Domestic Violence: భర్తను చంపిన ఇద్దరు భార్యలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:52 AM
మద్యానికి బానిసై చిత్రహింసలు పెడుతున్న భర్తపై అతని ఇద్దరు భార్యలు ఎదురుతిరిగారు.
తమపై ఎత్తిన గొడ్డలితోనే ప్రతి దాడి
జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో ఘటన
ఆ ఇద్దరు భార్యలతో పాటు మరో ఇద్దరి అరెస్టు
రెండు నెలల క్రితం డబ్బుల కోసం మొదటి భార్య తల్లిని చంపి పరారీలో ఉన్న మృతుడు
లింగాలఘణపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై చిత్రహింసలు పెడుతున్న భర్తపై అతని ఇద్దరు భార్యలు ఎదురుతిరిగారు. తమపై దాడి చేసేందుకు భర్త ఎత్తిన గొడ్డలితోనే ప్రతిదాడి చేసి అతడిని హతమార్చారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం ఏనెబావి శివారు పిట్టలోనిగూడెంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కాలియ కనకయ్య (30) హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడెంకు చెందిన కాలియ కనకయ్య (30)కు చొక్కమ్మ, మరో బాలిక(16) ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరు తోటలను గుత్తకు తీసుకుని కూలీ పనిచేస్తూ సంచార జీవితాన్ని గడుపుతుంటారు. మద్యానికి బానిసైన కనకయ్య.. మే 18న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలోని ఓ మామిడితోటలో కూలీగా పని చేస్తున్న సమయంలో డబ్బు కోసం పెద్ద భార్య తల్లి గుగులోత్ జున్నుబాయ్‌ను హత్య చేశాడు. నాటి నుంచి పరారీలో ఉన్న కనకయ్య.. మంగళవారం తెల్లవారుజామున పిట్టలోనిగూడెంలోని భార్యల వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కనకయ్య.. చంపేస్తానంటూ ఇద్దరు భార్యలపై గొడ్డలి ఎత్తాడు. ఎదురుతిరిగిన భార్యలు ఆ గొడ్డలి లాక్కోని కనకయ్యపై దాడి చేయగా అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులు చొక్కమ్మ, గౌరమ్మతోపాటు కనకయ్యకు వరసకు బావమరుదులైన జనార్దన్, శ్రీనివా్‌సను అరెస్టు చేశారు. కాగా, మద్యం మత్తులో కనకయ్య మానవ మృగంలా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.