Share News

ఆర్టీసీ బస్సు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:12 AM

చిట్యాలరూరల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతిచెందాడు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

చిట్యాలరూరల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. ఈఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. చిట్యాల ఎస్‌ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని బొంగోనిచెర్వు గ్రామానికి చెందిన ఎంపల్ల వెంకట్‌రెడ్డ్డి(54) గుండ్రాంపల్లి శివారులోని దొడ్ల డెయిరీ కంపెనీలో 10 ఏళ్లుగా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామం బొంగోనిచెర్వు కాగా ఆయన కుటుంబంతో వెలిమినేడులో నివాసముంటున్నా డు. వెంకట్‌రెడ్డి డెయిరీకి చెందిన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించేందుకు వెంకట్‌రెడ్డి అదే ట్రాక్టర్‌ను నడుపుకుంటూ చిట్యాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో వెలిమినేడు శివారులో వెనుక నుంచి వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తాపడగా ట్రాక్టర్‌ను నడుపుతున్న వెంకట్‌రెడ్డి తల కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, వివాహమైన కూతురు ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్షకై నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు అనిల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దొడ్ల డెయిరీ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా

దొడ్ల డెయిరీ పనిమీద ట్రాక్టర్‌పై వెళ్తున్న వెంకట్‌రెడ్డి మృతిచెందగా విధుల్లో ఉన్న సమయంలో మృతిచెందటంతో ఆ బాధ్యత డెయిరీ కంపెనీదేనంటూ గుండ్రాంపల్లి శివారులో గల డెయిరీ వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. వారికి తోడుగా బొంగోనిచెర్వు, వెలిమినేడుకు చెందిన గ్రామస్థులు మద్దతు తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న చిట్యాల పోలీసులు చేరుకుని యజమాన్యంతో చర్చించి న్యాయం జరిగేలా చేస్తామని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

Updated Date - Jan 18 , 2025 | 01:12 AM