ఆందోళన వద్దు.. అందరికీ యూరియా ఇస్తాం
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:52 AM
నెల రోజులు దాటినా.. యూరియా కష్టాలు తీరడం లేదు. రాత్రివేల వెళ్లి పడుకున్నా.. ఉదయం వెళ్లి క్యూలో నిల్చున్నా రైతులకు బస్తా దొరుకుతది అన్న గ్యారంటీ లేదు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ యూరియా పంపిణీ చేసే కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు.
రైతులకు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ భరోసా
కర్షకులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటాం
తొర్రూరు రైతు వేదికలో డీఎస్పీ తనిఖీ
పెద్దతండాలో యూరియా కోసం క్యూలో ఉన్న సత్యవతిరాథోడ్
కోబల్‌తండాలో అన్నదాతల రాస్తారోకో
నెల రోజులు దాటినా.. యూరియా కష్టాలు తీరడం లేదు. రాత్రివేల వెళ్లి పడుకున్నా.. ఉదయం వెళ్లి క్యూలో నిల్చున్నా రైతులకు బస్తా దొరుకుతది అన్న గ్యారంటీ లేదు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ యూరియా పంపిణీ చేసే కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. అధికారులుకు, సంబంధిత సిబ్బందికి సూచనలు ఇస్తున్నా.. పోలీసుల పర్యవేక్షణలో సరఫరా చేస్తున్నా అక్కడక్కడ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. బస్తాల కోసం ద్విచక్రవాహనాలపై వెళ్తూ ఇప్పటికే కొందరు గాయపడ్డారు. పలువురు మృత్యువాత పడ్డారు. ఆదివారం కంబాలపల్లి యూరియా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. తొర్రూరులో డీఎస్పీ కృష్ట కిషోర్ తనిఖీ చేశారు. పెద్దతండాలోని రైతు వేదికలో సత్యవతిరాథోడ్ క్యూలైన్‌లో నిలబడ్డారు.
మహబూబాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ రైతుకు యూరియా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తెలిపారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికీ పారదర్శకంగా యూరియా అందేలా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు వివరాలు సేకరించి ఆన్‌లైన్ మిషన్, రిజిస్టర్‌లో నమోదు చేసి అమ్మకాలు కొనసాగించాలని చెప్పారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. నిత్యం యూరియా పంపిణీపై అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారని తెలిపారు. అనంతరం కేసముద్రం మండలం అమీనాపురంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, కిచెన్‌షెడ్, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం అల్పాహారం, భోజనాన్ని అందించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారిని విజయనిర్మల, డీఆర్‌డీఏ ప్రాజెక్టు మధుసూదన్‌రాజు, తహసీల్దార్లు రాజేశ్వర్‌రావు, వివేక్ పాల్గొన్నారు.
బస్తాల కోసం క్యూలో నిల్చున్న సత్యవతి
ఫకురవి : మాజీమంత్రి సత్యవతిరాథోడ్ యూరియా బస్తాల కోసం మహిళా రైతులతో కలిసి క్యూలైన్‌లో నిల్చున్నారు. పెద్దతండాలో సత్యవతిరాథోడ్‌కు ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యూరియా కోసం ఆదివారం పెద్దతండాలోని రైతు వేదికలో మహిళా రైతులతో కలిసి క్యూలైన్‌లో నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు క్యూలైన్‌లో నిల్చున్నప్పటికి కూపన్ ఇచ్చారు. కానీ, యూరియాకు గ్యారెంటీ ఇవ్వలేదన్నారు. కేవలం ఒక బస్తాకు మాత్రమే కూపన్ ఇవ్వడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. రైతులు నెల రోజులుగా వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం వారాలు, రోజుల తరబడి క్యూలైన్‌లలో వేచి ఉండడం దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సత్యవతిరాథోడ్ పేర్కోన్నారు.
పంపిణీపై సమన్వయ సమావేశం
కేసముద్రం : కేసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు ఆధ్వర్యంలో యూరియా పంపిణీపై వివిధ శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ రైతుభరోసా పోర్టల్ నుంచి తీసుకున్న జాబితా ఆధారంగా గ్రామాల వారీగా వరుస క్రమంలో యూరియా పంపిణీని చేపట్టామని తెలిపారు. గత పది రోజుల్లో 8,133 యూరియా బస్తాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 49,250 బస్తాలను అందించినట్లు చెప్పా రు. ఈ సమావేశంలో తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, ఎస్‌ఐ మురళీధర్‌రాజ్, ఏవో బి.వెంకన్న పాల్గొన్నారు. ధన్నసరి సొసైటీ వద్ద యూరియా పంపిణీని డీఎ్‌సపీ తిరుపతిరావు పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్‌ఐలు మురళీధర్‌రాజ్, కరుణాకర్, సొసైటీ చైర్మన్ మర్రి రంగారావు, సీఈవో గోపాల మల్లారెడ్డి ఉన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు : డీఎస్పీ
తొర్రూరు : యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. తొర్రూరులోని రైతు వేదికను తనిఖీచేసి అధికారులకు తగు సూచన లు చేశారు. యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని వ్యవసాయాధి కారులకు సూచించారు. యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని, గ్రామాల వారీగా అధికారులు టోకెన్‌లు ఇస్తున్నారని, సొసైటీ వద్ద యూరియా సరఫరా చేస్తారని అక్కడే తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేందర్, వ్యవసాయాధికారులు తదితరులు ఉన్నారు.
కోబల్‌తండా రాస్తారోకో
గూడూరు : యూరియా కోసం గూడూరు మండలంలో బారులు తీరారు. గూడూరు మండలంలోని గాజులగట్టు రైతులకు అదే గ్రామంలోని పాఠశాలలో యూరియా పంపిణీ కోసం కూపన్లను అందించారు. చిన్న ఎల్లాపురం రైతులకు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కూపన్లు అందించారు. గోవిందాపురం, దుబ్బగూడెం రైతులకు బొద్దుగొండ రైతు వేదిక వద్ద అధికారులు కూపన్లను అందించారు. మండలానికి 660 బస్తాల యూరియా బస్తాలు రాగా, సుమారు వెయ్యికి పైగా రైతులు తరలివచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. యూరియా బస్తాలు అందని కోబల్‌తండా రైతులు మహబూబాబాద్-నర్సంపేట జాతీయ రహదారిపై అర్థగంటపాటు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న గూడూరు సీఐ సూర్యప్రకాష్, ఏవో అబ్ధుల్ మాలిక్‌లు రైతుల వద్దకు చేరుకుని యూరియా బస్తాలు అందించేలాచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.