Share News

ఛాయా రహస్యం.. సోమేశ్వరాలయం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:32 AM

నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్‌ ప్రాంతంలోని ఛాయాసోమేశ్వరాలయం ఎన్నో విశేషాల సమాహారం.

ఛాయా రహస్యం.. సోమేశ్వరాలయం
నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్‌లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం

అద్భుత శిల్పకళా నిలయం పానగల్‌ సోమేశ్వరాలయం

వేదఘోషతో అలరారిన ప్రాంతం

రాజసం ఉట్టిపడేలా నాటి అద్భుత కట్టడం

ఆలయాన్ని సందర్శిస్తున్న దేశ, విదేశీ పర్యాటకులు

నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్‌ ప్రాంతంలోని ఛాయాసోమేశ్వరాలయం ఎన్నో విశేషాల సమాహారం. నిరంతర ఏకా నిశ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయ విశిష్టత. సూర్యుడి గమనంలో మార్పు ఉన్నా కూడా ఆ నీడ మారదు. తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలకుండా ఉండే ఛాయను ఈ ఆలయంలో చూడవచ్చు. శివలింగంపై ఈ ఛాయ కప్పబడి ఉంటుంది. ఈ ఛాయ కారణంగా ఈ దేవాలయానికి ఛాయ సోమేశ్వరస్వామి దేవాలయంగా పేరొచ్చింది. ఈ ఆలయం 11, 12వ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)

ఛాయాసోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి శిల్ప కళా సంపదకు నిలయంగా ఉంది. క్రీస్తు శకం 11, 12వ శతాబ్ధ కాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దేవాలయాన్ని కుందూరు చోళుల కాలంలో నిర్మించారు. ఇక్కడ లభించిన ఒక శాసనం క్రీస్తుశకం 1290లో కాకతీయ ప్రభుత్వం ప్రతాపరుద్రుడి పేరు మీద ఉంది. ఆలయాన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు, కుందూరు చోళులు, కాకతీయుల కళా తృష్ణకు నిదర్శనంగా ఛాయసోమేశ్వర ఆలయం నిలిచింది. మధ్యయుగపు ఛాయలతో, శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రతీకగా నల్లరాతితో చెక్కిన శిల్ప కళాకృతులతో ఆలయం ఉంటుంది. భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా చెదరకుండా నిర్మించారు. ఆలయానికి ముందు ఉదయ సముద్రం అనే చెరువును నాటి రాజులు తవ్వించారు. ఇప్పటికీ దాని ద్వారానే తాగు, సాగు నీరు అందుతోంది. ఆలయానికి తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో మూడు గర్భగుడులు ఉన్నాయి. ఈ గర్భగుడులు సైతం ఒకే నిర్మాణరీతిలో ఉన్నప్పటికీ కేవలం తూర్పువైపునకు ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చలఛాయ కనిపిస్తోంది. ఛాయా సోమేశ్వర ఆలయం వాస్తుశాస్త్ర పరంగా అద్భుతమని చరిత్రకారులు చెబుతుంటారు. ఛాయసోమేశ్వరాలయం త్రికూఠ ఆలయంగా కూడా ప్రసిద్ధి. గర్భగుడిలో శివలింగం మీదుగా నిరంతర ఏర్పడే ఛాయ ఏ వస్తువుదన్న విషయం నేటికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది.

2002 వరకు వరకు గబ్బిలాల మయం

వేదఘోషతో అలరారిన ప్రాంతం, రాజసం ఉట్టిపడిన నాటి అద్భుత త్రికూట శ్రీఛాయసోమేశ్వర ఆలయం కొన్నాళ్ల క్రితం వరకూ గబ్బిలాల మయమై శిథిలావస్థలో ఉండేది. ఆలయంలో పూజ క్రతువులు లేక శిథిలమై కంపచెట్లమయమైంది. 2002లో శివదీక్ష వేసుకోవడానికి వెళ్లిన మిత్రులందరూ ఆలయ దుస్థితిని చూసి, ఆలయ అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యారు. శివభక్తులతో పాటు రుద్రసేన సభ్యులు ఆలయం అభివృద్ధికి నిర్ణయించుకున్నారు. 2004లో అప్పటి ప్రభుత్వం, పురావస్తుశాఖ, దేవదాయ శాఖల సహకారంతో ఆలయ పాలకవర్గాన్ని నియమించింది. అప్పటి నుంచి క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఒక అద్భుతమైన కోవెల రూపంలో శ్రీఛాయా సోమేశ్వర ఆలయం దర్శనమిస్తోంది. కొన్నేళ్లుగా ప్రతినిత్యం దీపారాధనతో పాటు పూజాక్రతువులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస సంపూర్ణ రుద్రాభిషేకాలు, కల్యాణం, అగ్నిగుండాలు, తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆలయంలో కాలభైరవ కాళికమాత అభయాంజనేయ, నటరాజు స్వామి, రాజరాజేశ్వరీ అమ్మవారు, లక్ష్మీదేవి, నందీశ్వరులు వంటి విగ్రహాలను నెలకొల్పారు.

