Share News

అన్నదాతల ఆందోళన

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:32 AM

జిల్లాలోని రైతులు యూరియా కోసం సోమవారం భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అన్నదాతల ధర్నాతో మరిపెడ బంగ్లా అట్టుడికింది. పోలీసులు సైతం రైతుల ఇబ్బందులను గుర్తించి చేసేదేమీ లేక చేతులెత్తేశారు.

అన్నదాతల ఆందోళన
కేసముద్రంలో రైతు వేదిక వద్ద తోపులాట

  • యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

  • జిల్లాలో అట్టుడికిన నిరసనలు

  • మరిపెడ బంగ్లా, మహబూబాబాద్‌, కురవి, కేసముద్రంలో ధర్నాలు

  • మరిపెడ నేషనల్‌ హైవేపై నాలుగు గంటల పాటు రాస్తారోకో

  • కేసముద్రంలో టోకెన్ల కోసం తోపులాట.. పలువురు రైతులకు స్వల్ప గాయాలు

మరిపెడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతులు యూరియా కోసం సోమవారం భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అన్నదాతల ధర్నాతో మరిపెడ బంగ్లా అట్టుడికింది. పోలీసులు సైతం రైతుల ఇబ్బందులను గుర్తించి చేసేదేమీ లేక చేతులెత్తేశారు. నాలుగు గంటల ధర్నాతో ఇటు రైతులు అటు నిలిచిపోయిన బస్సుల్లోని ప్రయాణికులు నరకయాతన పడ్డారు. కిలోమీటర్ల కొద్ది జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మరిపెడ బంగ్లాలో ఎక్కడ చూసినా రైతు లే కనిపించారు. భారీ ఎత్తున కర్షకులు కదిలొచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఒక దశలో అధికారులను సైతం చు ట్టుముట్టి కిక్కుమనకుండా చేశారు. కలెక్టర్‌ రావాలని దిక్కులు పిక్కటేళ్లేలా గోల పెట్టారు. దీంతో ఉద్రిక్తత ప రిస్థితి చోటుచేసుకుంది. యూరియా సరఫరాలో స్థానిక అధికారుల వైఫల్యంపై మండిపడ్డారు. రోజుల తరబడి యూరియా కోసం అరిగోస పడుతున్నా గింత పట్టింపేలేదని గగ్గోలు పెట్టారు. గత రెండ్రోజులుగా వ్యవసాయ అధికారులు యూరియా ఇగ వస్తుంది.. అగ వస్తుందని నమ్మిస్తుండడంతో మరిపెడ పీఏసీఎ్‌సకు తెల్లవారుజాము నుంచే వివిధ గ్రామాల నుంచి రైతులు సద్దులు కట్టుకొని పెద్ద ఎత్తున చేరుకున్నారు. తొమ్మిది అయ్యాక ఈ రోజు యూరియా రావట్లేదని.. లారీలు రేపు వస్తాయని.. రేపే యూరియా పంపిణీ జరుగుతుందని అధికారులు తెలుపడంతో రైతులకు కోపం కట్టలు తెంచుకుంది. కళ్లెర్ర చేసుకొని ఊగిపోయారు. మరిపెడబంగ్లాలోని సెంట్రల్‌ పెట్రోల్‌ బంకు దగ్గరికి రైతులందరు చేరుకొని 365-563 నేషనల్‌ హైవేపై భారీ ధర్నాకు దిగారు. యూరియా వేస్తేనే పంట ఎదుగుతుందని ఆందోళనకు గురవుతున్న రైతన్నలు ఓ వైపు ఆగమవుతూ ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిపోయారు. ఉదయం 10గంటలకు మొదలైన ఆందోళన మధ్యాహ్నం 2గంటల వరకు చేపట్టారు. రైతుల ధర్నాతో ఎన్‌హెచ్‌ఏపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని రైతులను బుజ్జగించారు. ససేమీరా అంటూ యూరియా ఇస్తేనే ఇక్కడినుంచి కదులుతామని భీష్మించి ధర్నాకు దిగారు. మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌, ఎస్సై సతీశ్‌గౌడ్‌, ఏడీఏ విజయ్‌చంద్ర, ఏవో వీరాసింగ్‌ రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కోపం చల్లారలేదు. మహిళలు అధికారులను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు సైతం మౌనంగా ఉండి పోయారు. చివరి ప్రయత్నంగా ఏడీఏ విజయ్‌చందర్‌, ఏవో వీరాసింగ్‌, సీఐ, ఎస్సైలు రైతులను బతిమలాడి రేపు 8వేల యూరియా బస్తాలను తెప్పించి ఊరూరా కౌంటర్లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తామని నమ్మకమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.

