రూ.15 కోట్లతో చాకలిగట్టుకు పర్యాటక సొబగు!
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:28 AM
నాగార్జునసాగర్ మధ్యలో ఉన్న నదీ ద్వీపం చాకలిగట్టును రూ.15కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ ఉన్నతాధికారుల బృందం ఇటీవలే చాకలిగట్టును సందర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసింది.

నాగార్జున సాగర్ మధ్యలో ఉన్న నదీ ద్వీపం చాకలిగట్టు
ఇటీవలే పర్యటించిన రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలపై అధ్యయనం
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ మధ్యలో ఉన్న నదీ ద్వీపం చాకలిగట్టును రూ.15కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ ఉన్నతాధికారుల బృందం ఇటీవలే చాకలిగట్టును సందర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసింది. చాకలిగట్టు ద్వీపం.. నాగార్జున కొండకు కేవలం 3కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నాలుగు వందలకు పైగా ఎకరాల్లో ఎత్తైన వృక్షాలతో, దట్టమైన పొదలతో విస్తరించింది. ఈ నేపథ్యంలో నాగార్జున కొండ నుంచి చాకలిగట్టుకు రోప్‌వే, బోటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని, ద్వీపం అంతా కొండ ప్రాంతమైనందున ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. మధ్య, కొత్త రాతి యుగాల్లో చాకలిగట్టు ప్రాంతం ఆదిమానవుల ఆవాసంగా ఉందని పురావస్తు నిపుణులు గుర్తించారు. దీంతో, పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా గతంలో ఈ ప్రాంతంలో లభ్యమైన పురాతన వస్తు సామగ్రి, బౌద్ధ శిల్పాలు, నాణేలతో ఇక్కడ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. జింకలు, ఇతర జంతువులతో మినీ జూ పార్కును కూడా ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. కుటుంబాలతో వచ్చే పర్యాటకుల విడిది కోసం కాటేజీలను నిర్మించనున్నారు. చాకలిగట్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే.. బుద్ధవనం, నాగార్జున కొండల, చాకలిగట్టులను కలిపి పర్యావరణ పర్యాటక సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టుకు కొనసాగించేందుకు కేంద్రం కూడా నిధులు మంజూరు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.