TG Govt: ఆధారాలు సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వండి
ABN , Publish Date - May 14 , 2025 | 07:18 AM
తెలంగాణ ప్రభుత్వం, గట్టు వామనరావు మరియు నాగమణి హత్య కేసులో ఆధారాలు సమర్పించేందుకు మరికొంత సమయం కోరింది. సుప్రీంకోర్టు ఆగస్టు 12కి విచారణను వాయిదా వేసింది.
వామనరావు దంపతుల హత్య కేసులో
సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
తదుపరి విచారణ ఆగస్టు 12కు వాయిదా
న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఆయన తండ్రి గట్టు కిషన్ రావు 2021 సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నేత పుట్ట మధుకర్ ప్రమేయంతోనే హత్య జరిగిందని, సీబీఐ విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సుదీర్ఘకాలంగా వాదనలు వినిపిస్తున్నారు. విచారణను సీబీఐకి అప్పగించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. న్యాయస్థానం ఆదేశిస్తే విచారణకు తాము సిద్ధమేనని సీబీఐ సైతం అంగీకరించింది. దీంతో ఆధారాలన్నీ సమర్పిస్తే, పరిశీలించి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కేసు మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కేసుకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ఆధారాలను సమర్పించడానికి తమకు మరో అవకాశం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి సమయం ఇచ్చేదిలేదని జస్టిస్ సుందరేశ్ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ కేసును ధర్మాసనం ఆగస్టు 12కు వాయిదా వేసింది.