వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:53 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఆత్మకూర్(ఎస్), ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా మండలం ఏనుబాముల గ్రామ శివారు సంతోష్‌మాత ఆలయం సమీపంలో సూర్యాపేట నుంచి నెమ్మికల్ వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి చెట్టుకు ఢీకొని ఏనుబాముల గ్రామానికి చెందిన వర్రె మల్లమ్మ(70) మృతిచెందింది. బంధువుల దశదిశ కర్మకు వర్రె మల్లమ్మ, వర్రె పార్వతమ్మ కలిసి సూర్యాపేట మండలం ఆరెగూడేనికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ సూర్యాపేట నుంచి తమ స్వగ్రామానికి వచ్చేందుకు నెమ్మికల్‌కు చెందిన మోరపాక వెంకన్న ఆటో ఎక్కారు. మరో రెండు నిమిషాల్లో ఏనుబాముల స్టేజీ వద్ద ఆటో దిగాల్సి ఉండగా ఆటో చెట్టుకు ఢీకొనడంతో వర్రె మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. వర్రె పార్వతమ్మ, డ్రైవర్ మోరపాక వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మల్లమ్మ కుమారుడు వర్రె రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. మృతిరాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కారు వెనుక నుంచి ఢీకొని...
యాదగిరిగుట్ట రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. సీఐ రమేష్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఎండీ. ఇస్లాం(27), ఇబ్రహిం సోహెల్ కలిసి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్నారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి మండలంలోని గోదుమకుంట హరిత వెంచర్ సమీపంలోకి చేరుకోగానే రేణికుంట శ్రీనివాస్ తన కారులో వరంగల్ వైపునకు అతి వేగంగా వెళ్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న ఎండీ. అస్లాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఎండీ. ఇబ్రహిం సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగా త్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అస్లాం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని పద్మానగర్ కాలనీలోని ప్రధాన రహదారిపై ఈ నెల 9న ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జెట్ల రాము(39) చికిత్సపొందుతూ సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మృతిచెందాడు. జెట్ల రాముకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. సంఘటనపై రాము బాబాయి జెట్ల దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
అడ్డగూడూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతిచెందింది. ఈ సంఘటన యాద్రాది భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చౌళ్లరామారం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న ఎండీ. జబీన్(54) అడ్డగూడూరు మండల కేంద్రంలోని స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి స్కూటీపై వస్తుండగా మార్గమద్యంలో చౌళ్లరామారం గ్రామ శివారులోకి రాగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో జబీన్ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. జబీన్ భర్త అంజద్‌ఆలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. జబీన్‌కు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.