేసారి పెంచిన ఇటుక, ఇసుక రేట్లు
ఇంటి నిర్మాణ ముడి సరుకుల్లో అత్యధికంగా ఇటుక, ఇసుక ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం సూచించిన సిమెంటు ఇటుకలు కాకుండా శాశ్వత నిర్మాణం మన్నికగా ఉండాలనే ఉద్దేశంతో అనేకమంది లబ్ధిదారులు మట్టి ఇటుకలనే వాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇటుక తయారీదారులు అమాంతం ధరలను పెంచేశారు. 2వేల ఇటుకలతో కూడిన ఒక ట్రాక్టర్ రూ.12,500 ఉండగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైన కొద్ది వారాల్లోనే రూ.18వేల నుంచి రూ.20వేల వరకు పెంచేసారు. ఇష్టం ఉంటే తీసుకెళ్లండి? లేదా! ఇంకొద్దిరోజులైతే ఈ ఇటుక కూడా దొరకదంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక లబ్ధిదారులు ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇక స్థానికంగా లభించే ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నప్పటికీ అది నామ్‌కే వాస్తేగా మారింది.
జిల్లాలో ఆకేరు, మున్నేరు వాగులు ఉన్న మండలాల్లోనే ఇసుక అందుబాటులో ఉంది. మిగిలిన మండలాలకు ట్రాన్స్‌పోర్ట్ అధికమవుతుండడంతో ఇసుక వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల నుంచి కూపన్లను తీసుకొని స్థానికంగా లభించే ఇసుకను పోస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.4 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 6500 అయింది. మరికొన్ని చోట్ల రూ.8 వేల వరకు తీసుకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. అది కూడా నాసీరకంగా ఉంటోందని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక గోదావరి ఇసుకను లారీల్లో తీసుకువచ్చి ట్రాక్టర్ల ద్వారా అనధికారికంగా విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ పథకం ప్రారంభం కాక ముందు గోదావరి ఇసుక ఒక ట్రాక్టర్‌కు రూ.6 వేల ఉండగా తాజాగారూ.9 వేలకు పెంచి అమ్ముతున్నారు. ఇక బేసిమెంట్ రాయి ఒక్కటి రూ.5 నుంచి రూ7లు ఉండగా తాజాగా రూ.16 నుంచి రూ.20ల వరకు పెరగడం గమనార్హం. భవన నిర్మాణ కార్మికులకు కూలీ రేట్లు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రోజుకు రూ.1వెయ్యి తీసుకునే మేస్త్రీకి రూ.1200 ఇస్తున్నారు.
తిరోగమనంలో ఐరన్, సిమెంటు ధరలు...
ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండగా.. ఇందుకు భిన్నంగా ఐరన్, సిమెంటు ధరలు తగ్గుతున్నాయి. నెల క్రితం రిటైల్ మార్కెట్‌లో క్వింటా ఐరన్ రూ.5,350 నుంచి రూ.5600 వరకు ఉండగా ప్రస్తుతం క్వింటా ఐరన్ రూ.5వేలకు పడిపోయింది. సిమెంటు రూ.340 బస్తా ఉండగా రూ.320కి తగ్గింది. ప్రధానంగా ఐరన్ సప్లై అధికమై డిమాండ్ లేకపోవడం, సిమెంటు కంపెనీల మధ్య ధరల పోటీ కారణాలతో వీటి రేట్లు తగ్గుతున్నట్లు పలువురు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈనెల 22 నుంచి కేంద్రం సిమెంటుపై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎ్‌సటీ తగ్గించడంతో మరింత ధరలు పడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇటుక, ఇసుక ధరలు ఏ మాత్రం ప్రభుత్వ నియంత్రణ లేకుండా పెరుగుతుండడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆశించిన మేరకు ప్రయోజనం కలగడంలేదనేది చేదు వాస్తవం..!