Share News

‘ఫీ’ఫైర్‌!

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:47 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఆందోళనబాట పట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొన్నది. ఈనెల 15 సోమవారం నుంచి 21వ తేదీ వరకు మొదటిదఫాగా విద్యాసంస్థల బంద్‌ పాటించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలిన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

‘ఫీ’ఫైర్‌!

ఫీజు బకాయిలు చెల్లించాలని కళాశాలల సమ్మెబాట

నేటి నుంచి 21వ తేదీ వరకు తొలి దఫా మూసివేత

ఈలోగా చెల్లించకుంటే కళాశాలల నిరవధిక సమ్మె

నాలుగేళ్లుగా పేరుకుపోయిన రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ.570కోట్ల బకాయిలు

టోకెన్లు ఇచ్చినా విడుదల కాని నిధులు

పలుకుబడి ఉన్న కాలేజీ యాజమాన్యాలకే చెల్లింపులు

మనుగడ కష్టంగా మారిన చిన్న కాలేజీలు

హనుమకొండ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఆందోళనబాట పట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొన్నది. ఈనెల 15 సోమవారం నుంచి 21వ తేదీ వరకు మొదటిదఫాగా విద్యాసంస్థల బంద్‌ పాటించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలిన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఒక వేళ చెల్లించకుంటే 21వ తేదీ నుంచి నిరవధికంగా కళాశాలలను బంద్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.సుందర్‌రాజుతోపాటు పలు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నాయి.

రూ.570కోట్ల బకాయిలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ ప్రైవేటు కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్న ఇంజనీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌, బీఈడీ, ఎంఈడీ, డిగ్రీ, జూనియర్‌ కాలేజీలకు స్కాలర్‌షిప్పులతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సంక్షేమ శాఖలు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను ఎప్పటికప్పుడు తయారు చేసి ట్రెజరీలకు సమర్పిస్తున్నాయి. ట్రెజరీల్లో చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ సైతం టోకెన్లు జారీ చేసినా ప్రయోజనం లేకుం డా పోతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు రూ.570కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.170కోట్లు, 2023-24కు సంబంధించి రూ.170కోట్లు, 2024-25 సంవత్సరం బకాయిలు రూ.170కోట్లు, 2025-26 విద్యా సంవత్సరం మార్చితో ముగియనున్నది. ఈ బకాయిలు కూడా కలుపుకుంటే మొత్తం బకాయిలు రూ.680 కోట్లకు చేరుకుంటుంది. ట్రెజరీలో బిల్లులు చెల్లించిన తర్వాత బకాయిలు చెల్లించడానికి టోకెనుగా ఇచ్చిన మొత్తం రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. ఎక్కువ మొత్తం బకాయిలు హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలోని కాలేజీలకు రావలసివే. సుమారు లక్షమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్నారు. వీరిలో 50శాతం మంది బీసీ విద్యార్థులే కావడం గమనార్హం. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. ఎప్పుడో 2019 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. అది కూడా కొద్ది మొత్తం ఇటీవలే విడుదలయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఫీజు కడుతుందికదా అన్న ధీమాతో ప్రైవేటు కళాశాలల్లో చేరిన పేద విద్యార్థుల కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. కష్టపడి చదువు పూర్తిచేసినా ఫీజు కట్టనందుకు కళాశాలల నుంచి ఫైనల్‌ సర్టిఫికెట్లు పొందలేని దౌర్భాగ్య స్థితివారిది.

మూడేళ్ల నుంచి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు ఇప్పటి వరకు జరగలేదు. మార్చివస్తే 2025-26 విద్యా సంవత్సరం బకాయిలు కూడా తోడవుతాయి. ఒక్కో కాలేజీకి విద్యార్థుల సంఖ్యను బట్టి గరిష్టంగా రూ.10కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు బకాయిలు రావలసి ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 397 ఉన్నత విద్యా కళాశాలలు ఉన్నాయి. 8 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 24 ఫార్మసీ కాలేజీలు, 8 నర్సింగ్‌ కాలేజీలు, 20 బీఈడీ కాలేజీలు, మూడు అగ్రికల్చరల్‌ కాలేజీలు, 2 హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలు, 332, ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 282 కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంజనీరింగ్‌ కళాశాలల రీయింబర్స్‌మెంట్‌ ఫీజు రూ.35వేలు. మిగతావాటివి రూ.25వేల లోపే. ఒకప్పుడు 27 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండేవి. నిర్వహణ భారం వల్ల వీటిలో చాలా వరకు మూతపడ్డాయి.

