Warangal Congress Leaders: వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య సమసిన వివాదం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:44 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సమసిపోయాయి. పార్టీ కోసం కలిసి
కలిసి పనిచేయడానికి అంగీకారం
చర్చకు రాని రాజగోపాల్‌రెడ్డి అంశం
మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం..
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సమసిపోయాయి. పార్టీ కోసం కలిసి పనిచేయడానికి ఇరు వర్గాలకు చెందిన నాయకుల మధ్య అవగాహన కుదిరింది. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కమిటీ సుమారు రెండు గంటల పాటు సమావేశమై పార్టీ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే కొండా మురళి కమిటీ ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. దీనిపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక ఇటీవల అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయమై భేటీలో చర్చించారు. అయితే భేటీకి అనిరుధ్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఇతర పనుల కారణంగా కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతున్నట్టు సమాచారమిచ్చారు. తాను రాజకీయ నాయకుల గురించి మాట్లాడలేదని.. కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లపైనే వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. బీజేపీ కూటమి భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడును విమర్శించినందుకు కాంగ్రె స్ సంతోషించాలంటూ ఆయన పేర్కొన్నారు. భేటీ అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇక పార్టీ కార్యక్రమాలన్నింటిలో కలిసి పని చేయడానికి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకొన్నారని తెలిపారు. అనిరుధ్ రెడ్డి వివరణను టీపీసీసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇటు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో తరచూ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొద్దిరోజులుగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై కమిటీకి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని మల్లు రవి స్పష్టం చేశారు. అసలు రాజగోపాల్‌రెడ్డి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. మరోవైపు కొండా మురళి కూడా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తమ రక్తంలోనే ఉందని, పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున.. పార్టీ నేతలతో కలిసి పనిచేయాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్టు చెప్పారు.