పంచకుండాత్మక మహాయాగానికి శ్రీకారం
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:29 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి స్వర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు బుధవారం ఆలయంలో స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు.
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి స్వర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు బుధవారం ఆలయంలో స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. పాంచరాత్రాగమనుసారం స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకలను సర్వసైనాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలిపూజలు నిర్వహించారు. పంచామృత కలశాలకు వేద మంత్రాలతో దర్భ(గరక)లతో పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభువులు, కవచ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి కంకణధారణ చేశారు. రుత్విక్‌వరణం, మృత్యంగ్రహణం, పర్యగ్నీకరణం నిర్వహించి ప్రధానాలయం నుంచి స్వామివారి సేవతో పాటు దీక్షాకంకణాలను మంగళవాయుద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఆలయ ఉత్తర తిరువీధిలో ఏర్పాటు చేసిన యాగశాలకు చేర్చారు. అఖండ దీపారాధన చేసి సంధ్యాకురార్పణ, ద్వారతోరణ ధ్వజకుంభారాధన అనంతరం అంకురార్పణ, మృత్యుంగ్రహణం నిర్వహించారు. నవధాన్యాలను నిర్ధేశించిన పాలికల్లో వేద మంత్రాలతో పవిత్రీకరించి తడిపి మొలకెత్తించే కార్యక్రమమే అంకురార్పణం. భూమిపై గల క్షేత్రాలు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా వర్థిల్లింపడానికి భగవంతుడిని అనుగ్రహింప జేయడానికి ఈ అంకురార్పణం కార్యక్రమం నిర్వహించే ఉద్దేశమని ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. వేద మంత్రాల నడుమ అగ్నిప్రతిష్ట చేపట్టి అర్చక బృందం పారాయణిక పరివారంతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల రుత్వికులు హోమాలు నిర్వహించారు. హైదరాబాద్(కొత్తపేట) చెందిన టి. రాజేష్ అర్చకులు, 108 మంది రుత్వికులకు దీక్షా వస్ర్తాలు అందజేశారు. యాగశాలలో సాయంత్రం మంత్ర హోమాలు, వారుణానువాక హోమం, జలాధివాసం, నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థప్రసాదగోష్ఠి చేసి ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేశారు. వేడుకలు వానమామలై మఠం 31వ మధుర కవి రామానుజ జీయర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి దంపతులు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రఘు, ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, కొడకండ్ల మాధవచార్యులు పాల్గొన్నారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ముఖమండపంలో 108కలశాలు వాటిపై కొబ్బరికాయలు పేర్చి అందులో పంచామృతాలు నింపి పంచసూక్త పఠనాలతో హోమం చేపట్టి ఉత్సవమూర్తులను, ఆలంకార మూర్తులను అభిషేకించారు.
సమన్వయంతో పనిచేయాలి
స్వర్ణ గోపురం ప్రారంభోత్సవానికి ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ అధికారులకు సూచించారు. యాదగిరి గుట్టపై బుధవారం యాగశాలను సందర్శించి కొండకింద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎం. హనుమంత రావు, ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకలకు వీఐపీలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత సభలు
సంప్రోక్షణ మహాత్సవాల్లో భాగంగా బుధవారం సంగీత సభలు నిర్వహించారు. సాయంత్రం 6నుంచి 7గంటల ఎం.వి. సుధాకర్ (విజయవాడ) కర్ణాటక సంగీతం, 7 నుంచి 8 వరకు శాంకరి కూచిపూడి నృత్యం(హైదరాబాద్) కూచిపూడి నృత్యం, 8 నుంచి 9గంటల వరకు ఇందిరా కళానికేతన్ హైదరాబాద్ (మహతి బృందం) కూచిపూడి నృత్యం భక్తులను ఆకట్టుకుంది.
