నేత్రపర్వంగా పార్వతీ పరమేశ్వరుల పరిణయం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:21 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుడి శివరాత్రి మహోత్సవాల్లో మూడోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు యాగశాలలో రుద్రహావనం, రాత్రి 7గంటలకు పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి పరిణయ మహోత్సవ వేడుకలు నేత్రప ర్వంగా సాగాయి.

భువనగిరిఅర్బన్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుడి శివరాత్రి మహోత్సవాల్లో మూడోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు యాగశాలలో రుద్రహావనం, రాత్రి 7గంటలకు పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి పరిణయ మహోత్సవ వేడుకలు నేత్రప ర్వంగా సాగాయి. పరమేశ్వరుడికి నిత్యపూజలు, ఆలయ మండపంలో కలశారాధనలు, మూలమంత్ర, చతుర్వేద పఠనాలు, మండపారాధనలు, శైవసంప్రదాయ రీతిలో నిర్వహించారు. రుద్రవాహనం అపమృత్యు నివా రకమని, పరమేశ్వరుడికి ఇష్టమైన వేడుకని పురోహితులు వివరించారు. సాయంత్రం సోమ కుంభార్చనలు, నిత్య కైంకర్యాలు చేప ట్టిన అర్చకులు పార్వతీ, పరమేశ్వరులను పట్టు వస్ర్తాలు, ముత్యాలు బంగారు ఆభరణాలు, సుగంధ భరితమైన పూలమాలలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం నిర్వహించారు. ముక్కంటికి అలంకార సేవను వేద మంత్రాలతో వేదికపై తీర్చిదిద్ది షోడషోపచార పూజలు నిర్వహించారు. వేదపండితుల, పురోహిత బృందం ముందుగా విఘ్నేశ్వరుడికి తొలి పూజలతో కల్యాణతంతు ఆరం భించారు. స్వామికి యజ్ఞోప వీతధారణ జరిపి జీలకర్రబెల్లం, లగ్నాష్టకాలు, మాంగల్య పూజ పర్వాలను నిర్వహించారు. పండితుల వేద మంత్రాల పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల, భక్తుల జయజయ ద్వానాలు, హరహర నామస్మరణల నడుమ రామలింగేశ్వరుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ ధారణ వేడుకలు శోభాయమానంగా సాగింది. దేవస్థాన ఈవో ఏ. భాస్కర్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకలను శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నర్సింహాచార్యులు, సిద్దాంతి గౌరీభట్ల సత్యనారాయణశర్మ, పురోహిత బృందం, రుత్వికులు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి. నర్సింహ్మమూర్తి దంపతులు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రమేష్‌బాబు, రఘు, దూశెట్టి క్రిష్ణ, పర్యవేక్షకులు దీరావత్ రామరావునాయక్, పాల్గొన్నారు.
మహోత్సవంలో నేడు
శివరాత్రి మహోత్సవాల్లో బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రుద్రాభిషేకములు, రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేక పూజలు కొనసాగుతాయి.
క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, నిత్యకల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణీ వద్ద ఆంజనేయస్వామికి ఆలయంలో అర ్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు తమల పాకులు, సింధూరం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆంజనే యుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రధానాలయంలో స్వయంభువులను సుప్రభాత సేవ లతో మేల్కొల్పి నిజాభిషేకం, నిత్యార్చనలు, ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను పాంచారాత్రగ మశాస్త్రరీతిలో నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని రామలింగేశ్వ రస్వామికి ముఖ మండపంలోని స్ఫటిక మూర్తులకు నిత్య పూజలు, నిత్య రుద్రహవనం శైవాగమన పద్ధతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ చేపట్టారు.
పరంజా తొలగింపు
స్వర్ణగోపురం చేరుకునేందుకు ఆలయ దక్షిణ తిరువీధి నుంచి ఆలయం పైకి, అక్కడి నుంచి ఐదంతస్తుల పంచతల స్వర్ణ విమాన రాజగోపురం ఎక్కేందుకు తరాంజను ఏర్పాటు చేశారు. స్వర్ణ గోపుర ఆవిష్కరణ ప్రక్రియ పూర్తయినందున మంగళవారం పరాంజాను తొలగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీలు శ్రమించి తొలగించారు.