Group 1 Results Cancellation: గ్రూప్-1పై అప్పీలుకు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:26 AM
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిష..
హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం
అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు.. సుప్రీంకోర్టుకూ వెళ్లేందుకూ సన్నద్ధం
గుదిబండలా మారిన గ్రూప్-1.. స్వరాష్ట్రంలో ఒక్క నియామకమూ లేదు
పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం
గ్రూప్-1పై కేసులతో గ్రూప్-2, 3 నియామకాలూ జాప్యం
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి.. అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో ఈ తీర్పు రావడంతో.. దీనిపై కమిషన్ బుధవారం న్యాయనిపుణులతో చర్చించింది. అనంతరం హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 పరీక్ష ఫలితాల రద్దుతో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల నియామకాలపైనా ప్రభావం పడనుంది. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తనుంది. అంతేకాకుండా.. టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సైతం జాప్యం కానుంది.
నిరుద్యోగుల్లో నిరాశ..!
హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించినా.. గ్రూప్-1 విషయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఉదాహరణకు.. హనుమకొండకు చెందిన నిశాంత్ అత్యున్నత ర్యాంకుతో ఉస్మానియా క్యాంప్‌సలో ప్రవేశం పొంది పీజీ పూర్తిచేశాడు. 2022లో తొలిసారి ప్రకటించిన గ్రూప్-1లో ప్రాథమిక దశలో అర్హత సాధించాడు. పేపర్ లీకేజీతో ఆ పరీక్షలను రద్దు చేశారు. మరుసటి ఏడాది 2023లో మళ్లీ నిర్వహించిన పరీక్షలోనూ అర్హత సాధించాడు. అయితే బయోమెట్రిక్ లేదన్న కారణంతో ఆ పరీక్షలను హైకోర్టు రద్దు చేసింది. అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక గతేడాది మళ్లీ మూడోసారి పరీక్ష రాసి తుది జాబితాలో చోటు సాధించాడు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. అన్నీ సక్రమంగా జరిగితే అతనికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుంది. అయితే మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంపై దాఖలైన ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం నియామక పత్రాలను ఆపేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అతడి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. గత కొన్నేళ్లుగా గ్రూప్-1 కోసం రాత్రింబవళ్లు కష్టపడి చివరివరకు వచ్చిన వందలాది మందిదీ ఇదే పరిస్థితి.
11 ఏళ్లలో ఒక్కటీ లేదు..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూల కారణాల్లో కీలకమైనది ఉద్యోగాలు. దీనికోసం సాగిన ఉద్యమంలో అనేక మంది యువత తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించుకున్నా.. గడచిన 11 ఏళ్లలో గ్రూప్-1 నియామకాలు ఒక్కసారి కూడా జరగకపోవడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషనే చివరిది. ఆ తర్వాత స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. 2022లో తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ వేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేయగా.. 2.86 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 25,050 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తుది పరీక్ష పూర్తికాకముందే పేపర్ లీకేజీ కుంభకోణం బయటపడింది. పరీక్ష రద్దయింది. అనంతరం 2023లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్-11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది హాజరయ్యారు. కానీ, బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణాలతో పరీక్షలను హైకోర్టు రద్దుచేసింది. రెండుసార్లు పరీక్షలు రద్దవడంతో 2023 ఆఖర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. టీఎ్‌సపీఎస్సీని ప్రక్షాళన చేశారు. కొత్తగా 2024లో మూడోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందున్న 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 3.02 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 31,382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో నుంచి తుది జాబితా ప్రకటించి ఫలితాలు విడుదల చేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. నియామక పత్రాలు ఇవ్వాల్సిన తరుణంలో విషయం మళ్లీ కోర్టుకు వెళ్లింది. పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాలను రద్దు చేసింది.