Three Close Friends: ముగ్గురు స్నేహితులు.. వరుసగా ఆత్మహత్య
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:46 AM
ఒక యువకుడు, ఇద్దరు యువతులు. ఈ ముగ్గురూ స్నేహితులు. ఒకే ఊరు.. టెన్త్ క్లాసులో కలిసి చదువుకున్నారు! . ఈ ముగ్గురు, వరుసగా మూడు రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఒకే ఊరు.. టెన్త్‌లో కలిసి విద్యాభ్యాసం
ముగ్గురిలో ఈనెల 21న ఓ యువతి బలవన్మరణం
ఆ మర్నాడు ఒకరు.. గురువారం మరొకరి ఆత్మహత్య
హయత్‌నగర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఒక యువకుడు, ఇద్దరు యువతులు. ఈ ముగ్గురూ స్నేహితులు. ఒకే ఊరు.. టెన్త్ క్లాసులో కలిసి చదువుకున్నారు! . ఈ ముగ్గురు, వరుసగా మూడు రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హయత్‌నగర్ పరిధిలోని కోహెడలో జరిగింది. మృతులు కోహెడకు చెందిన గ్యార వైష్ణవి (18), బుడ్డ శ్రీజ (18) సతాలి రాకేశ్ (21). వైష్ణవి కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. మందులు వాడకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈనెల 21న ఇంట్ల్లో ఉరివేసుకుంది. బుధవారం నిర్వహించిన వైష్ణవి అంత్యక్రియలకు సతాలి రాకేశ్ హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రాకేశ్, సమీపంలోని ఓ షటర్‌లో నిద్రపోయాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ నిద్రలేచి చూడగా రాకేశ్ ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీజ తండ్రి నరసింహ ఆమెను నిద్రలేపాడు. తాను డ్యూటీకి వెళుతున్నాని చెప్పి బయలుదేరాడు. ఆయనకు ఉదయం 11గంటలకు ఫొనొచ్చింది. కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో.. ఇంటికొచ్చి చూసేసరికి కూతురు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. కలిసి చదువుకున్న స్నేహితులు.. ఒకరి తర్వాత మరొకరు వరుసగా మూడు రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.