Share News

Premature Ejaculation Treatment: శృంగారం.. వయాగ్ర మాత్ర

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:02 AM

పెళ్లికి ముందు పురుషులు శృంగారంపై చాలా అంచనాలు వేసుకుంటుంటారు.

Premature Ejaculation Treatment: శృంగారం.. వయాగ్ర మాత్ర

సెక్స్‌లో విఫలమవుతున్న పురుషులకు స్వల్ప మోతాదులో సూచిస్తున్న వైద్యులు

  • ఏ లోపం లేకున్నా శృంగారంలో వైఫల్యం.. ‘పర్ఫార్మెన్స్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’తోనే..

  • ఎక్కువసేపు శృంగారానికి తహతహ

  • ఈ ఒత్తిడితో అంగ స్తంభన, శీఘ్రస్కలన సమస్యలు

  • ఆందోళనతో వైద్యుల వద్దకు.. స్వల్ప మోతాదులో వయాగ్రా మేలంటున్న వైద్యులు

  • ఇదంతా విశ్వాసం పెంచేందుకు మాత్రమే..

  • అదే సమయంలో కౌన్సిలింగ్‌తో అవగాహన

  • నెలా, రెండు నెలలు ఓకే.. అంతకు మించి వినియోగిస్తే ఇబ్బంది తలెత్తుతుందని హెచ్చరిక

హైదరాబాద్‌లో కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి భర్త నుంచి విడాకులకు సిద్ధమైంది. భర్త శృంగారంలో పాల్గొనడం లేదని, అతనికి ఆ సామర్థ్యం లేదంటూ సర్టిఫికెట్‌ ఇవ్వాలని వైద్యుడిని సంప్రదించింది. వైద్యుడు ఆమె భర్తకు పరీక్షలన్నీ చేసి పర్ఫార్మెన్స్‌ యాంగ్జైటీతో అంగ స్తంభన సమస్య తలెత్తిందని గుర్తించి.. ఫినైల్‌ రింగ్‌ (అంగ స్తంభన సమయంలో రక్తం త్వరగా వెనక్కివెళ్లి మెత్తబడిపోకుండా ఆపే రింగ్‌) వాడాలని సలహా ఇచ్చారు. అలాగే 2 నెలల పాటు స్వల్ప మోతాదులో వయాగ్రా వాడాలని సూచించారు. కొన్నాళ్లకు ఆ జంట వైద్యుడిని కలిసి తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు.

హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి ముందు పురుషులు శృంగారంపై చాలా అంచనాలు వేసుకుంటుంటారు. ఎక్కువ సేపు శృంగారం చేయాలని, భార్యను సంతోషపెట్టాలని భావిస్తుంటారు. అమ్మాయిలు కూడా ఎన్నో ఊహల్లో ఉంటుంటారు. కానీ ఊహించుకున్న విధంగా పెళ్లి తర్వాత పరిస్థితులు కనిపించకపోవడంతో ఆందోళన పెరుగుతుంది. పోర్న్‌ వీడియోల్లో చూసినట్టుగా చేయాలనే ఆరాటం, అవగాహన లేకపోవడంతో పురుషులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తుంటారు. మొదట్లోనే ఏమాత్రం తేడా వచ్చినా కుంగిపోతుంటారు. తనలో లైంగిక సామర్థ్యం సరిగా లేదేమోనని అనుమానాలు, దానితో భార్యకు దూరంగా ఉండటం, ఇతర ఒత్తిళ్లతో అంగస్తంభన లోపం, శీఘ్రస్కలనం వంటి సమస్యల బారినపడుతుంటారు. దీనిని ‘పర్ఫార్మెన్స్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’గా వ్యవహరిస్తారు. దీనితో భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయి. చివరకు విడాకుల వరకు వెళుతున్నాయి. ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో చాలా మంది 25, 30 ఏళ్ల యువకులేనని.. వారిలో ఒకసారి నాటుకుపోయిన భయం వారిని శృంగార జీవితానికి దూరం చేస్తోందని సెక్సాలజిస్టులు, ఆండ్రాలజిస్టులు చెబుతున్నారు. లైంగిక సామర్థ్యం బాగానే ఉన్నా లేనిపోని భయాందోళనతో ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు స్వల్ప మోతాదులో వయాగ్రాను కొంతకాలం పాటు వాడాలని సూచిస్తున్నామని, ఇది వారి లైంగిక సామర్థ్యంపై నమ్మకం రావడానికి తోడ్పడుతోందని వివరిస్తున్నారు. ఆ తర్వాత వయాగ్రా అవసరం లేకుండానే శృంగార జీవితాన్ని గడుపుతున్నారని చెబుతున్నారు.

