Outer Ring Road Accident: ఓఆర్‌ఆర్‌పై పనిచేస్తున్న కూలీలను ఢీకొట్టిన ట్రాలీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:01 AM
కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌పై పూల మొక్కల పెంపకంలో పనిచేస్తున్న ముగ్గురు
ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
అందరూ ఒడిసాకు చెందిన వారే
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే దారుణం
పోలీసుల అదుపులో ట్రాలీ డ్రైవర్
కీసర రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌పై పూల మొక్కల పెంపకంలో పనిచేస్తున్న ముగ్గురు దినసరి కూలీలపైకి ఓ ట్రాలీ వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్‌మోహన్ (24), జైరామ్ (32)అనే ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ గణేష్.. గాజువాక నుంచి సెల్‌ఫోన్ టవర్ సామగ్రితో శామీర్‌పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 11 మంది కార్మికులు.. అదే సమయంలో మధ్యాహ్న భోజనాలు ముగించుకుని తిరిగి పనిలోకి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి వచ్చిన వాహనం అదుపు తప్పి ముగ్గురు కార్మికులను బలంగా ఢీకొట్టింది. కళ్లెదుటే తమ వారు మృత్యువాత పడటంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో వాహనం నడపటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.