Farmers: సాగు చేయని భూములకు రైతు భరోసా వద్దు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:41 AM
సాగు చేయని, పంటలు పండించని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
సర్కారుకు రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సాగు చేయని, పంటలు పండించని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాళ్లు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కంపెనీలు పెట్టడం కోసం కొనుగోలు చేసిన భూములకు రైతు భరోసా ఇవ్వడం ఎందుకని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
పంటలు వేయని భూస్వాములు, సంపన్నుల లక్షల ఎకరాలకు కోట్లాది రూపాయలు రైతు భరోసాగా ఇవ్వటం సమంజసం కాదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేయడం బాధ్యతారాహిత్యమని, ఇప్పటికైనా రైతు భరోసా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.