నేత్రపర్వంగా ఎదుర్కోలు మహోత్సవం
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:38 AM
యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశేష ఘట్టమైన ఎదుర్కోళ్ల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది.

ఉదయం సింహవాహనం.. రాత్రి అశ్వవాహనంపై ఊరేగింపు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశేష ఘట్టమైన ఎదుర్కోళ్ల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. సాయంత్రం వేద పారాయణాలు, హవనం చేపట్టి స్వామి అమ్మవారిని బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్యమనోహరంగా అలంకరించారు. వేద మంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహనంపై నృసింహుడు, ముత్యాల పల్లకిలో లక్ష్మీఅమ్మవారిని ఆలయ కల్యాణమండపానికి ఊరేగింపుగా చేర్చి ఎదుర్కోలు మహోత్సవం సంప్రదాయరీతిలో నిర్వహించారు. అర్చక, అధికార బృందం ఆధ్మాత్మిక వాదసంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. లోక కల్యాణం.. విశ్వశాంతి కోసం జగద్రక్షుకులైన లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి తులా లఘ్న సుమూహుర్తంలో జరపడానికి వేద పండితులు ముహూర్తం నిర్ణయం జరిపారు.
ఆలయంలో ఉదయం
స్వామివారిని యోగానంద లక్ష్మీనారసింహుడిగా అలంకరించి సింహ వాహనంపై ఉదయం తిరువీధుల్లో ఊరేగించారు. వేకువజాముననే స్వయంభువులను కొలుస్తూ నిత్యారాధనలు, ఆలయ మండపంలో దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు, క్షేత్రమహాత్య పఠనాలను రుత్వికులు, అర్చకులు చేపట్టారు. యాగశాలలో పంచస్తూకాలు, మూల మంత్రాలతో హోమ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యమనోహరంగా యోగనంద లక్ష్మీనారసింహుడిగా అలంకరించి సింహవాహనంపై అధిష్టింపజేసి తిరువీధులలో ఊరేగింపు నిర్వహించారు. అలంకార సేవకు దేవస్థాన కల్యాణ మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లంథిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు భట్టర్ సురేంద్రాచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు, అర్చకబృందం, రుత్వికులు నిర్వహించగా వేడుకల్లో ఈవో ఏ. భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో దూశెట్టి క్రిష్ణ, పర్యవేక్షకుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
సింహవాహన విశిష్టత
బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ అలంకారసేవల్లో అలంకరించి తిరువీధి సేవలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. సింహ వాహనంపై యోగనందుడిగా ఊరేగించే వేడుక అత్యం ముక్తి ప్రదమని పురాణాలు చెబుతున్నాయని, సింహము శౌర్యమునకు, సహనమునకు ప్రతీకని ఈ రెండు లక్షణాలు కలిగిన తత్వమే సింహ వాహన విశిష్టత.
ఆశ్వవాహన విశిష్టత
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను ఆశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి ఆశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి రూపంలో దర్శనమిస్తాడు. తన నామ సంకీ ర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. ఆశ్వం సర్వ లక్షణ లక్షితమూ నాలుగు వేదాలకు ప్రతీకమై సత్త్వగుణానికి సంకేతమై తెలుపు వర్ణం కలిగి ఉండి స్వామి అమ్మవారికి ప్రీతిని కలిగించి ప్రధాన భూమికను పోషించడమే ఆశ్వ వాహన విశిష్టతని దేవస్థాన ప్రధా నార్చకులు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. బ్రహ్మో త్సవాల్లో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సోమ వారం ఉదయం స్వామివారికి తిరుమంజనాలు, అలంకార సేవల్లో శ్రీరామావతారంలో హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహన సేవలోస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
యాదగిరికొండపై భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన ఆదివారం భక్తులతో రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తజనుల రద్దీ కొన సాగింది. ప్రత్యేక దర్శనాలకు అర్ధగంట ధర్మదర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 49,00,371ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొపిన అర్చకులు నిత్యపూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు.
మహాకుంభాభిషేకానికి హోమగుండాలు
ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమై 23న నిర్వహించే కళావరోహణతో కార్య క్రమం ముగుస్తుంది. ఈ మహా క్రతువుకు ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొంటారని ఈవో తెలిపారు. ఆలయ ఉత్తర తిరువీధిలో 36/36 విస్తీర్ణంలో హోమ గుండాలు సిద్ధం చేస్తున్నారు. చంద్ర, త్రిభుజ, చతురస్ర తదితర ఐదు హోమ గుండాల్లో నలుగురు దేవతల హవనం నిర్వహిస్తారు. యజ్ఞ శాలలో 15మంది యాజ్ఞికులు, వేద పారాయణాలు 16మంది పారాయణీ కులు, నారసింహమూలమంత్రం, సుద ర్శన మూల మంత్రం, లక్ష్మీదేవి మూల మంత్రం తదితర మూలమంత్ర పఠనాలకు 108మంది రుత్వికులు, భోజన వంటలు చేసేందుకు 15మంది అదనంగా పాల్గొంటారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో మహాయాగం నిర్వహించనున్నారు.