టోకెన్లు ఇచ్చినా..

ఫీజు రీయింబర్స్‌ బకాయిల బిల్లుల దరఖాస్తులను ఆయా ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లో ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. వీటికి ఆ కార్యాలయాలు టోకెన్లయితే ఇస్తున్నారు కానీ.. చెల్లింపులు జరగడం లేదని కళాశాలల నిర్వాహకులు వాపోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులను గత సంవత్సరం నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే సమర్పించారు. వీటికి టోకెన్లు ఇవ్వగానే ఇక చెల్లింపులు జరుగుతాయని కళాశాలల యజమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. నిధుల ఫ్రీజింగ్‌ వల్ల ప్రతీనెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌ నిధులను మాత్రమే పరిష్కరిస్తున్నామని, మిగతా ఎలాంటి బిల్లులకు ఆమోదం లభించడం లేదని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా ఫీజులు విడుదల కాకపోవడంతో కళాశాలలను నడపడం కష్టంగా ఉందని యజమాన్యాలు వాపోతున్నాయి.

సర్టిఫికెట్లు ఇవ్వక..

ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో యజమాన్యాలు చదువు పూర్తిచేసిన విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. పైచదువుల కోసం వేరే కాలేజీలో ప్రవేశం తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు లేక నష్టపోతున్నారు. దీనితో మరోదారి లేక పేద, మధ్య తరగతి విద్యార్థులు అప్పులు చేసి ఫీజు బకాయిలు చెల్లించి సర్టిఫికెట్లను తీసుకోవలసి వస్తోంది.

పలుకుబడి ఉంటేనే..

అధికార పార్టీ అండదండలు, పలుకుబడి ఉన్న ప్రైవేటు కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు మాత్రం వెంట వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పేరున్న విద్యాసంస్థల యాజమాన్యాలు తమ పలుకుబడిని ఉపయోగించి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఎలాగోలా బకాయిలను క్లియర్‌ చేయించుకుంటున్నాయి. కానీ పలుకుబడి, రాజకీయ నేపథ్యం లేని చిన్న కాలేజీలు మాత్రం బకాయిల కోసం ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. బిల్లుల చెల్లింపుల కోసం అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం ఉండడం లేదు. ఫీజులు రాకపోవడంతో వాటి మనుగడ కష్టమవుతోంది.

పరీక్షల కేంద్రాల మార్పు

సెప్టెంబరు 15 నుంచి ప్రైవేట్‌ కళాశాలలు బంద్‌ కానున్న నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారులు ప్రైవేట్‌ కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. 15న మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హంటర్‌రోడ్డులోని అల్లూరి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైస్సెస్‌ కళాశాలలో జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ 5 ఏళ్ల 6వ సెమిస్టర్‌ పరీక్షను సుబేదారిలోని యూనివర్సిటీ మహిళ కళాశాలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెప్టెంబరు 15, 17, 19వ తేదీల్లో జరగాల్సిన ఫార్మాడీ మొదటి ఏడాది పరీక్షల కేంద్రాలను ప్రైవేట్‌ కళాశాలల నుంచి మార్చినట్లు ప్రకటించారు. విద్యార్థులు తమ పరీక్షల కేంద్రాన్ని వర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ వెంటనే చెల్లించాలి

సంగంరెడ్డి సుందర్‌ రాజు యాదవ్‌, డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

ఉన్నత విద్యా సంస్థలకు మూడేళ్లుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఈనెల 15 నుంచి 21వరకు ఉన్నత విద్యా సంస్థలు బంద్‌ పాటిస్తాయి. అప్పటికీ ప్రభుత్వం స్పందించపోతే నిరవధిక బంద్‌ పాటిస్తాయి. రాష్ట్రంలో 25లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి తమ ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడంవల్ల ఎక్కువగా నష్టపోయేది బహుజన విద్యార్థులే. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.

Updated Date - Sep 15 , 2025 | 12:47 AM