Share News

Municipalities Act 2025: కొత్త మునిసిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:40 AM

సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌ పురపాలికలో రెండు గ్రామాలను విలీనం చేస్తూ దాని అధికార పరిధిని విస్తరించనున్నారు. అలాగే ఇంద్రేశం, జిన్నారం కొత్త మునిసిపాలిటీలుగా మారనున్నాయి.

Municipalities Act 2025: కొత్త మునిసిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం

  • ఇస్నాపూర్‌లోకి రెండు పంచాయతీల విలీనం

  • బిల్లుకు ఆమోదం తెలిపిన సభ

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌ పురపాలికలో రెండు గ్రామాలను విలీనం చేస్తూ దాని అధికార పరిధిని విస్తరించనున్నారు. అలాగే ఇంద్రేశం, జిన్నారం కొత్త మునిసిపాలిటీలుగా మారనున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన మునిసిపాలిటీల చట్టం-2025కు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను సీఎం రేవంత్‌ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రె్‌స్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మునిసిపాలిటీలకు నిధులివ్వలేదని, కనీసం ఫాగింగ్‌కూ నిధులివ్వడంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.


ఎల్‌ఆర్‌ఎ్‌సల కోసం వసూలు చేసిన ఫీజులు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి అందాల్సిన నిధులనూ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా మునిసిపాలిటీలకు బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పనులు చేసుకునే వారికోసం ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ విన్నవించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో మునిసిపాలిటీలకు 22 రూపాయలు కూడా ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ అన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 04:40 AM