Share News

Land Area of Universities: టాప్‌-10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల్లోపే

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:36 AM

ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తక్కువ విస్తీర్ణంతో ఉన్నా, వాటిలో విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటుంది. ఈ వర్సిటీలకు కొన్ని వందల ఎకరాల భూమి మాత్రమే కేటాయించబడినప్పటికీ, వాటి విద్యా నాణ్యతలో ఎలాంటి సముదాయాన్ని కలగలిపినట్లు లేదు. ప్రపంచంలో టాప్ 10 వర్సిటీలకు 500 ఎకరాలపైనే భూమి ఉండడం విశేషం

Land Area of Universities: టాప్‌-10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల్లోపే

  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకూ తక్కువ భూములే..

  • 379 ఎకరాల్లో సింగపూర్‌ నేషనల్‌ వర్సిటీ

  • అమెరికాలోని ఎంఐటీకి 168 ఎకరాలు

  • 703 ఎకరాల్లో వాషింగ్టన్‌ యూనివర్సిటీ

  • ఆక్స్‌ఫర్డ్‌ విస్తీర్ణం 1327 ఎకరాలు

  • నోబెల్‌ గ్రహీతల్ని, వ్యాపార దిగ్గజాలను

  • అందించిన విద్యా సంస్థలివి..

  • 16వ శతాబ్దంలో ఏర్పాటైన వర్సిటీలకు కూడా భారీగా భూముల్లేవ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు.. పలువురు ప్రముఖులు చదివిన వర్సిటీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? పలు ప్రముఖ వర్సిటీలకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? వాటిలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, చైనా తదితర దేశాల్లో ప్రసిద్ధి చెందిన వర్సిటీలకు ఎన్ని ఎకరాలు కేటాయించారు? అన్న విషయం కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన అంశమే! హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం నేపథ్యంలో దేశంలోని సెంట్రల్‌ వర్సిటీలకు ఎన్ని భూములు ఉన్నాయన్న వివరాలతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ యూనివర్సిటీలకు ఎంత స్థలం ఉందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10 యూనివర్సిటీల (క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ -2025)ను పరిశీలిస్తే వాటిలో దాదాపు సగం సంస్థలు 500 ఎకరాల్లోపే ఉన్నాయి! పైగా ఆయా వర్సిటీలన్నీ 16, 17, 18వ శతాబ్దాల్లోనే స్థాపించడం గమనార్హం. అప్పటికి ఆయా దేశాల్లో కావాల్సినంత భూమి అందుబాటులో ఉన్నా.. విశ్వవిద్యాలయాలు మాత్రం అవసరమైనంత మేరకు పరిమిత స్థలాల్లోనే ఉన్నాయి. పైగా ఇవేమీ చిన్నాచితకా వర్సిటీ లు కాదు. నోబెల్‌ పురస్కార గ్రహీతలను, ప్రపంచాన్ని ఏలుతున్న వ్యాపార దిగ్గజాలను, సినీ, క్రీడా ప్రముఖులను తీర్చిదిద్దినవి. న్యూటన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, బిల్‌గేట్స్‌, బ్రూస్‌లీలాంటి ప్రముఖులు చదివినవి. ప్రపంచంలోని టాప్‌-20 యూనివర్సిటీలే కాదు.. అమెరికాలోని ఐవీవై లీగ్‌ యూనివర్సిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవే.


ఈ వర్సిటీల్లో సీటు సాధించడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఐవీవై లీగ్‌ విశ్వవిద్యాలయాలు అమెరికాలో 8 ఉండగా.. అందులో 5 వర్సిటీలు 500 ఎకరాల్లోపు విస్తీర్ణంలోనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ కేవలం 370 ఎకరాల్లో ఉంది. టాప్‌-5లో ఉన్న మరో వర్సిటీ ఈటీహెచ్‌ జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌) 79 ఎకరాల్లో ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ వర్సిటీల్లో ఒకటిగా ఉన్న ది యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ 94 ఎకరాల్లో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న సింగువా యూనివర్సిటీని 980 ఎకరాల్లో స్థాపించారు.

విస్తీర్ణం చిన్నదైనా.. విద్యార్థులు 20 వేలపైనే!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ యూనివర్సిటీలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయి కాబట్టి.. వాటిల్లో ఉండే విద్యార్థుల సంఖ్య కూడా అంతేనా? అంటే.. పప్పులో కాలేసినట్లే. ఈ వర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. బిల్‌గేట్స్‌, బ్రూస్‌లీ వంటివారు చదివిన యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ సియాటెల్‌ క్యాంపస్‌ 703 ఎకరాల్లో ఉంది. కానీ, ఇందులో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు 40,000! ఐవీవై లీగ్‌ వర్సిటీల్లో ఒకటిగా ఉన్న కార్నెల్‌ యూనివర్సిటీ 745 ఎకరాల్లో ఉంది. న్యూయార్క్‌లో ఉన్న ఈ యూనివర్సిటీలో చదివేది 26,793 మంది. అమెరికాలోని పశ్చిమ ఫిలడెల్ఫియాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా 299 ఎకరాల్లో ఉండగా.. ఇక్కడ విద్యార్థులు మాత్రం 28,711 మంది ఉన్నారు. సింగపూర్‌లోని టాప్‌ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉన్న సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ 370 ఎకరాల్లో ఉంది. ఇక్కడ విద్యార్థుల సంఖ్య సుమారు 40,000. ఇక టె క్నాలజీ రంగాల్లో ప్రసిద్ధి చెందిన అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) కేవలం 168 ఎకరాల్లో ఉండగా.. ఇందులో చదువుతున్న విద్యార్థులు 11,868 మంది. యూనివర్సిటీ ఆప్‌ కెనడా వాంకోవర్‌ క్యాంపస్‌ 993 ఎకరాల్లో ఉండగా.. అందులో ఏకంగా 71,201 మంది విద్యార్థులు చదువుతున్నారు.


అన్ని విభాగాలూ ఉంటాయ్‌..

విస్తీర్ణంలో తక్కువ ఉన్నప్పటికీ ఈ యూనివర్సిటీల్లో అన్ని విభాగాలూ ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌ ఇలా అన్ని విభాగాలకు చెందిన కోర్సులూ ఉంటాయి. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో సుమారు 473 కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐటీలో 58 మేజర్‌ కోర్సులు, 56 మైనర్‌ కోర్సులను అందుబాటులో ఉంచారు. మన హెచ్‌సీయూలో ఉన్న కోర్సులు 119. ఇక 32 ఎకరాల్లో ఉన్న ఐవీవై లీగ్‌ కొలంబియా వర్సిటీ 100కు పైగా డిగ్రీ కోర్సులను అందిస్తోంది.

Updated Date - Apr 11 , 2025 | 04:37 AM