Share News

Old Dispute: వివేక్‌ వర్సస్‌ అడ్లూరి

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:41 AM

మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వివేక్‌ వెంకటస్వామి మధ్య సమసిపోయిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుంది......

Old Dispute: వివేక్‌ వర్సస్‌ అడ్లూరి

  • ముగిసిన వివాదం మళ్లీ తెరపైకి!

  • నాపై కావాలనే మంత్రి అడ్లూరి విమర్శలు ఆయన్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది కాకానే అడ్లూరితో నాకు

  • విభేదాల్లేవు: మంత్రి వివేక్‌ వివేక్‌ పార్టీ నేతల సమక్షంలో మాట్లాడాల్సింది ఆయన కుమారుడిని గెలిపించింది మేం కాదా?

  • ఇక అధిష్ఠానమే చూసుకుంటుంది: అడ్లూరి

నిజామాబాద్‌/జగిత్యాల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వివేక్‌ వెంకటస్వామి మధ్య సమసిపోయిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుంది. జూబ్లీహిల్స్‌లో ప్రెస్‌మీట్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై అడ్లూరి చేసిన వ్యాఖ్యలను వివేక్‌ తాజాగా మరోసారి ప్రస్తావించడమే ఇందుకు కారణమైంది. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన మాలల ఐక్య సదస్సుకు మంత్రి వివేక్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయినా ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను మాలల కోసం పోరాటం చేస్తుంటే.. కొందరు కావాలనే కుట్రలు చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నానని, మంత్రి అడ్లూరి విషయంలో అనవసరంగా తన పేరును ప్రచారం చేశారని వాపోయారు. తనది మాల జాతి అంటూ మంత్రి అడ్లూరి విమర్శిస్తున్నారని, కానీ.. ఆయనను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామి (కాకా) అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలుపు కోసం కష్టపడుతున్నామని, తాను ఇన్‌చార్జి అయ్యాక అక్కడ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వివేక్‌ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వెంటనే స్పందించారు. ముగిసిన వివాదాన్ని వివేక్‌ మళ్లీ తెరపైకి తెచ్చారని, ఈ అంశాన్ని ఇక అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలలను గౌరవించిందెవరో అందరికీ తెలుసునని, ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని చెప్పారు. మంత్రి వివేక్‌ కుమారుడిని ఎంపీగా గెలిపించింది తాము కాదా? అని ప్రశ్నించారు. గతంలో వివేక్‌ తండ్రి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇచ్చారనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ‘‘ఏదైనా మన పార్టీ నేతల సమక్షంలో అంతర్గతంగా మాట్లాడితే బాగుండేది’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 13 , 2025 | 07:56 AM