వైభవంగా గిరిప్రదక్షిణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి వేడుకలు.. గిరిప్రదక్షిణ పర్వాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. స్వామివారి స్వాతి నక్షత్రం పూజల్లో భాగంగా అర్చకులు ఆలయంలో అష్టోత్తర శత ఘటాభిషేకం చేపట్టారు. తెల్లవారుజామున గిరిప్రదక్షిణ మహోత్సవంలో స్వామివారిని స్తుతిస్తూ కళాకారుల కోలాటాలు, నృత్యాలు, భజనలు, కీర్తన లతో హోరెత్తించారు. తెల్లవారుజామున 5.45గంటలకు అర్చకులు వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విధ్వాంసులతో మంగళవాయిద్యాల నడుమ అర్చకులు హారతి సమర్పించగా ఈవో భాస్కర్‌రావు ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివ చ్చారు.
యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా మూర్తులను అభిషేకరించి తులసీదళాలతో సహాస్రనార్చనలు నిర్వహించారు. ప్రధానాల యం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహిం చారు. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు రూ. 24,44,864 ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.
సర్వాంగసుందరంగా స్వర్ణ గోపురం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ గోపురం ఆవిష్క రణకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నాలుగు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో 108మంది రుత్వికులు, పారాయణికులు హోమం నిర్వహిస్తారు. 23వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో పాల్గొని మహాకుంభాభిషేకం నిర్వహించను న్నారు. ఈ క్రతువు నిర్వహణకు ఆలయ ఉత్తర తిరువీధిలో యాగశాలను ఏర్పాటు చేశారు. కోతుల నుంచి రక్షణకు నైలాన్ నెట్‌తో సిద్ధం చేశారు. హోమాల్లో నాలుగు రోజుల పాటు వివిధ మంత్రాలు పఠిస్తూ స ముద్రా లు, నదులను అవాహన చేస్తూ యజ్ఞకుండాల్లో ఆవాహన చేసి యాగంలో పాల్గొనే వేద పారాయణికులు, రుత్వికులకు దీక్ష వస్త్రాలు అందజేస్తారు.
దేవతాహ్వానం, సమిదలు
నాలుగు దిక్కుల్లో బ్రహ్మ, క్షేత్రపాలకుడు, సోముడును ఆహ్వానించి ఈశాన్యంలో మాత్రం అంకురార్పణకు పాలికలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో కవచమూర్తులను అధిష్టించి నదీజలాలతో కూడిన కలశం ఏర్పాటుకు వేదికను ఏర్పాటు చేశారు. వేదికకు చుట్టూ తూర్పు వాసుదేవ కుండం, దక్షిణం ప్రద్దున్న కుండం, పశ్చిమం సంకర్షణ కుండం, ఉత్తరం అనురుద్ద కుండం, ఈశాన్యంలో మహాలక్ష్మీకుండంతో ఐదు హోమకుండాలు ఏర్పాటు చేశారు. అగ్నిమథనం చేసి నరసింహ, సుదర్శన, గరుత్మంతుడి, లక్ష్మీదేవి మంత్రాలు, దివ్య విమాన రాజగోపురం(బంగారుమయం)లోని దేవతలకు అవిస్సులు అందజేస్తారు. యాగశాలలోని హోమాల్లో మర్రి, రావి, మోదుగు, జువ్వి, మామిడి సమిదలు వినియోగిస్తారు.
రామనుజ జీయర్‌స్వామి పర్యవేక్షలో కార్యక్రమాలు
ఈ నెల 22వ తేదీ వరకు లక్ష్మీ, నరసింహ, సుదర్శన, రామాయణం, భాగవతం, మూల మంత్ర హవనాలు, మూల మంత్ర జపాలతో పాటు ఉదయం సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు 60మంది రుత్వికులు నిర్వహిస్తారు. చివరి రోజు ముందుగా దిష్టికుంభం, నైవేద్యం, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమర్పించి మహా కుంభాభిషేక కలశంతో వానమామలై 31వ మధుర పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వర్ణ గోపురానికి పంచకుండాత్మక మహాయాగం నిర్వహించనున్నారు.