Share News

జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు షురూ

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:38 AM

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది.

జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు షురూ
దర్గాలోపల ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు

పాలకవీడు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదులు స్వామిని మొ దటి రోజు ముస్తాబు చేసి పెళ్లికొడుకుల అలంకరించారు. కొవొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌ మోహినుద్దీన్‌షా, జాన్‌పాక్‌ షహీద్‌ రహమతుల్లా సమాధులపై దర్గా ముజవర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. దర్గా వద్ద నాగేంద్రుని పుట్టకు మహిళలు పూ జలు నిర్వహించారు. దర్గా ముజావర్‌ జాని కుటుంబసభ్యులు దర్గాలోని రెండు సమాధులపై హైదరాబాద్‌ నుంచి తెప్పించిన పువ్వులు, ప్ర త్యేక దట్టీలతో అలంకరించారు. సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ, ఉదయం ఖవ్వాలీ నిర్వహించారు. మతాలకు అతీతంగా దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడి పుట్టకు మహిళలు పూజలు నిర్వహించారు.

ఉర్సులో వెలిసిన దుకాణాలు

ఉర్సులో తినుబండారాలు, వివిధ రకాల స్టాళ్లు ఇప్పటికే ఏర్పాటు చేశా రు. చుట్టుపక్కల గిరిజనతండాలు ఉర్సుకోసం బంధువులను పిలుచుకొని కందూరు చేసుకుంటున్నారు. మెడికల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీలు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. కోదాడ నుంచి నేరేడుచర్ల మీదుగా ప్రత్యేక బస్సులు, మిర్యాలగూడ డిపో నుంచి దామరచర్ల, నేరేడుచర్ల మీదుగా ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడుపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావడంతో భక్తులు సంఖ్య పెరిగే అవకాశముందని బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల ఇబ్బందులు జరగకుండా 550 మ ంది పోలీసులతో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దర్గా పరిసరాల్లో మూడు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

తాగునీటి సరఫరా

నిరంతరాయంగా తాగునీటిని అందించేందుకు డెక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యం ముందుకు వచ్చి ంది. ఎనిమిది ట్రాక్టర్‌ ట్యాం కర్లతో నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారు. దర్గా పరిసరాలలో దుమ్ము లేవకుండా రహదారులపై నిరంతరం నీటిని చల్లుతున్నారు. దర్గా పరిసర ప్రాంతంలో రూ.5 లక్షలతో సోలార్‌ లైట్లు, రూ.5 లక్షలతో శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

నేడు గంధం ఉరేగింపు

వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి తెచ్చిన గంధాన్ని ముజవర్లు దర్గా వద్ద ఉన్న చందల్‌ఖానాలో ఉంచుతారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో శుక్రవారం ఉదయం 9గంటలకు చందల్‌ఖానా నుంచి ఊరేగింపుగా బయలు దేరుతుంది. సమీపంలోని కల్మెటతండా, జాన్‌పహాడ్‌, చెర్వుతండా గ్రామాల వరకు ఊరేగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గంధాన్ని జాన్‌పహాడ్‌ దర్గా వద్దకు తీసుకొచ్చి హజ్రత్‌సయ్యద్‌ మోహినుద్దీన్‌షా, జాన్‌పాక్‌ షహీద్‌ రహమతుల్లా సమాధులపైకి ఎక్కిస్తారు. గురువారం అర్ధరాత్రి నుంచే వేలాది మంది భక్తులు దర్గా వద్దకు చేరుకుని గంధం ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు.

నేడు జాన్‌పహాడ్‌ దర్గాకు మంత్రి ఉత్తమ్‌

ఉర్సు గంధం మహోత్సవానికి నీటిపారుదల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని మండల కాంగ్రెస్‌ నాయకుడు సుబ్బారావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Jan 24 , 2025 | 12:38 AM