Nizamabad: ఇద్దరు యువకుల దారుణ హత్య
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:39 AM
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మం డలం ధర్మారంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఘటన
నిజామాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మం డలం ధర్మారంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కేంద్రానికి చెందిన జిలకర ప్రసాద్ (35)కు మాక్లూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఓ మహిళతో పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. రెండు రోజుల క్రితం ఆ మహిళ ఇంటి పక్కన ఉండే మహారాజ్ కుటుంబ సభ్యులతో గొడవ జరగగా ప్రసాద్ వారిని చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చిన జిలకర ప్రసాద్, ఆకాశ్ (27)ను మహారాజ్ కుటుంబ సభ్యులు.. చెట్టుకు కట్టేసి కళ్లలో కారంకొట్టి రాడ్లు, గొడ్డలితో దాడి చేశారు. ప్రసాద్ ఘటన స్థలంలోనే మృతి చెందగా.. ఆకాశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ప్రసాద్‌కు వివాహమై.. విడాకులు కూడా అయినట్లు సమాచారం. ఆకాశ్ అవివాహితుడు. తోడుగా రావాలని ప్రసాద్ పిలవడంతో వెళ్లిన ఆకాశ్ హత్యకు గురికావడం అతడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రసాద్‌పై నిజామాబాద్‌లో పదికి పైగా గంజాయి, దొంగతనం కేసులున్నాయి. పోలీసుల తుపాకిని ఎత్తుకెళ్లిన కేసులో కూడా ప్రసాద్ నిందితుడు. కాగా, మహారాజ్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.