Share News

Road Accident: పుష్కారానికి వెళ్తూ.. తిరిగి రాని లోకాలకు

ABN , Publish Date - May 23 , 2025 | 05:48 AM

సరస్వతీ పుష్కరాలకు ఆటోలో బయలుదేరిన కుటుంబానికి మార్గమధ్యలో ఎదురొచ్చిన ఓ కారు మృత్యు శకటమైంది. పుష్కర స్నానం ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారి కారు..

Road Accident: పుష్కారానికి వెళ్తూ.. తిరిగి రాని లోకాలకు

  • ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

  • ఇద్దరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు

  • కాటారం క్రాస్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కాటారం, మే 22(ఆంధ్రజ్యోతి): సరస్వతీ పుష్కరాలకు ఆటోలో బయలుదేరిన కుటుంబానికి మార్గమధ్యలో ఎదురొచ్చిన ఓ కారు మృత్యు శకటమైంది. పుష్కర స్నానం ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారి కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని 353(సీ)జాతీయ రహదారిపై కమలాపూర్‌ క్రాస్‌ సమీపంలో గురువారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పాల రజిత(28), గుంటుక విష్ణు(21) మరణించారు. రెండు వాహనాల్లోని 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాటారం ఎస్సై మ్యాక అభినవ్‌ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కొత్త చంద్రకాంత్‌ కారులో నలుగురిని కాళేశ్వరం పుష్కరాలకు తీసుకొచ్చి పుణ్య స్నానం అనంతరం తిరిగి బయలుదేరారు.


మరోపక్క, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వరికోల్‌పల్లి, కుమ్మరిపల్లికి చెందిన గుంటుక నర్సింహా అలియాస్‌ స్వామి, అతడి భార్య సంధ్య, కుమారుడు విష్ణు, సంధ్య సోదరీమణులు శ్రీరాముల శోభ, రజిత వారి కుటుంబసభ్యులు అజిత్‌పాషాకు చెందిన ఆటోలో పుష్కరాలకు కాళేశ్వరం బయలుదేరారు. అయితే, కమలాపూర్‌ క్రాస్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన చంద్రకాంత్‌ కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ధ్వంసమై రోడ్డు కిందకు దిగి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారు ఎగిరిపడి ఓ వైపు బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న రజిత, విష్ణు మరణించారు. ఆటోలో ఉన్న మిగిలిన వారు, కారులో ఉన్న వారు కూడా తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

Updated Date - May 23 , 2025 | 05:49 AM