చీర్స్.. చీర్స్...
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:46 AM
మద్యం షాపుల టెండర్‌కు లైసెన్స్‌ల గడువు పూర్తికాకముందే ప్రభుత్వం రెండు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో రూ.2లక్షలు ఉన్న టెండర్ ఫీజు(నాన్ రిఫండబుల్)ను ఈసారి రూ.3లక్షలకు పెంచి ప్రభుత్వ ఖజానా నింపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2025-27 మద్యం పాలసీని అమలు చేసేందుకు జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు.
మద్యం షాపుల టెండర్లకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 18వరకు గడువు... 23న లక్కీ డ్రా
ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు
వరంగల్ అర్బన్, రూరల్‌లో గౌడ్స్‌కు 29, ఎస్సీలకు 16, ఎస్టీలకు 3 షాపుల కేటాయింపు
వరంగల్ క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల టెండర్‌కు లైసెన్స్‌ల గడువు పూర్తికాకముందే ప్రభుత్వం రెండు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో రూ.2లక్షలు ఉన్న టెండర్ ఫీజు(నాన్ రిఫండబుల్)ను ఈసారి రూ.3లక్షలకు పెంచి ప్రభుత్వ ఖజానా నింపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2025-27 మద్యం పాలసీని అమలు చేసేందుకు జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు.
రిజర్వేషన్ల డ్రా తీసిన కలెక్టర్లు
మద్యం షాపులలో ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం గౌడ్స్‌కు 15శాతం రిజర్వేషన్లు కేటాయించింది. గురువారం మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించిన నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, హనుమకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లకు డ్రా తీశారు. వరంగల్ రూరల్‌లో 57 వైన్‌షాపులు ఉండగా, వరంగల్ అర్బన్‌లో 67 షాపులు ఉన్నాయి. లక్కీ డ్రాలో వరంగల్ రూరల్‌లో ఉన్న 57షాపులకు గౌడ్స్‌కు 14, ఎస్టీలకు 2, ఎస్సీలకు 6షాపులు కేటాయించారు. వరంగల్ అర్బన్‌లో 67 షాపులకు గౌడ్స్‌కు 15 షాపులు, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఒక షాపు కేటాయించారు.
గత టెండర్‌లో 7,500 దరఖాస్తులు
గత మద్యం పాలసీలో రూ.2లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజు ఉన్నప్పుడు వరంగల్ రూరల్‌లో సుమారు 2,500 దరఖాస్తులు రాగా, వరంగల్ అర్బన్‌లో 5,000 దరఖాస్తుల వరకు వచ్చినట్లుగా ఆబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్క ప్రకారం రూ.150కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. ఈసారి టెండర్లలో సుమారుగా 10వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా వ్యాపారస్తులను ఆకట్టుకునే విధానాలను కొత్త నోటిఫికేషన్‌లో రూపొందించారు.
స్టేషన్‌ల వారీగా దరఖాస్తుల స్వీకరణ
రెండు జిల్లాల్లోని ఖిలావరంగల్, హనుమకొండ, వరంగల్ అర్బన్, కాజీపేట, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మద్యం షాపులకు ధరఖాస్తులు స్వీకరించేందుకు స్టేషన్ల వారిగా ఈఎస్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లుగా ఆయా జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వెల్లడించారు. నోటిఫికేషన్‌లో ఉన్న ప్రతీ అంశాన్ని దరఖాస్తు వేసే క్రమంలో టెండర్‌దారుడికి వివరించేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాట్లు చేస్తామన్నారు. గతంలో నాలుగు వాయిదాల్లో కట్టే లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో కట్టేందుకు వెసులుబాటు కల్పించారు.
జనగామ జిల్లా పరిధిలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో గతంలో 47మద్యం దుకాణాలు ఉండగా తాజాగా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకటి చొప్పున పెరగడంతో వీటికి షాపుల సంఖ్య 50కి చేరింది. మద్యం దుకాణాల్లో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 47 దుకాణాల్లో గౌడలకు 13, ఎస్సీలకు 5, ఎస్టీలకు ఒక షాపు లెక్కన మొత్తంగా 19 షాపులు రిజర్వ్ కానున్నాయి. మిగతా 31 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఎంపిక చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో గతంలో 59 మద్యం దుకాణాలు ఉండగా, ప్రస్తుతం కేసముద్రంలో ఒకటి, తొర్రూరులో మరొకటి చొప్పున పెరగడంతో షాపుల సంఖ్య 61కి చేరింది. గౌడ కులస్తులకు 13, ఎస్సీలకు 05, ఎస్టీలకు (నాన్ ఏజెన్సీ) 01, ఎస్టీలకు (ఏజెన్సీ)లో 11, జనరల్‌కు 31 షాపులు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 2023-25 మద్యం పాలసీ కింద 59 దుకాణాలు ఏర్పాటు అయ్యాయి. వీటిలో భూపాలపల్లి జిల్లాలో 30, ములుగు జిల్లాలో 29 ఉన్నాయి. ములుగు జిల్లా వేరైనప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం ఒక్కటిగానే పరిగణిస్తోంది. భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.