Mahesh Kumar Goud: కవిత.. కేసీఆర్ విడిచిన బాణం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:08 AM
కవిత.. కేసీఆర్ విడిచిన బాణమేనని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ఆడుతున్న కొత్త నాటకమిదన్నారు
ప్రజల్ని మభ్యపెట్టేందుకే కొత్త నాటకం
కేటీఆర్‌పై ఎక్కుపెట్టిన బాణం..హరీశ్ వైపునకు ఎందుకు మళ్లింది? :మహేశ్ గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కవిత.. కేసీఆర్ విడిచిన బాణమేనని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ఆడుతున్న కొత్త నాటకమిదన్నారు. కవిత అమెరికా వెళ్లి తిరిగి రాగానే తన స్టాండ్‌ను ఎందుకు మార్చారని.. అంతకుముందు కేటీఆర్‌పైకి ఎక్కుపెట్టిన బాణం.. హరీశ్‌రావుపైకి ఎందుకు మళ్లిందని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేయడం శుభ పరిణామమని, అయితే ఆమె ఐదేళ్ల ముందే ఈ రాజీనామా చేసుంటే ప్రజలు అంగీకరించి ఉండేవారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్ణయాలు చేసేవారిలో కవిత కూడా ఒకరని, ఆమె భాగస్వామ్యం లేకుండానే అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. వాటాల పంపకాల్లో తేడాల వల్లే కవిత కొట్లాడుతోందని ఆరోపించారు. హరీశ్‌రావు, సంతో్‌షరావుల వెనక ఉండాల్సిన ఖర్మ తమకు లేదని, తాము ప్రజల వెంట ఉంటామని పేర్కొన్నారు.