Share News

‘ఆమె’కు ఆరోగ్యం

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:41 AM

ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర సర్కారు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్‌ 16 వరకు పోషణ మాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఏటా ఏటా నెల రోజుల పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది పోషణ మాసాన్ని విజయవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

‘ఆమె’కు ఆరోగ్యం

  • నేటి నుంచి పోషణ మాసం

  • పోషకాహార లోప నివారణకు శ్రీకారం

  • నేటి నుంచి అక్టోబరు 16 వరకు నిర్వహణ

  • విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికలు

  • ఇప్పటికే కింది స్థాయి అధికారులకు దిశా నిర్దేశం

  • జిల్లాలో ఐదు ప్రాజెక్టులు, 1,437 కేంద్రాలు

మహబూబాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర సర్కారు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్‌ 16 వరకు పోషణ మాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఏటా ఏటా నెల రోజుల పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది పోషణ మాసాన్ని విజయవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార సందేశాన్ని ప్రతీ ఇంటికి పంపనున్నారు. అందుకు సంబంధించి నెల రోజుల పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా పోషణ మాసం నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరీ చేసింది.

నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌, గూడూరు, మహబూబాబాద్‌, మరిపెడ, తొర్రూరు ప్రాజెక్టుల పరిధిలోని 1437 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషణ మాసం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్ధేశం చేశారు. మండల స్థాయిలో తహసీల్ధార్లు, ఎంపీడీవోలు, వైద్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పోషణ మాసంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి అక్టోబరు 16 వరకు జరుపతలపెట్టిన పోషణ మాసంలో ప్రతీరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, మహిళలు, కిషోర బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో పోషణ మాసం కొనసాగనుంది. ఇందులో ఆరోగ్యజీవనానికి కావాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు.

నేటి నుంచి ప్రారంభం ..

పోషణ మాసం తొలిరోజు సెప్టెంబరు 17న అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, శిశువులు, చిన్నారుల పోషణపై సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పౌష్టికాహార అనుబంధ వంటకాల తయారీపై పోటీలు ఏర్పాటు చేయనున్నారు. 18న కిషోర బాలికలకు పరీక్షలు, పిల్లల కోసం బరువు, ఎత్తు కొలతలు తీయడం అదే విధంగా ఆహారంలో చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించే విషయంపై అవగాహన, 19న తల్లిదండ్రులతో పోషకాహారం ప్రతిజ్ఞలు, 22న అంగన్‌వాడీ కేంద్రాల్లో బొమ్మల ప్రదర్శనలు, 23న పౌష్టికాహార పదార్ధాలపై వినియోగంపై అవగాహన, 24న బిడ్డపుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడంపై అవగాహన సమావేశాలు, 26న పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యంపై పోషణ సమావేశాలు, 29న తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం, 30న స్థానిక వంటలు, చిరు ధాన్యాలు, ఫలాలు, కూరగాయలపై అవగాహన కల్పిస్తారు.

అక్టోబరు 2న పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆకలి పరీక్షలు నిర్వహించడం, 3న గ్రామ, వార్డు సభలు, 4న పర్యావరణ రక్షణపై ప్రతిజ్ఞలు, 6న పోషణ లోపం ఉన్న పిల్లల జాబితా తయారు చేయడం, 8న పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన, 9న తక్కువ నూనె, చక్కెర వినియోగంతో తయారు చేసిన వంటకాల ప్రదర్శన , 11న అంగన్‌వాడీ కేంద్రాల శుభ్రత, 13న పాఠశాలల్లో మీరు తినేఆహారం మీ పెరుగుదల అంశంపై వ్యాసరచన, క్విజ్‌ పోటీలు 14న పాఠశాలల్లో మొక్కలు నాటడం, 15 అంగన్‌వాడీ కేంద్రాల్లో సలహా సమావేశాలు, 16న జింక్‌ పుడ్‌, అధికబరువు తదితర అంశాలపై అవగాహన సమావేశాల ఏర్పాటుతో పోషణ మాసం ముగియనుంది.

పోషణ మాసం విజయవంతానికి చర్యలు : శిరీష, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

పోషణ మాసం విజయవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇప్పటికే జిల్లా, మండలస్థాయిలో సంబంధిత అధికారులతో కో-ఆర్డినేషన్‌ సమావేశాలు జరిగాయి. చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం పోషణమాసాన్ని నిర్వహిస్తుంది. నెల రోజుల పాటు ప్రభుత్వం సూచించిన విధంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తాం.

Updated Date - Sep 17 , 2025 | 12:41 AM