యాతాలకుంట టన్నెల్ ఆగస్టు చివరికల్లా పూర్తవ్వాలి..
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:37 AM
సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా సత్తుపల్లి ట్రంక్‌లో నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ పనులను ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
సత్తుపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా సత్తుపల్లి ట్రంక్‌లో నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ పనులను ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటలో టన్నెల్ పనులను ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేశ్ వీ పాటిల్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు ఇంజనీరింగ్, అటవీ, రెవెన్యూ, ఉద్యానవన, విద్యుత్తు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రికి వివరించారు. మరో 700 మీటర్ల టన్నెల్ పనులు పూర్తి కావాల్సి ఉందని తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన చెప్పారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పరిహారం డబ్బులు బ్యాంకుల్లో వేయాలని సూచించారు. విద్యుత్ లైన్లను మార్చేందుకు అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు చివరికల్లా టన్నెల్ పూర్తి చేసి గోదావరి నీటిని విడుదల చేసి స్థానికంగా ఉన్న వాగులు, చెరువులకు మళ్లించాలని ఆదేశించారు. రైతు భరోసా నిధులు ఈ నెలాఖరుకల్లా రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ చేస్తామని మంత్రి ప్రకటించారు. ధాన్యం బోనస్ డబ్బులు కూడా రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం జెడ్పీ సీఈవో దీక్షారైనా, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నా రాజకీయ దిశానిర్దేశకుడు గాదె సత్యం..
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దిశానిర్దేశం చేసిన వ్యక్తి గాదె సత్యం అని మంత్రి తుమ్మల చెప్పారు. ఆయన సూచనలకు అనుగుణంగానే తన రాజకీయ నడవడిక సాగిందన్నారు. గాదె సత్యనారాయణ దశ దినకర్మ సందర్భంగా సత్తుపల్లిలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనకు సలహాలిస్తూ ఎప్పుడూ వెన్నంటి ఉండే గాదె సత్యం మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని భావోద్వేగానికి గురయ్యారు. సత్యం మృతి తనకు తీరని లోటని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.