Jagga Reddy: గెలుపు ఓటములు నన్ను ప్రభావితం చేయలేవు
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:44 AM
గెలుపు ఓటములు తనను ప్రభావితం చేయలేవని, తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది
రాత్రిళ్లు జెండాలు కట్టి..
పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది
గెలిస్తే తోపు అనుకోను.. ఓడితే ఇంట్లో పడుకోను
కులం పేరు చెప్పుకొని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చాను
మళ్లీ రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సదాశివపేట, అక్టోబరు 12, ఆంధ్రజ్యోతి: గెలుపు, ఓటములు తనను ప్రభావితం చేయలేవని, తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాత్రిళ్లు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర తనదని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలో కందకం రోడ్డు ప్రగతి పనులపై తన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలతో కలిసి జగ్గారెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి కులం పేరు చెప్పుకొని రాలేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసి లీడర్ అయ్యానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ అధికారంలోకి రాదని, ఆ పార్టీలో వాళ్లలోవాళ్లే కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై తాను చేసే సమీక్షలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. పనుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తన మాట కాదనరని జగ్గారెడ్డి చెప్పారు. తాను చేసే పనికి ఓట్లకు సంబంధం ఉండదని, మనం అంతటి బలహీనులం కాదని జగ్గారెడ్డి ప్రస్తావించారు.