Farmers: యూరియా కోసం అవే కష్టాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:01 AM
రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రైతులు బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒక దశలో తోపులాట జరిగింది.
ఆమనగల్లులో తోపులాట
మరిపెడలో రైతుల పట్టా, ఆధార్ జిరాక్స్‌లను విసిరేసిన అధికారులు
కోనరావుపేటలో రైతుల ధర్నా
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రైతులు బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒక దశలో తోపులాట జరిగింది. దాంతో పోలీసు బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా దోమలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి అందరికీ యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు నిర్వాహకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పీఏసీఎ్‌సకు వచ్చిన రైతుల పట్టా, ఆధార్ జిరాక్స్ ప్రతులను వ్యవసాయ శాఖ సిబ్బంది విసిరేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.. రైతులు ఎగబడడంతో కాగితాలు టేబుల్‌పై నుంచి కిందపడిపోయాయన్నారు.
గత వారం రోజులుగా ఎదురుచూస్తున్న నర్సింహులపేట రైతులకు ఎట్టకేలకు వ్యవసాయ అధికారులు పోలీసుల సమక్షంలో కూపన్లు పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మంది రైతు వేదిక వద్దకు రాగా 770 మందికి మాత్రమే కూపన్లు ఇవ్వడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుతిరిగారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు సేవా సహకార పరపతి సంఘం వద్దకు ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 500 మందికి పైగా రైతు లు క్యూలైన్‌లోనే గంటల తరబడి నిలబడ్డారు. హైదరాబాద్ నుంచి 444 యూరియా బస్తాలు రాగా, వాటిని పోలీసుల సమక్షంలో ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో వెళ్లిపోయారు. సరిపడా యూరియా ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో రైతులు రహదారిపై బైఠాయించారు.