కురవిలో రైతుల రాస్తారోకో

కురవి(ఆంధ్రజ్యోతి): కురవిలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కురవి సొసైటీకి సోమవారం యూరియా వస్తుందని అధికారులు తెలపడంతో ఉదయాన్నే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీరా యూరియా రావడం లేదని తెలిసి ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. ఏకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో కురవి ఎస్సై సతీష్‌ రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు.

భారీగా వచ్చిన రైతులు

డోర్నకల్‌(ఆంధ్రజ్యోతి): డోర్నకల్‌ పీఏసీఎ్‌సకు యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చాలాసేపు యూరియా కోసం నిరీక్షించిన రైతులకు సంబంధిత సొసైటీ అధికారులు యూరియా ఇప్పుడు పంపిణీ చేయడం లేదని, మంగళవారం రోజు పంపిణీ చేస్తామని చెప్పడంతో అధికారులు, సిబ్బందితో వాగ్వావాదంకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై వంశీధర్‌ సిబ్బందితో సొసైటీ వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పి శాంతింపచేశారు. దీంతో చేసేదేమిలేక రైతులు నిరాశతో ఇంటిదారి పట్టారు.

టోకెన్ల కోసం తోపులాట

కేసముద్రం(ఆంధ్రజ్యోతి): కేసముద్రం రైతు వేదిక వద్ద సోమవారం తెల్లవారుజామున యూరియా బస్తాలకు టోకెన్ల పంపిణీలో తోపులాట జరగడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. టోకెన్లు ఇస్తారనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచే సుమారు 500 మంది రైతులు క్యూలైనులో నిల్చుని అక్కడే నిద్రించిన విషయం విదితమే. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది వరకు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ముందస్తుగా రైతు వేదిక వద్ద క్యూలైను కోసం మహిళలకు, పురుషులకు వేర్వేరుగా బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను అనుసరిస్తూ లైన్లలో వందల మంది రైతులు నిల్చున్నారు. రైతు వేదిక నుంచి రైతుల లైను ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆపై బయట సీసీ రోడ్డు వరకు కొనసాగింది. రాత్రి నుంచి వర్షం పడుతుండడంతో గొడుగులు, కవర్లు కప్పుకొని యూరియా కోసం అలాగే నిల్చున్నారు. ఉదయం వ్యవసాయాధికారులు టోకెన్ల పంపిణీ ప్రారంభించారు. కొద్దిసేపు టొకెన్లు సజావుగానే సాగినప్పటికీ రైతులు ఒక్కసారిగా గుంపుగా మారారు. దీంతో రైతులు, మహిళా రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రైతులు ఒకరిని ఒకరు నెట్టేసుకోవడం, పట్టా పాస్‌పుస్తకాల జిరాక్స్‌ ప్రతులను లాక్కొని వెళ్లారు. కొంతమంది రైతులు తోపులాట లోంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. పెనుగొండ శివారు గోప్యాతండాకు చెందిన బానోత్‌ అనితకు కాలికి గాయమై నడవలేకపోయింది. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉప్పరపల్లికి చెందిన పరకాల వెంకన్నతోపాటు మరికొంత మంది రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు మైక్‌లో ఎంత చెప్పినా పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. దీంతో చివరికి 430 మందికి టోకెన్లను జారీ చేశారు. వీరిలో 330 బస్తాల యూరియా ధన్నసరి సొసైటీ వద్ద, వంద బస్తాలు ఉప్పరపల్లిలో పంపిణీ చేశారు. ఉప్పరపల్లిలో వారం క్రితం పంపిణీ చేసిన 230 టోకెన్లకు కూడా యూరియా బస్తాలను అందజేసినట్లు ఏవో బి.వెంకన్న తెలిపారు. టోకెన్లు అందని రైతులు సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌ ఎదుటనున్న మహబూబాబాద్‌-వరంగల్‌, తొర్రూరు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యూరియా అందించాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు సముదాయించి రైతులను రాస్తారోకో విరమింపజేశారు.

‘రైతుభరోసా’ జాబితా ఆధారంగా టోకెన్లు

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల వారీగా రైతుభరోసా పథకంలోని పట్టాదారు పాస్‌పుస్తకాల వివరాలు తీసుకొని ఆ జాబితా ఆధారంగా టోకెన్లు, యూరియాను పంపిణీ చేయనున్నట్లు ఏవో బి.వెంకన్న తెలిపారు. ఇప్పుడున్న విధానం వల్ల అందరి రైతులకు యూరియా అందడం లేదని తెలిపారు. ఎన్ని యూరియా బస్తాలు వస్తే అంతమంది మాత్రమే టోకెన్ల కోసం వచ్చే విధంగా జాబితాలోని వరుస క్రమం ఆధారంగా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల రైతులందరికీ యూరియా సమానంగా అందుతుందని చెప్పారు.KRV.jpgMRPD.jpgMBD.jpg

Updated Date - Sep 02 , 2025 | 12:32 AM