యునెస్కో గుర్తింపు కోసం

ఛాయసోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం గత ఆలయ అభివృద్ధి కమిటీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు ప్రాంతంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఆ ఆలయ మాదిరిగానే ఛాయాసోమేశ్వర ఆలయానికి కూడా అంతర్జాతీయ ఖ్యాతి లభించడం కోసం కృషిచేస్తోంది. ఇప్పటికే ట్యాగ్‌ పూర్తికావడంతో పాటు ఆలయ చర్రితకు సం బంఽధించిన డాక్యుమెంట్లను అందజేశారు. యునెస్కో పరిశీలనకు పంపించి ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిసారిస్తే త్వరితగతిన యునెస్కో గుర్తింపు లభించే అవకాశాలుం టాయి. యునెస్కో గుర్తింపువస్తే ఆలయానికి దేశ, విదేశాల పర్యాటకుల సందడి పెరగనుంది.

ఆలయ పరిరక్షణలో ‘రుద్రసేన’ కీలక పాత్ర

ఛాయాసోమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కాపాడుకోవడానికి రుద్రసేన కమిటీ ఏర్పాటైం ది. కొన్నేళ్ల క్రితం దేవాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ గట్ల అనంతరెడ్డి నేతృత్వంలో 400మందికిపైగా సభ్యులతో రుద్రసేనను ఏర్పాటు చేశారు. కొలను అభివృద్ధి, చుట్టూ మొక్కలు నాటారు. భక్తులకు సేవలు అందించడంలో సభ్యులు కీలక భూమిక పోషిస్తున్నారు. పురావస్తు శాఖ నిధులకు సంబంధిం చి రూ.38లక్షలతో 2008లో శిథిలమైన నిర్మాణాలను, కంపౌండ్‌ వాల్‌తో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. 100మంది శివభక్తులు ఆలయాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవాలయ పరిసరాల్లో రెండు వేల మొక్కలు నాటారు. ఇందులో కొబ్బరి, ప్యాక్స్‌టైల్స్‌, రుద్రాక్ష, పొన్న, కదంబం వంటి మొక్కలు ఉన్నాయి. దేవతా వృక్షాన్ని కూడా నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు డ్రిప్‌ను ఏర్పాటుచేసి సేంద్రియ ఎరువులతో మొక్కలను సంరక్షిస్తున్నారు. షెడ్ల విస్తరణతో పాటు పార్కింగ్‌ షెడ్‌ నిర్మించారు. వాటర్‌ప్లాంట్‌, సెక్యూరిటీ టవర్‌, కార్యాలయం, యాగశాల నిర్మాణంతో పాటు ఆలయ భూముల పరిరక్షణ కోసం చుట్టూ స్టీల్‌ రేలింగ్‌తో ఫెన్సింగ్‌ చేపట్టారు. ఎలక్ట్రికల్‌ పనులు, మంచినీటి పైపులైన్లను అభిషేకం కోసం ప్రత్యేక వాటర్‌ట్యాంక్‌ను కూడా ఏర్పాటుచేశారు.

శిల్ప సంపదకు కెమికల్‌ వాష్‌ అవసరం

చారిత్రాత్మకమైన శిల్ప సంపదకు కెమికల్‌ వాష్‌ చేయడానికి పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. శిల్పాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శిల్పాలన్నీ పూర్వవైభవం సంతరించుకునేలా విగ్రహాలు, కట్టడాలు దెబ్బతినకుండా కెమికల్‌ వాష్‌ చేయాలి. ఇందుకోసం 12ఏళ్ల క్రితం రూ.28లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఆలయం తేజోవంతంగా విరాజిల్లుతుంది. కోనేరు చుట్టూ నాలుగు వైపులా రాతిమెట్ల నిర్మాణం చేపట్టడంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా కొనేరు మధ్యలో మండపం పునర్నిర్మించాలి. గతంలో ఆ స్థానంలో మండపం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయం చుట్టూ 100ఫీట్ల రోడ్డును నిర్మించాలి. రుద్రసేనలో కీలక సభ్యుడైన అనుముల మండలానికి చెందిన రైతు చింతల వెంకట్‌రెడ్డి దేవాలయం అభివృద్ధి కోసం, రూ.25లక్షల బంగారు, వెండి అభరణాలను సమర్పించారు. ఆలయ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడంతో పాటు యునెస్కో గుర్తింపునకు సహకరించాలి.

గంట్ల అనంతరెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌

ఆలయ సంపద అద్భుతంగా ఉంది

శతాబ్దాల నాటి చారిత్రక సంప ద అద్భుతంగా ఉంది. అనేకసార్లు ఈ దేవాలయాన్ని సందర్శించా. శివలింగాన్ని దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం మర్చిపోలేని అనుభూతి. ఆలయ పరిసరాలు, కోనేరుతో పాటు మొక్కలు, కొబ్బరి చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన పెంపొందుతోంది. దేవాలయం అభివృద్ధి చెందింది.

ఇందిరా, హైదరాబాద్‌

Updated Date - Feb 17 , 2025 | 12:32 AM