Share News

Tummala: కేంద్రంపై కలిసి కట్టుగా ఒత్తిడి తెస్తాం

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:36 AM

దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి పామాయిల్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: కేంద్రంపై కలిసి కట్టుగా ఒత్తిడి తెస్తాం

  • పామాయిల్‌ దిగుమతి సుంకం పెంచాల్సిందే: తుమ్మల

హైదరాబాద్‌,అశ్వాపురం, జులై 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి పామాయిల్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు మేలు చేసే విధంగా కేంద్ర విధాన మార్పులు ఉండాలని అన్నారు. సోమవారం సాగుదారుల సమస్యలపై నలుగురు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఆయన సంప్రదింపులు నిర్వహించారు.పామాయిల్‌ దిగుమతులపై ప్రస్తుత కస్టమ్స్‌ డ్యూటీని పెంచాలన్న అంశంపై ఈ చర్చలు జరిగాయి. కాగా, దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు తుమ్మల వ్యక్తిగతంగా లేఖలు రాశారు.


ఆయిల్‌ పామ్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచాలన్న డిమాండ్‌తో కేంద్రాన్ని కలవాలని, రైతుల పక్షాన గళం వినిపించాలని కోరారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమై తమ డిమాండ్‌ను వినిపించాలని కోరారు. కాగా, సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు వచ్చే రబీ సీజన్‌నాటికి నీరందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తుమ్మల తెలిపారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారెళ్లపాడు పూర్తయితే పినపాక నియోజకవర్గంలో కొత్తగా 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పథకం పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబరు నాటికి పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

Updated Date - Jul 08 , 2025 | 03:36 AM