చూపులోపం!
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:58 PM
చిన్నారులను దృష్టి లోప సమ స్య వెంటాడుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో కంటి సమస్యలకు గురవుతున్నారు. మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వంటివి చిన్నారుల్లో దృష్టి లోపానికి ప్రధాన కారణం కాగా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడమూ ఓ కారణంగా డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నారుల్లో టీవీ, సెల్‌ఫోన్ల ప్రభావం
ఆర్‌బీఎస్‌కే బృందాల పరిశీలనలో వెల్లడి
జిల్లాలో 1,458 మంది విద్యార్థులకు కంటి సమస్యలు
గత ఏడాది ఏప్రిల్, ఆగస్టులో ప్రాథమిక పరీక్షలు
ప్రస్తుతం తుది దశ పరీక్షలకు ప్రణాళిక
దశలవారీగా శస్త్రచికిత్స.. అద్దాల పంపిణీ
జనగామ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): చిన్నారులను దృష్టి లోప సమ స్య వెంటాడుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో కంటి సమస్యలకు గురవుతున్నారు. మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వంటివి చిన్నారుల్లో దృష్టి లోపానికి ప్రధాన కారణం కాగా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడమూ ఓ కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. జనగామ జిల్లావ్యాప్తంగా 1,458 విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు అధికారు లు ప్రాథమికంగా గుర్తించారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ‘రాష్ట్రీయ బా ల స్వస్థ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ఆద్వర్యంలో నిర్వహించిన కంటి పరీ క్షల్లో విద్యార్థుల్లో దృష్టి లోపాలు బయటపడ్డాయి. గత ఏడాది ఏప్రిల్, ఆగస్టులో నిర్వహించిన పరీక్షలు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన వి ద్యార్థులకు తాజాగా మెరుగైన, తుది దశ పరీక్షలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఇందుకోసం 15 రోజుల ప్రణాళికను సిద్దం చేసింది.
ఆర్‌బీఎస్‌కే ద్వారా పరీక్షలు
చిన్నారులు, విద్యార్థుల్లో రుగ్మతలను గుర్తించి అవసరం ఉన్న వారికి తగిన చికిత్స అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి’ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఫార్మసిస్టుతో కూడిన బృందం తమకు కేటా యించిన అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చిన్నారులు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటుంది. చిన్నారుల్లో వచ్చే రుగ్మతలను ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందించేందుకు గానూ ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. అంగన్‌వాడీ, పాఠశాలల్లో చదివే పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారా? లేదా? అని మొదటగా చూస్తారు. ఆ తర్వాత ప్రతి విద్యార్థిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని అడి గి తెలుసుకుంటారు. జ్వరం, జబులు, దగ్గు లాంటి సాధారణ అనారో గ్యం ఉన్న వారికి అక్కడే మందులు అందిస్తారు. పిల్లల్లో దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీసే లక్షణాలు ఉన్న ట్లు గుర్తిస్తే వారిని జిల్లా ఆసుపత్రి కి, మాతా శిశు ఆసుపత్రికి సిఫారసు చేసి ఉన్నతా ధికారులకు సమాచారం ఇస్తారు. ఈ కార్యక్ర మం కింద గత ఏ డాది ఏప్రిల్, ఆగ స్టులో 5-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
జిల్లాలో 8 బృందాలు
రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద జిల్లాలో 8 బృందాలు పని చేస్తున్నాయి. బచ్చన్నపేట-ఎ, బచ్చన్నపేట-బి, స్టేషన్‌ఘన్‌పూర్-ఎ, స్టేషన్‌ఘన్‌పూర్-బి, జనగామ,-ఎ, జనగామ-బి, పాలకుర్తి-ఎ, పాలకు ర్తి-బి బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఒక ఫార్మసిస్టు, ఒక ఏఎన్‌ఎం ఉంటారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లలో ఒకరు ఆడ మెడికల్ ఆఫీసర్ కచ్చితంగా ఉండాలి. జిల్లాలోని 12 మండలాల్లో 1392 అంగన్‌వాడీ కేంద్రాలు, 549 పాఠశాలలు, 21 జూనియర్ కళాశాలలు ఉండగా వీటి పరిధిలో సుమారు 1,13,207 మంది చిన్నారులు, విద్యార్థులు ఉన్నారు. కాగా.. ఆర్‌బీఎస్‌కే కింద గత ఏడాది 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోపాలపై పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 12 మండలాలు, జనగామ మునిసిపాలిటీలో కలిసి 5-10 తరగతి చదువుతున్న విద్యా ర్థులు 27,322 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆర్‌బీఎస్‌కే బృందాల్లోని మెడికల్ ఆఫీసర్లు పరీక్షలు చేయగా 1,458 మందికి దృష్టి లోప సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అదే ఏడాది ఆగస్టులో 1458 మంది విద్యార్థులను కంటి వైద్య నిపుణులు పరీక్షించి కంటి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
జిల్లా ఆస్పత్రిలో మెరుగైన పరీక్షలు
దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు మరింత మెరుగైన పరీక్షలు నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ భావించింది. ఇందులో భాగంగా జనగామ జిల్లా ఆసుపత్రిలో 1,458 మందికి తుది దశ కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. దీని కోసం అధికారులు 15 రోజుల ప్రణా ళికను తయారు చేసుకున్నారు. రోజుకు వంద మంది విద్యార్థుల చొప్పున మార్చి 6 వరకు 1,458 మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్‌బీఎస్‌కే బృందాలు ఉండగా, ఒక్కో బృందానికి ఒక్కో వాహనం ఉంది. ఈ 8 వాహనాల ద్వారా రోజుకు వంద మందిని ఆయా మండలాల్లోని స్కూళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తా రు. వీరికి ఇక్కడ కంటి వైద్య నిపుణులతో పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షల్లో సర్జరీలు అవసరమైన వారికి సర్జరీకి పంపిస్తారు. కేవలం కంటి అద్దాల అవసరమైన వారికి అద్దాలను ఇచ్చి పంపిస్తారు. ఈ కార్యక్రమం జిల్లా ఆస్పత్రి సోమవారం ప్రారంభమైంది. కంటి పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు సోమవారం పరిశీలించారు. పరీక్షల తీరును వైద్యులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.