20శాతానికిపైగా యువతే..

శృంగార సామర్థ్య సమస్యలతో తమ వద్దకు వస్తున్నవారిలో 20 శాతం మందికిపైగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్యవారు 60శాతం.. 60 ఏళ్లు దాటినవారు మిగతా 20 శాతం మంది ఉంటున్నారని వివరిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి రోజూ 20 మందికిపైగా, బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి నెలకు 90 నుంచి 100 మంది బాధితులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.


శృంగార పటుత్వ సమస్యలతో వస్తున్నవారిలో 80శాతం మంది ఒత్తిడి, మానసిక సమస్యలతో శీఘ్ర స్కలనం, అంగ స్థంభన ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారని.. వీరిలో చాలా మందిలో కౌన్సెలింగ్‌, స్వల్ప మోతాదులో వయాగ్రాతో పరిస్థితి చక్కబడుతోందని వివరిస్తున్నారు. మిగతా 20ు మందిలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని.. వారికి మందులు, మల్టీవిటమిన్లు, చికిత్సలు అందిస్తున్నామని చెబుతున్నారు.

విచ్చలవిడిగా పెరిగిన వినియోగం

శృంగార పటుత్వ సమస్యలతో బాధపడుతున్నవారు, మరింతగా ఆనందం పొందవచ్చనే భావనతో ఉండేవారు కొందరు విచ్చలవిడిగా వయాగ్రాను వినియోగిస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండానే, తగిన ప్రిస్కిప్షన్‌ లేకుండానే మందుల దుకాణాల్లో, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో వయాగ్రా మాత్రలను కొని వినియోగిస్తున్నారు. దీంతో చాలా మంది అవగాహన లేక అధిక మోతాదులో వాడుతున్నారు. మాత్రలు, ఇతర రూపాల్లో వయాగ్రాను తయారు చేస్తున్న కంపెనీలు సోషల్‌ మీడియాలో విపరీత ధోరణిలో ఇస్తున్న ప్రకటనలు కూడా యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీనితో ఇటీవల వయాగ్రా వినియోగం బాగా పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. అవసరం లేకున్నా ఇలా వయాగ్రాను వాడటం సమస్యాత్మకంగా పరిణమిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఓ వైద్యుడి వద్దకు వచ్చారు. ఆయనకు గుండె జబ్బు సమస్య ఉంది. బలహీనంగా ఉన్నారు. లైంగిక సామర్థ్యం సరిగా లేక తాను, తన భార్య అసంతృప్తిగా ఉన్నట్టు వైద్యుడికి చెప్పారు. డాక్టర్‌ ఆయనకు పరీక్షలు చేయగా.. శరీరంలో హార్మోన్ల స్థాయిలు సరిగా లేవు. దీనితో హార్మోన్లు పెరగడానికి మందులతోపాటు బలం కోసం మల్టీవిటమిన్లు ఇచ్చారు. అవి నెల రోజులు వాడాక.. తక్కువ మోతాదులో రెండు, మూడు నెలల పాటు వయాగ్రా వాడాలని సూచించారు. వైద్యుడి సూచన మేరకు వ్యవహరించిన ఆ వ్యక్తి తన శృంగార జీవితం బాగుందని, తన భార్య గర్భవతి అయిందని వైద్యుడికి చెప్పి సంతోషం వ్యక్తం చేశారు.

