Share News

Tummala Nageswara Rao : మరిన్ని గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం

ABN , Publish Date - May 21 , 2025 | 07:20 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్‌ఐడీఎఫ్‌, నాబార్డ్‌ నిధులను ఉపయోగించి గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతను రైతుబజార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు, అలాగే యూరియా సరఫరాను వెంటనే పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాశారు.

 Tummala Nageswara Rao : మరిన్ని గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం

  • ఆర్‌ఐడీఎఫ్‌, నాబార్డ్‌ నిధులను

  • వినియోగించండి: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌), జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) నిధులను ఉపయోగించి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచుతూ, మరిన్ని నిర్మించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్‌, ఆయిల్‌ ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం మార్కెట్లు, రైతు బజార్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల జొన్నలను సేకరించామని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) సీఈఓల బదిలీలకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అలాగే 311 సహకార సంఘాలను ఉన్నతీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లకు సంబంధించిన అక్రమాలపై విచారణ పూర్తి చేసి, సర్‌చార్జి ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.6.38 కోట్ల రికవరీ పూర్తయిందని, ఇంకా రూ. 19 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, అలాగే 74 సంఘాల సర్‌చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పించారు. పదేళ్లుగా అపెక్స్‌ సహకార సంఘాల ఆడిట్‌ ఎందుకు జరగలేదని ఆడిట్‌ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాల వారీగా సిద్థం చేసామని, రానున్న 10, 15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ సంచాలకులు తెలిపారు.


కేటాయింపుల ప్రకారం యూరియా ఇవ్వాలి.. కేంద్రానికి తుమ్మల లేఖ

ఏప్రిల్‌, మే నెలలకు రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను పూర్తి మొత్తంలో సరఫరా చేయాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల మంగళవారం లేఖ రాశారు. ఈ వానాకాలానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి కేటాయించింది. ఇందులో ఏప్రిల్‌ నెల కోటా కింద 1.70 లక్షల మెట్రిక్‌ టన్నులు, మే నెల కోటాలో 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయింపులు చేసింది. ఏప్రిల్‌లో కేవలం 1.20 లక్షల మెట్రిక్‌ టన్నులు, మే నెలలో ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేటాయింపుల మేరకు వెంటనే యూరియాను పంపించాలని లేఖలో కోరారు.

Updated Date - May 21 , 2025 | 07:20 AM