Share News

విభేదాల గులాబీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:56 AM

ఓరుగల్లు గులాబీ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలుగా విడిపోయారని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌ వేటుకు గురైన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిల మధ్య విభేదాలను ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

విభేదాల గులాబీ

ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతలపై కవిత హాట్‌ కామెంట్స్‌

కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలుగా విడిపోయారని తీవ్ర వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ పోచంపల్లి వ్యాపారాలపై ఆరోపణలు

పల్లా - పోచంపల్లి విభేదాలపై ఆసక్తికర ముచ్చట్లు

నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు

ఓరుగల్లు గులాబీ నేతల్లో కవిత వ్యాఖ్యల కలకలం

పార్టీలో ఇటీవలి పరిణామాలకు బలం చేకూర్చాయంటున్న శ్రేణులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : ఓరుగల్లు గులాబీ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలుగా విడిపోయారని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌ వేటుకు గురైన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిల మధ్య విభేదాలను ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. నిజంగా ఓరుగల్లులో కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలుగా పార్టీ నేతలు విడిపోయారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుండగా, చాలాకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతున్నాయి. గత ఏప్రిల్‌ 27న జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ.. నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యత ల విషయంలోనూ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. వరంగల్‌ జిల్లా కమిటీకి కార్యవర్గాన్ని కూడా నియమించకపోవడానికి కారణం కూడా పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరే అనే ప్రచారం జరుగుతోంది.

కవిత వ్యాఖ్యల కలకలం

బీఆర్‌ఎస్‌ నుంచి వేటుకు గురైన కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓరుగల్లు గులాబీ నేతలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. సంతో్‌షరావు క్లాస్‌మేట్‌ కావటం వల్లనే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. మోకిలాలలో రూ.750కోట్ల విల్లా ప్రాజెక్టు చేస్తున్నారని చెప్పారు. శ్రీనివా్‌సరెడ్డికి ఇంత డబ్బు ఎక్కడిదని, సంతో్‌షరావు క్లాస్‌మేట్‌ కావటమే ఆయనకున్న అర్హతని విమర్శించారు. ఈ విషయం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డే చెప్పారని కవిత బాంబు పేల్చారు. ఎమ్మె ల్సీ శ్రీనివా్‌సరెడ్డిని టార్గెట్‌ చేసిన కవిత.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా లాగటంతో గులాబీ శ్రేణుల్లో కలకలం రేగుతోంది.

జనగామలో ఏం జరిగింది?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్ప ట్లో జనగామ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎ మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంపై కన్నేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో జనగామ టికెట్‌ రేసులోకి వచ్చారు. అప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పక్కన పెడుతున్నారనే ప్రచారంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ పోచంపల్లికి పల్లా రూపంలో చెక్‌ పడింది. దీంతో కేటీఆర్‌కు అత్యతంత సన్నిహితుడిగా పేరున్న పోచంపల్లిని కాదని కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న పల్లాకు టికెట్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావొస్తున్న క్రమంలో కవిత ఈ వివాదంపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

వర్ధన్నపేట ఇన్‌చార్జిలో..

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ బీజేపీలో చేరటంతో ఈ స్థానానికి ఇన్‌చార్జి బాధ్యతలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి మధ్య పోరు నడిచింది. ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్నప్పటికీ డీలిమిటేషన్‌లో జనరల్‌ స్థానంగా మారుతుందని భావిస్తున్న నేతలు.. ఇన్‌చార్జి బాధ్యతలు వస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి దిగవచ్చునని అంచనాలతో బాధ్యతల కోసం పోటీపడ్డారని చర్చ జరిగింది. అయితే కేసీఆర్‌ ఎర్రబెల్లి వైపు మొగ్గుచూపటంతో పోచంపల్లి సర్దుకుపోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది.

మానుకోట, భూపాలపల్లి, పశ్చిమలోనూ..

మహబూబాబాద్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు అధిష్ఠానం అప్పగించింది. అయితే నియోజకవర్గంలో కేడర్‌ను సమన్వయం చేయటంలో సత్యవతిరాథోడ్‌ వైఫల్యం చెందారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శించటంతో మానుకోట గులాబీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇక భూపాలపల్లి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రమణారెడ్డికేనని భూపాలపల్లిలోనే కార్యకర్తల సమక్షంలో కేటీఆర్‌ ప్రకటించి వచ్చారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నియోజకవర్గంలో పర్యటించటం ఏమిటనే చర్చ జరుగుతోంది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు చెక్‌ పట్టేందుకు ఇటీవల బీఆర్‌ఎ్‌సలో చేరిన ఓ యువనేతను కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే మరో ప్రజాప్రతినిధి ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

విభేదాలతో వరంగల్‌ కమిటీకి బ్రేక్‌..

అంతర్గత విభేదాలతో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా కమిటీని కూడా నియమించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమేష్‌ బీజేపీలో చేరటంతో పదవి ఖాళీ అయింది. ఏడాది దాటినా ఇప్పటి వరకు నూతన అధ్యక్షుడిని నియమించటంతో నేతల మధ్య విభేదాలు అడ్డు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, తదితర నేతలు జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ అధిష్ఠానంపై వ్యతిరేక శిబిరం ఒత్తిడి తెస్తుండటంతో అధ్యక్షుడు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. కాగా, మొత్తంగా ఓరుగల్లు గులాబీ నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలు విడిపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Sep 04 , 2025 | 12:56 AM