... శరీరంలో అంతా సవ్యంగానే ఉన్నా, లేక ఏదో చిన్న సమస్య ఉన్నా.. మానసిక ఒత్తిళ్లు, ఉద్వేగాలతో శృంగార జీవితాన్ని సరిగా గడపలేకపోతున్న పురుషులకు వైద్యులు చేస్తున్న చికిత్స ఇది. ఏదో పోర్న్‌ వీడియోల్లో చూసినట్టుగా చేయలేకపోతున్నామేనన్న ఆందోళనతో సమస్యను మరింత పెంచుకుంటున్న వారికి వైద్యులు స్వల్ప మోతాదులో ‘వయాగ్రా’ను సూచిస్తున్నారు. నిజానికి దీనితో పనిలేకున్నా.. పురుషుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తాత్కాలికంగా వాడాలని చెబుతున్నారు. బంధాలు నిలబడేందుకు కాసింత వయాగ్రా తోడ్పడుతోందని అంటున్నారు.


FGS.jpg

అతిగా వాడితే సమస్యలు తప్పవు!

‘‘వయాగ్రా ఎక్కువ డోసు వేసుకుంటే ఎక్కువ సమయం, ఎక్కువ సార్లు శృంగారం చేయవచ్చనే భావనతో కొందరు ఎక్కువ డోసులో, తరచూ వేసుకుంటారు. వైద్యుల సలహా లేకుండా విపరీతంగా వాడటం ఇబ్బందులకు దారితీస్తుంది. అలాంటి వారిలో శృంగార పటుత్వంపై ప్రభావం పడుతుంది. నిజానికి చాలా మంది పురుషుల్లో మానసిక సమస్యలే శృంగార పటుత్వ సమస్యకు కారణం. మా వద్దకు వచ్చినవారిలో సమస్య ఏమిటో ముందు పరిశీలిస్తాం. మానసిక, పని ఒత్తిడి ఉన్నవారిలో చాలా మందికి కౌన్సెలింగ్‌తో మందుల అవసరం లేకుండానే పరిష్కారం దొరికేలా చేస్తాం. మరికొందరిలో రెండు, మూడు నెలల పాటు స్వల్ప మోతాదు వయాగ్రా సూచిస్తాం. వెన్నెముక సమస్య, నడుము నొప్పి, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా.. సమస్యలు నియంత్రణలోకి వచ్చే వరకు వయాగ్రా వాడితే చాలు. కొందరు ఆరు నెలల నుంచి ఏడాది పాటు వాడాల్సి వస్తుంది. ’’

- డాక్టర్‌ శ్రీకాంత్‌ మున్నా,

ఆండ్రాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి

SFA.jpg

తాత్కాలికంగా సూచిస్తున్నాం

‘‘శీఘ్ర స్ఖలనం, అంగ స్థంభన సమస్యలతో నెలకు 80 నుంచి 90 మంది వస్తున్నారు. అందులో 20 మందికిపైగా 25, 30 ఏళ్ల యువకులే ఉంటున్నారు. భార్యను సంతృప్తిపర్చలేకపోతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి పరీక్షలు చేసి, అవసరం మేరకు వయాగ్రా సూచిస్తున్నాం. స్వల్పంగా 2.5 ఎంజీ (మిల్లీగ్రాములు) నుంచి 20ఎంజీ వరకు వాడాలని చెబుతున్నాం. సమస్య తీరు, అవసరం, వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదులో హెచ్చుతగ్గులు ఉంటాయి. తక్కువ మోతాదులో నెలా రెండు నెలలు ఇచ్చి, వారిలో శృంగార సామర్థ్యంపై విశ్వాసం పెరిగేలా చూస్తున్నాం. తర్వాత వయాగ్రా వాడకం నిలిపివేయిస్తున్నాం’’

- డాక్టర్‌ ప్రియాంక్‌ సలేచా,

ఆండ్రాలజిస్టు, అపోలో ఫెర్టిలిటీ ఆస్పత్రి

Updated Date - Jul 20 , 2025 | 08:14 AM