Tourism Department Transfers: మిస్ వరల్డ్ వేళ పర్యాటక శాఖలో బదిలీలు
ABN , Publish Date - May 07 , 2025 | 07:33 AM
'మిస్ వరల్డ్-2025' పోటీకి ముందుగా పర్యాటకాభివృద్ధి సంస్థలో అధికారుల బదిలీలు జరిగాయి. స్పాన్సర్‌లతో నిర్లక్ష్యం చూపిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం
స్పాన్సర్ విషయంలో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై చర్యలు
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు మరో మూడ్రోజుల్లో ప్రారంభంకానుండగా.. పర్యాటకాభివృద్ధి సంస్థలో అకస్మాత్ బదిలీలు జరిగాయి..! మిస్ వరల్డ్ ఆతిథ్యం నేపథ్యంలో ఈ సంస్థలో ఇద్దరు అధికారుల పనితీరుపై ఏర్పడ్డ గందరగోళం కాస్తా.. చినికిచినికి గాలివానగా మారి బదిలీలకు కారణమైనట్లు చర్చ జరుగుతోంది. పోటీల నిర్వహణకు అవసరమైన వసతులు, అతిథులకు సౌకర్యాలను సమకూర్చే బాధ్యతను సర్కారు ఈ సంస్థకు అప్పగించింది. అయితే.. కొందరు స్పాన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారి సహకారాన్ని తీసుకోవడంలో ఈ అధికారులిద్దరూ ఉదాసీనంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న పోటీల విషయంలో వీరిద్దరూ ఆధిపత్య పోరు, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు గుర్తించింది. ఇప్పటికే కంచ గచ్చిబౌలి స్థలాల విషయంలో ఎక్స్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేసిన స్మితాసబర్వాల్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే..! ఇప్పుడు ఇద్దరు కీలక అధికారుల్లో ఒకరిని సొంత శాఖకు పంపుతూ 1నే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరొకరిని ఈ పోటీల బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. అయితే.. వీరిద్దరూ మంగళవారం యథావిధిగా విధులకు హాజరవ్వడం గమనార్హం.