Turkayanjal Municipality: ప్లాస్టిక్ వ్యర్థాలతో పడవ తయారీ..!
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:21 AM
ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బంది పడవను తయారు చేసి ఆశ్చర్యపరిచారు.
తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బందిపై ప్రశంసలు
హయత్‌నగర్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బంది పడవను తయారు చేసి ఆశ్చర్యపరిచారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, గాలి నింపిన నాలుగు ట్యూబ్‌లు, వెదురు కర్రలను ఉపయోగించి ఈ పర్యావరణహిత పడవను వారి సృజనాత్మకతకు పదును పెట్టి తయారు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్, పర్యావరణ ఇంజనీర్ సురేష్, వార్డు అధికారి బాల్‌రాజ్ తదితరుల బృందం మూడు రోజుల్లో దీనిని రూపొందించింది. ప్రస్తుతం తుర్కయాంజల్ మాసబ్ చెరువులో వినాయకుల నిమజ్జనం కోసం ఈ బోటును వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్ కె. అమరేందర్‌రెడ్డి ఈ బోటుపైన మాసబ్ చెరువులో విహరించారు. బోటును తయారు చేసిన సిబ్బందిని అభినందించారు.