Vijayawada Robbery: రూ.2.5 కోట్ల విలువైనయాపిల్ ఫోన్లు కొట్టేశారు
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:39 AM
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఉన్న గోడౌన్ నుంచి విజయవాడ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఉన్న షోరూంలకు సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలు పంపుతుంటుంది.

బెజవాడ గోడౌన్‌లో యూపీ దొంగల బీభత్సం
సీసీ ఫుటేజీల్లో ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు
రెండు రోజుల క్రితం ఘటన
విజయవాడ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ దొంగలు బెజవాడలో బీభత్సం సృష్టించారు. ఎలకా్ట్రనిక్ పరికరాల గోడౌన్‌లోకి చొరబడి ఐఫోన్లు, ట్యాబ్‌లు, యూఎ్‌సబీ పరికరాలను దొంగిలించారు. అమెరికాకు చెందిన ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ దేశంలో సెల్‌ఫోన్ల షోరూంలకు సెల్‌ఫోన్లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్ పరికరాలు సరఫరా చేస్తోంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఉన్న గోడౌన్ నుంచి విజయవాడ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఉన్న షోరూంలకు సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలు పంపుతుంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో వచ్చిన ఆరుగురు ఆగంతకులు కట్టర్‌తో గోడౌన్ షట్టర్‌ను కత్తిరించి గోడౌన్ లోపలకు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా, వాటిని ఆకాశంవైపుకు తిప్పేశారు. ఆ తర్వాత అట్టపెట్టెల్లో ఉన్న యాపిల్ కంపెనీకి చెందిన 271 యాపిల్ ప్రో, మ్యాక్స్ ఫోన్లు, రెండు ఐప్యాడ్స్, 75 ఇయర్ పాడ్స్, ఒక మౌస్, ఒక అడాప్టర్, యూఎ్‌సబీ కేబుల్, 12 యాక్ససరీస్, పది లెనోవో ట్యాబ్‌లును దొంగిలించారు. దీనిపై గోడౌన్ ఇన్‌చార్జి ఫరూక్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రైమ్ డీసీపీ టి.తిరుమలేశ్వరరెడ్డి, డీసీపీ గౌతమీ షాలి, ఏడీసీపీ ఎం.రాజారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను బట్టి ఆ దొంగలు యూపీ లేదా బిహార్‌కు చెందినవారై ఉంటారని అంచనాకు వచ్చారు. చోరీ సొత్తు విలువ రూ.2.51 కోట్లు ఉంటుందని పటమట ఇన్‌స్పెక్టర్ వి.పవన్ కిశోర్ తెలిపారు.