Share News

Tirupati Appointed: కొత్త దళపతి.. తిరుపతి!

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:24 AM

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి (58) అలియాస్‌ దేవ్‌జీ నియమితులైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ..

Tirupati Appointed: కొత్త దళపతి.. తిరుపతి!

  • మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం!

  • పోలీసు వర్గాల వెల్లడి.. అధికారికంగా ప్రకటించని పార్టీ

  • క్యాడర్‌ రిక్రూట్‌మెంట్లు, ఆయుధ నిపుణుడిగా తిరుపతికి పేరు

  • చంద్రబాబుపై దాడిలో ప్రమేయం

  • 74 మంది జవాన్లను బలిగొన్న దంతేవాడ దాడికి సారథ్యం

  • దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా మాద్వి హిడ్మా!

హైదరాబాద్‌, కోరుట్ల, కోరుట్ల రూరల్‌, చర్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి (58) అలియాస్‌ దేవ్‌జీ నియమితులైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించనప్పటికి, పోలీసు నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యద ర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఈ ఏడాది మే 21న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. నక్సలైట్‌ ఉద్యమం చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవటం ఇదే ప్రథమం. తదుపరి ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో నెంబర్‌ టూ స్థానంలో ఉన్న తిరుపతి పేరు బలంగా విన్పించింది. ఈ నేపథ్యంలోనే, ఆయన పార్టీ అధిపతిగా నియమితులయ్యారని, ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి ప్రస్తుతం సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌గా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2003లో తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిరుపతి పాత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2010లో దంతెవాడ సమీపంలో 74 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ జవాన్లను పొట్టనపెట్టుకున్న నక్సల్స్‌ దాడికి తిరుపతి సారథ్యం వహించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుపతిపై ఎన్‌ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు, దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా ఛత్తీ్‌సగఢ్‌లోని సుకుమా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మాద్వి హిడ్మా అలియాస్‌ సంతో్‌షని మావోయిస్టు పార్టీ నియమించిటనట్లు తెలుస్తోంది. గతంలో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ అనేది లేనప్పటికీ పార్టీకి కొత్త రూపం తీసుకొచ్చేందుకు ఈ పోస్టుని పార్టీ కేటాయించినట్లు సమాచారం. బస్తర్‌ అడవుల్లోని దండకారణ్యంలో మాద్వి హిడ్మాకు మంచి పట్టుంది. దాడులు చేసి తప్పించుకోవటంలో ఆరితేరిన వ్యక్తిగా చెబుతుంటారు. హిడ్మా చేసిన పలు దాడుల్లో దాదాపు 200 మందికి పైగా పోలీసులు, జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. అడవుల్లోని గిరిజనులతో మాద్వి హిడ్మా మమేకమై ఉంటాడని, పేదలకు సాయం చేస్తాడని.. అందువల్లే ఇంతకాలం పోలీసులకు దొరకలేదని ప్రచారం.


కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి..

తిరుపతి కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందినవారు. ఆయన తల్లిదండ్రులు గంగుబాయి, వెంకట నర్సయ్య. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా తిరుపతి పెద్ద కుమారుడు. పాఠశాల, ఇంటర్‌ విద్యను తిరుపతి కోరుట్లలో పూర్తి చేశారు. 1978 సెప్టెంబరు 9న జగిత్యాలలో కొండపల్లి సీతారామయ్య వర్గం ‘జగిత్యాల జైత్రయాత్ర’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ తిరుపతిని విప్లవ రాజకీయాలవైపు మళ్లించినట్లు చెబుతారు. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన రైతులు, కూలీలు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. గణపతి, కిషన్‌జీ, శీలం నరేశ్‌, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, ఓదెలు, గద్దర్‌ తదితరులు పాల్గొని ప్రజలను ఉత్తేజ పరిచారు. ఈ సభకు హాజరైన తిరుపతి అనంతరకాలంలో, 1983లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎ్‌సయూ)లో చేరారు. కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో నిర్బంధం పెరగడంతో 1984లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, వరంగల్‌, హన్మకొండ తదితర ప్రాంతాల్లో దళ నాయకుడిగా, కార్యదర్శిగా, కమిటీ సభ్యుడిగా పనిచేశారు. బీదర్‌, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఆయుధ కర్మాగార బాధ్యుడిగా ఆయన విధులు నిర్వహించినట్లు సమాచారం. ఆయుధాలు తయారు చేయడంలో తిరుపతికి ప్రావీణ్యం ఉందని చెబుతారు. పార్టీకి కార్యకర్తలను సమీకరించటం, వారికి శిక్షణ ఇవ్వటంలోనూ ఆయనది కీలకపాత్ర. మావోయిస్టు పార్టీలో తిరుపతి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనను ఆంధ్ర, తెలంగాణలో తిరుపతి అని పిలుస్తుండగా ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో దేవ్‌జీగా పిలుస్తారు. నల్లగొండకు చెందిన సృజనను తిరుపతి వివాహం చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆపరేషన్‌ కగార్‌, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో తిరుపతి పశ్చిమ బెంగాల్‌ వైపు వెళ్లి ఉంటారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

లొంగిపో! పెదనాన్నా!..

ఈ ఏడాది మే 29న తిరుపతి తమ్ముడు గంగాధర్‌ కూతురు సుమ.. ‘పెదనాన్నా! మావోయిస్టు ఉద్యమాన్ని వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపో!’ అని కోరుతూ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుపతి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సారథిగా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వెలువడటంతో కోరుట్ల తదితర ప్రాంతాల్లో స్థానికంగా చర్చనీయాంశమైంది.

తెలుగు వ్యక్తులే సారథులు

నాటి పీపుల్స్‌వార్‌ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు సాయుధ పోరాటానికి తెలుగువారే సారథ్యం వహించే పరంపర కొనసాగుతోంది. తొలుత కొండపల్లి సీతారామయ్య, తరువాత ముప్పాళ్ళ లక్ష్మణరావు, నంబాల కేశవరావు, నేడు తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ పార్టీ చీఫ్‌లుగా బాధ్యతలు చేపట్టారు. వీరందరూ తెలుగు వారే కావడం విశేషం.

Updated Date - Nov 18 , 2025 | 03:03 PM